దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు. దేశంలో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాలు బిజెపి విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మరో ఒకటిన్నర రెండేళ్ళలో రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తరాదిన పట్టు సడలినా, దక్షిణాది మెజార్టీతో తిరిగి అధికారంలో కొనసాగవొచ్చన్న బిజెపి ఆలోచనగా కనిపిస్తున్నది. అందుకే కొంతకాలంగా దక్షిణాదిపైన దృష్టి సారిస్తూ వొస్తున్నది. దక్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా తెలంగాణపైనే కాన్సట్రేషన్ చూపుతున్నదనడానికి జరుగుతున్న పరిణామాలే ధృవపరుస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో మరింత జోష్ నింపడానికి కారణంగా మారాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా స్థానిక ప్రజలు బిజెపికి మెరుగైన ఫలితాలనివ్వడమయింది.
ఇవి బిజెపి లక్ష్యం చేరువ అవడానికి కారణంగా మారాయి. ప్రజలు తమ పార్టీపట్ల చూపిస్తున్న అభిమానానికి వారికి మరింత దగ్గర కావాలన్న వ్యూహంతో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలనుకూడా ఇక్కడే నిర్వహించుకుంది. ఇదిలా ఉంటే తాజగా రాజ్యసభకు నలుగురిని దక్షిణాదిప్రాంతంవారినే నామినేట్ చేయడం కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నది. తెలుగులో సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి , రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను, సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని ట్వీట్ చేయడం చూస్తే, తమ గమ్యానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు అనిపిస్తున్నది. నామిటేడ్ చేయబడినవారి శక్తి సామర్ధ్యాలు, వారు ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగ పడుతారన్నది పక్కకు పెడితే దక్షిణాదిని నిర్లక్ష్యం చేయలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అవుతుందన్నది బిజెపి ఎత్తుగడ. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ మూలాలు ఎక్కడివైనా ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉంటుండంవల్ల తెలంగాణనుండి ఆయనకు అవకాశం కల్పించామని బీజేపీ ఆలోచన గా కనిపిస్తున్నది అనుకోవాలి. ఆయన చేసిన రచనలు దేశ, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయని ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. మిగతా వారిలో కేరళ నుండి పరుగుల రాణి పీటీ ఉష, తమిళనాడు నుండి సంగీత దర్శకుడు ఇళయరాజను, కర్నాటక ధర్మస్థలి నుండి విరేంద్ర హెగ్గడేను నామినేట్ చేశారు.
మొదటినుండి తెలంగాణపైనే బిజెపి దృష్టి సారిస్తూ వొస్తున్నది తెలియందికాదు. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయటం ద్వారా దక్షిణాదిలో విస్తరించాలన్నది లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అయితే అనుకోకుండా కర్నాటకలో ఆ పార్టీకి చంపుడు పందెం పుట్టినట్లు అయింది. ఇక పక్కనే ఉన్న తెలంగాణ విషయంలో పావులు కదపటం ఇప్పుడు ఆ పార్టీకి సులభంగా మారింది. తాజాగా ఇక్కడ మూడు రోజులపాటు ఏర్పాటుచేసుకున్న ఆ పార్టీ జాతీయ సమావేశాలు కూడా తమ లక్ష్యంలో భాగంగానే అన్నది సుస్పష్టం. ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత టార్గెట్ చేయాలనుకున్నారో అంతచేయగలిగామన్న సంతృప్తిని ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకులు వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చినంత ప్రాధాన్యం దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడంలేదన్న ఆరోపణ చాలాకాలంగా వినిపిస్తున్నది. నిధులు, కేంద్ర పథకాలను కేటాయించే విషయంలో దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నదన్న విమర్శ ఉంది. అందుకే •దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్న విషయం తెలియంది కాదు. ఈ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి బిజెపికి ప్రత్యమ్నాయంగా మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే విషయంలో చర్చోపచర్చలు జరుపుతున్న విషయంకూడా తెలియందికాదు. ఈ పరిస్థితిలో దక్షిణాది వారికి ఏదో ఒక అవకాశం కల్పించడంద్వారా ఆ రాష్ట్రాల వారి భావోద్వేగాలను చల్లార్చవొచ్చన్నది బిజెపి ఆలోచనగా తెలుస్తున్నది. అందులో భాగంగానే బిజెపి కేంద్ర నాయకత్వం ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను రాజ్యసభకు ఎంపిక చేసింది.




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల