భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి పునాది వోటు. వోటు వేయకపోతే చరిత్రను విస్మరించి భవిష్యత్తును వదులుకునేవాళ్ళమవుతాం. వోటు వేసే వారు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులని చెప్పొచ్చు. వోటు వేసే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు., ఎందుకంటే ఇది మన దేశానికి వోటు రూపంలో మన సహకారం అందిస్తున్నామని అర్థం. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు ఇవ్వబడిరది. వోటు వేయడం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దేశ భవిష్యత్తు మనం వేసే వోటు మీదనే ఆధారపడి ఉంటుంది.
వోటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. బలమైన దేశాన్ని సృష్టించేందుకు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఓటు చాలా అవసరం. ప్రతి పౌరుడు లేదా పౌరురాలు వోటు వేయడానికి హక్కును కలిగి ఉంటారు. మనం వోటు వేసినప్పుడు మన విలువలు అమలులోకి వస్తాయి మరియు మన గొంతులు వినబడతాయి. వోటు ద్వారానే మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే దేశ ప్రగతికి, అభివృద్ధికి ఆటంకం ఏర్పడి దేశ ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ది కుంటుపడుతుంది. వోటు వేయకపోతే ఫిర్యాదు చేసే హక్కును కోల్పోతాం.
వోటు ప్రాముఖ్యత : వోటు హక్కు పౌరులకు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే మరియు ఎన్నికైన నాయకులను జవాబుదారీగా ఉంచే అధికారాన్ని ఇస్తుంది. పౌరులు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును వినియోగించుకోవడానికి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొనడానికి ఇది అనుమతిస్తుంది. వోటింగ్ అనేది సామాజిక, రాజకీయ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ న్యాయమైన పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియను నిర్ధారిస్తుంది. ప్రజల సంకల్పం, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఇది సహాయపడుతుంది. వోటు వేయడం ద్వారా పౌరులు వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, అభివృద్ధికి దోహదపడే నేతలను ఎన్నుకునే అవకాశాన్ని ఇస్తుంది. వోటింగ్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు అధికారం కల్పిస్తుంది. వారి జీవితాలను ప్రభావితం చేసే విషయాలలో చెప్పడానికి వీలు కల్పిస్తుంది. వోటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు. పౌర కర్తవ్యం కూడా. దేశం యొక్క మొత్తం పురోగతికి వోటు
దోహదం చేస్తుంది.
యువత చురుకుగా పాల్గొనాలి: 1988లో ప్రజాస్వామ్యంలో యువ గొంతులు పోషించే కీలక పాత్రను గుర్తించి భారతదేశం అర్హతగల వోటరు వయస్సును 21 నుండి 18కి తగ్గించింది. 1989 నాటి అరవై-మొదటి సవరణ బిల్లులో పొందుపరచబడిన ఈ మార్పు వోటింగ్ ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.ఎన్నికల ప్రక్రియలో పౌరులు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గోవాలి. చురుకైన పౌరులపై బలమైన ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది. దేశ భవిష్యత్తు అర్హులైన ప్రతి వోటరు చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా యువత ప్రజాస్వామ్యంలో వోటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో తప్పకుండా వోటు హక్కును వినియోగించు కోవాలి. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా వోటు హక్కును కల్పిస్తున్నది.
వోటు మనందరినీ సమానం చేస్తుంది. ఇది కులాలు మతాలు లేదా తరగతుల మధ్య వివక్ష లేని ఏకైక విషయం.
స్వతంత్ర భారతదేశపు మొదటి వోటరు : ఈయన పేరు శ్యామ్ శరణ్ నేగి. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. యాదృచ్ఛికంగా ఈ వ్యక్తిని స్వతంత్ర భారతదేశపు మొదటి వోటరు అని కూడా పిలుస్తారు. శ్యామ్ శరణ్ నేగి 1917 జూలై 1న హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పాలో జన్మించారు. అక్టోబర్ 25 ,1951 నాడు కిన్నౌర్లో మొదటిసారిగా వోటు వేశారు.
-జనక మోహనరావు దుంగ
అధ్యాపకుడు 8247045230





