ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
జాతీయ పండుగల నిర్వహిస్తే దేశానికే గర్వకారణం
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన…వనదేవతలకు మంత్రుల మొక్కులు
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతరకు వొచ్చే ఆర్టీసి బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొన్నం పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు , క్యులైన్ వార్డులు ,ఆర్టీసి ఉద్యోగుల షెల్టర్ల గురించి మంత్రికి ఆర్టీసి ఎండి సజ్జనార్ వివరించారు. అనంతరం వనదేవతలు సమక్క సారలమ్మలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..మేడారం జాతరకు దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుందని, దీనిని జాతీయ ఉత్సవంగా జరపాలని కోరారు. జాతీయ ఉత్సవానికి ఉండే అన్ని అర్హతలు సమ్మక్కసారలమ్మ జాతరకు ఉన్నాయన్నారు.

మేడారం జారతను జాతీయ ఉత్సవంగా జరుపుకుంటే దేశానికే గర్వకారణమని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు పద్నాలుగన్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని, సమ్మక్క సారలమ్మ జాతరకు వొచ్చే మహిళలకు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ప్రతి రోజూ జాతరకు వొచ్చే లక్షా 20 వేల మందిలో 70 వేల మంది ఆర్టీసీలో ప్రయాణం చేసిన వారే ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీ సేవలు విజయవంతంగా నిర్వహిస్తే జాతర విజయవంతం అయినట్లేనన్నారు. 16 నుంచి మేడారంలో ఏర్పాటు చేసిన ఆర్టీసి క్యాంపులు ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వివిధ జిల్లాల్లో 51 కేంద్రాల నుంచి 6వేల బస్సులు నడుస్తాయి. ఇంకా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బస్సులను పంపిస్తామని, మేడారం జాతర తరువాత కూడా రెగ్యులర్ బస్సులు నడుస్తుంటాయని, 10 ఎకరాల స్థలం అదనంగా ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిందని జాతరకు వొచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆర్టీసి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ఎండి సజ్జనర్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లు, క్యూలైన్లు, ఆర్టీసి క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు భక్తులకు ఇబ్బందులూ లేకుండా రావాలని, మేడారం జాతరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, భక్తులకు తాగు నీరు, ఆరోగ్యం తదితర అన్ని అంశాలపై అప్రమత్తంగా ఉన్నామని మంత్రి తెలిపారు. గతంలో రెండు వేల బస్సులు నడిపేది..ఇప్పుడు 6 వేల బస్సులు నడుపుతున్నామని, గతంలో కంటే ఈసారి లక్షలాది భక్తులు అదనంగా వొచ్చే అవకాశం ఉందని, ఎంతమంది వొచ్చినా ఇబ్బందులూ లేకుండా ఆర్టీసి అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆర్టీసీకి సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని తెలిపారు.




