రక్త దాతా సుఖీభవ

రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం తీసుకుంటారు. దీన్ని మూడు భాగాలుగా విభజించి ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చు. రక్తహీనత ఉన్న వారికి గానీ, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి గానీ మనం దానం చేసిన రక్తంలోని ఎర్ర రక్తకణాలను ఎక్కిస్తారు. ఇక హీమోఫీలియా వ్యాధి ఉన్న వారికి అదే రక్తంలోని ప్లాస్మాను, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారికి ప్లేట్‌లెట్స్ అం‌దజేస్తారు. ఇలా మనం దానం చేసే ఒక్క యూనిట్‌ ‌రక్తం మరో ముగ్గురికి ప్రాణాలు పోస్తున్నది. అంటే రక్తానికి అంత శక్తి ఉంది.రక్తాన్ని కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేయలేము.ఎందుకంటే సైన్సు ఇప్పటికే ఎన్నో విషయాలను కనిపెట్టింది. మరెన్నో కనిపెడుతోంది కూడా. శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందినా  ఇప్పటికీ   కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయగల సైన్సు అభివృద్ధి చెందలేదు. అదే గ్రూపునకు చెందిన మరొక వ్యక్తి నుండి రక్తాన్ని దానంగా స్వీకరించడం తప్ప రక్తానికి మరొక ప్రత్యామ్నాయమే లేదు. సాధారణంగా వైద్యులను వైద్యో నారాయణో హరి అంటారు.అంటే వైద్యులు భగవంతుడితో సమానం.ఎందుకంటే వైద్యులు ప్రాణాలు నిలబెడతారు .రక్తాన్ని దానం చేసి ప్రాణాలను నిలబెడతారు రక్తదాతలు.రక్తం అందించడానికి అనారోగ్యం లేకుండా 45 కిలోలు బరువు ఉంటే సరి పోతుంది.ముఖ్యంగా మన రక్తంలో హిమోగ్లోబిన్‌ ‌స్ధితిని కూడా పరిశీలించి తగినంత ఉంటేనే రక్తం తీసుకుంటారు.ఇది కూడా ఒక యూనిట్‌ ‌మాత్రమే తీసుకుంటారు.18 నుంచి 60 ఏండ్లలోపు వారెవరైనా రక్తదానం చేయొచ్చు.మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసిన 21 రోజుల్లోనే దేహానికి అవసరమైన రక్తం మళ్లీ తయారవుతుంది. జీవిత కాలంలో ఒక వ్యక్తి 68 సార్లు రక్తదానం చేయొచ్చు.పురుషులు ప్రతి మూడు నెలలకోసారి, మహిళలు ఆర్నెళ్లకోసారి బ్లడ్‌ ‌డొనేట్‌ ‌చేయొచ్చు.

రక్తం దానం ఆవశ్యకత
రక్త దానం చేయడం వలన దాతలకు కూడా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే రక్త దానం చేయడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు 88 శాతం తగ్గుతాయి.కారణం ఏమిటంటే రక్తదానం చేయడం వలన శరీరం నుంచి 225 నుంచి 250 మిల్లిగ్రాముల ఇనుము పోతుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.రక్త దానం చేస్తే ఊబకాయం కూడా తగ్గుతుంది.రక్త దానం చేసిన తరువాత ఒక్క 48 గంటల లొనే ఆ రక్తాన్ని భర్తీ చేసుకునే వ్యవస్ధ మన శరీరంలో ఉంది.అందుచేత ప్రతీ 3 నెలలకు ఒక సారి నిర్భయంగా రక్త దానం చేయొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు వంద సార్లు పైబడి రక్త దానం. చేసి పూర్తి ఆరోగ్య వంతులుగా ఉన్న వారు కూడా అనేక మంది ఉన్నారు.

లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో రక్త దానం అనేది చాలా సమస్యగా తయారయ్యింది. ఎవ్వరు బయటకు వచ్చే పరిస్ధితి లేదు.లాక్‌ ‌డౌన్‌ ‌విరమణ సమయంలో కూడా ఇదే పరిస్ధితి చాలా రోజులు కొనసాగాయి.దీనివలన బ్లడ్‌ ‌బ్యాంకుల్లో రక్త నిల్వలు వేగంగా తగ్గిపోయాయి.హాస్పిటల్‌  ‌కి వెళ్లి రక్త దానం చేయడానికి రక్త దాతలు ధైర్యం చేయలేక పోయారు. లాన్సెట్‌ ‌పత్రిక చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా రక్త కొరత సమస్యను ఎదుర్కొనేది భారత్‌ ‌మాత్రమే అని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నిట్లో పది కోట్ల యూనిట్ల రక్త కొరత ఉంటే అందులో నాలుగు కోట్ల యూనిట్ల కొరత భారత్‌ ‌లొనే ఉందని లాన్సెట్‌ అధ్యయనం స్పష్టం చేసింది. రక్తం కొరత లేకుండా ఉండాలి అంటే ప్రతీ 1000 మందిలో 85 మంది రక్త దానం చేస్తే అసలు సమస్యే ఉండదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గణాంకాల ప్రకారం చూస్తే ప్రతీ 1000 మందిలో కేవలం31 మందే రక్త దానం చేస్తున్నట్లు తేలింది.ఈ లెక్కలు బట్టి మన రక్తం యొక్క కొరత తీరు తెలుస్తుంది. మన దేశంలో సుమారు 60 శాతం మరణాలు రక్తం సకాలంలో లభించక పోవడం వలన జరుగుతున్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతున్నా.. లభ్యతో మాత్రం తీవ్ర లోటు ఉంటున్నది.

దేశవ్యాప్తంగా రక్తం అందుబాటు గురించి ఈ రక్త కోష్‌ అనే వెబ్‌ ‌సైటును కేంద్రం నిర్వహిస్తుంది.రక్తం అవసరమైనవారూ, రక్తం ఇవ్వాలనుకునేవారూ… అందరికీ అవసరమైన సమాచారం ఇందులో ఉంటుంది. రాష్ట్రాలన్నీ ఎప్పటికప్పుడు  వివరాలను అప్‌డేట్‌ ‌చేస్తాయి. దీని వల్ల బ్లడ్‌బ్యాంకుల కోసం వెతుక్కునే టైమ్‌ ‌వృథా కాదు. అరుదుగా లభించే బ్లడ్‌ ‌గ్రూపుల రక్త  దాతల జాబితాతో సహా పలు వివరాలు ఇందులో ఉన్నాయి. రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ఇందులో నమోదు చేసుకోవచ్చు.ఈ రక్త దానం  ప్రాధాన్యతను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 మేలో అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. రక్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్‌ , ‌నెగటివ్‌ ‌గ్రూపులను గుర్తించిన కార్ల్ ‌లాండ్‌ ‌స్టీవర్‌ ‌జన్మదినమైన జూన్‌ 14‌ను  వరల్డ్ ‌బ్లడ్‌ ‌డోనర్‌ ‌డేకి డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసింది.ప్రతీ సంవత్సరం ఒక నినాదంతో ఈ రక్త దాన దినోత్సవాన్ని జరుపుతోంది. సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు మరియు స్వచ్ఛందంగా, చెల్లించని రక్తదాతలకు వారి ప్రాణాలను రక్షించే బహుమతుల కోసం కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.  రక్తదానాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం2022లోరక్తదానం చేయడం సంఘీభావానికి సంబంధించిన చర్య అనే ధీమ్‌ ‌తో ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని మెక్సికో దేశంలో జరుపుతున్నారు. ప్రాణాలను రక్షించడంలో మరియు సంఘాలలో సంఘీభావాన్ని పెంపొందించడంలో స్వచ్ఛందంగా రక్తదానం అందిద్దాం.ప్రాణాలను కాపాడుదాం.

image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్‌…ఐ.‌పోలవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *