గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన వీడియో అందరిని ఉలిక్కిపడేలా చేసింది. బాధిత మహిళలపై దాదాపు మూడు నెలల క్రితం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ట్విట్టర్లో వారిని ఊరేగిస్తున్న వీడియో వైరల్ కావడంతో గురువారం మాత్రమే ఈ భయానక సంఘటన బహిర్గతమైంది. గడిచిన 78 రోజులుగా మణిపూర్ సమస్యపై స్పందించని దేశ ప్రధానిని ఒక్కసారిగా తన మౌనాన్ని వీడేలా చేసిందీ సంఘటన. సంఖ్యాపరంగానూ, రాజకీయంగానూ శక్తివంతమైన మెయిటీ (మైతేయి) కమ్యూనిటీ మరియు రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఎక్కువగా నివసించే మైనారిటీ కుకీ-జోమి తెగల మధ్య హింస ప్రారంభమై మే నెల మొదట్లో మణిపూర్‌లో మంటలు చెలరేగాయి. అప్పటి నుండి వందల మందికి పైగా మరణించారు. పెద్ద సంఖ్యలో చర్చిలతో సహా ఆస్తులు ధ్వంసమయ్యాయి. వేలాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోయి పొరుగున ఉన్న మిజోరాంలోని సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. మెయిటీల పట్ల పక్షపాతంగా వహించే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడానికి పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడానికి పరకాష్టగా అనేక హేయమైన సంఘటనలు జరిగాయి.
తమకు అధికారిక గిరిజన హోదా ఇవ్వాలనే మైతేయిల నుండి వచ్చిన డిమాండ్లకు వ్యతిరేకంగా కుకీలు నిరసనలు చేయడం ప్రారంభించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అలా జరిగితే కుకీల ప్రాంతాలలో భూమిని కొనుగోలు చేసే హక్కు పొందడంతోపాటు, వారి ప్రాంతాల్లో స్థిరపడేందుకు మైతేయిలకు వీలు కల్పిస్తుంది. ఇది కుకీల అస్థిత్వానికే పెద్ద దెబ్బ. దాదాపు 33 జాతులు, తెగలతో రాష్ట్రం చాలా వైవిధ్యమైన రీతిలో విభజించబడింది. ఇక్కడ దాదాపు 40 తిరుగుబాటు గ్రూపులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. భద్రతా దళాలకు శోధన, స్వాధీనం అధికారాలను కలిపించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) వంటి వివాదాస్పద తిరుగుబాటు నిరోధక చట్టాలకు వ్యతిరేకంగా మెయిటీ, నాగా మరియు కుకీ తిరుగుబాటుదారులు భారత భద్రతా దళాలను తరచుగా లక్ష్యంగా చేసుకుని సుదీర్ఘమైన సాయుధ పోరాటాలను నిర్వహిస్తున్నారు. ఇదేసమయంలో మైతేయి, నాగా మరియు కుకీ మిలీషియాలు కూడా విరుద్ధమైన మాతృభూమి డిమాండ్లపై ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈసారి మాత్రం ఆ సంఘర్షణ జాతి అస్థిత్వ పోరాట రూపాన్ని సంతరించుకున్నది. దీంతోపాటుగా అనేక అంతర్లీన కారణాలు ఈ అల్లర్లకు ఊతమిచ్చాయి. మైతేయి నేతృత్వంలోని ప్రభుత్వం డ్రగ్స్‌పై సాగిస్తున్న యుద్ధం తమ వర్గాలను నిర్మూలించేందుకు తెరలేపిందని కుకీలు అంటున్నారు. అంతేకాకుండా మయన్మార్ నుంచి అక్రమ వలసలు కూడ ఈ ఉద్రిక్తతలను పెంచాయి. పెరుగుతున్న జనాభా కారణంగా భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. అదేసమయంలో నిరుద్యోగ సమస్య పెరిగి యువతను వివిధ మిలీషియాల వైపు మరలేలా చేసింది.
మణిపూర్‌లోని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గసగసాల సాగును లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద “డ్రగ్స్‌పై యుద్ధం” ప్రచారాన్ని ప్రారంభించింది. 2017 నుండి ప్రభుత్వం 18,000 ఎకరాలకు పైగా గసగసాల పొలాలను ధ్వంసం చేసింది. వాటిలో ఎక్కువ భాగం కుకి నివాస ప్రాంతాలలో ఉన్నాయి. ఈ అంశం కుకీలకు ప్రభుత్వం మధ్య విభేదాలను తీవ్రతరం చేసింది. గసగసాలు పండించే గ్రామాలలో సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించడం అగ్నికి ఆహుతిచ్చినట్టైంది. అదేసమయంలో కుకిలను సెలెక్టివ్ టార్గెట్ గా పిలవడానికి వ్యతిరేకంగా కొండ జిల్లాలలో సామూహిక నిరసనలు ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లుగా రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెరుగుతోంది. దానీ కారాలు కొన్ని స్థానిక విశ్వాసాలు, అభ్యాసాలకు సంబంధించినవి కాగా, మరికొన్ని ఆక్రమణలకు సంబంధించినవి,
అల్లర్లు, ఉద్రిక్తలు ఏవైనా మొదటిగా సమిధలయ్యేది మహిళలే. తమ ప్రత్యర్థుల అహం మీద దెబ్బ కొట్టాలంటే సంబంధిత మహిళలను అవమానించడం ఒక వ్యూహంలా మారిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బెర్లిన్‌లో లక్షలాది మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని తెలుస్తోంది. 1947 భారత విభజన, 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధం, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, శ్రీలంకలో అంతర్యుద్ధం, 1989 నాటి భాగల్పూర్ హత్యాకాండ, 2002 గుజరాత్ అల్లర్లు వంటి హింసాత్మక సంఘటనలు దక్షిణాసియా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారం వంటి భయంకరమైన సంఘటనలు కొన్ని దశాబ్దాల తరువాత బయటపడి బాధితులను మరింతగా వేదనకు గురి చేస్తున్న అంశాలు కోకొల్లలు. ఇక్కడ మహిళల శరీరాల ద్వారా తమ “ప్రత్యర్థుల”పై ప్రతీకారం తీర్చుకోవడం తరచుగా నేరానికి కారణమని అర్థమవుతోంది. ఈ ప్రతికారం ఆయా సంస్థలు, సంఘాలు గౌరవప్రదమైన అంశంగా పరిగణిస్తూ నేరస్తుల తరపున నిలబడడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. సంఘర్షణను అంతం చేయడానికి సైన్యం, ఇతర భద్రతా బలగాలు వంటి యంత్రాంగాలు కూడా కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలలో క్రూరమైన లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై ఈ హింస తరచుగా దాచబడి బయటపడక పోవడం నేరగాళ్ళు పేట్రేగిపోవడానికి ఊతమిస్తోంది. మహిళా ఉద్యమం దశాబ్దాలుగా దీనిపై దృష్టి సారించినప్పటికినీ, వారిపై హింస నిరాటంకంగా కొనసాగుతోంది.
లింగ హింసను ప్రేపించడానికి మత కలహాల ప్రాంతాలలో మహిళలను సాధనంగా ఉపయోగించడం అత్యంత కలవరపరిచే అంశమని సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మతపరమైన మరియు జాతి అల్లర్ల సమయంలో స్త్రీలు హింసకు గురికావడం, అదేసమయంలో నేరస్తులు అరుదుగా న్యాయస్థానానికి తీసుకురాబడడం సాధారణమైన విషయమైపోయింది. 1977లో మణిపూర్‌లో జరిగిన మీరా పైబీ అనే పౌరహక్కుల ఉద్యమం మహిళలపై అక్కడ జరిగే హింసను వ్యతిరేకించింది. ప్రభుత్వ దళాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఇంఫాల్‌లోని కాంగ్లా కోట వద్ద 12 మంది మణిపురి మహిళలు చేసిన తీవ్రమైన నిరసన, తిరుగుబాటు ఉధృతమై అంతర్జాతీయ దృష్టిని ఆకర్శించింది. AFSPA రద్దు కోసం ఇరోమ్ చాను షర్మిల 16 ఏళ్ల సుదీర్ఘ నిరాహార దీక్ష రాష్ట్రంలో తిరుగుబాటుపై చర్చను మార్చడానికి దోహదపడింది. హక్కుల పోరాటాలలో మహిళలు నాయకత్వం వహించినప్పటికీ, అల్లర్ల సమయాల్లో వారు ఆ మూకాలకు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు.
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్‌కు గురైన బిల్కిస్ బానో, తన కుటుంబంలోని 14 మంది సభ్యులను హిందూ గుంపు హత్య చేయడాన్ని చూశారు. అయితే ఈ కేసులో 11 మంది దోషులకు రాష్ట్ర బిజెపి ప్రభుత్వం గత సంవత్సరం జైలు నుండి ముందస్తు విడుదల మంజూరు చేసింది. వారి విడుదల సందర్భంగా వారి బంధువులు వారికి స్వీట్లు ఇచ్చి వారి పాదాలను తాకి సంబరాలు చేసుకున్నారు. కొందరూ హిందూ సంస్థ కార్యకర్తలు కూడా వీరికి పూలమాలలు వేసి స్వాగతం పలికినట్లు నివేదికలు తెలిపాయి.
మహిళలపై లైంగిక హింసకు సంబంధించి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. అత్యాచారం దేశంలో అత్యంత సాధారణ నేరాలలో ఒకటిగా మారిపోవడం ఈ దుస్థితికి అద్దం పడుతోంది. భారతీయ సంస్కృతిలో సెక్సిజం, పితృస్వామ్య వ్యవస్థల ఫలితంగా మహిళలపై హింస శాశ్వతంగా కొనసాగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో ప్రతి ఏట మహిళలపై దాడులు పెరగడంతో పాటు, ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. 2020 సంవత్సరంతో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల సంఘటనలు 15.3% పెరగడం ఆందోళన కలిగించే అంశం.
భారతదేశంలో లైంగిక హింస తరచుగా నివేదించబడే అంశం కాదు. ఎందుకంటే గాయపడిన బాధితులు, వారి కుటుంబాలు తమ కులం మరియు సమాజం నుంచి బహిష్కరించబడతామని భయపడతారు. సంఘర్షణ ప్రాంతాలలో లైంగిక హింస బాధితులు జీవనోపాధి కోల్పోవడం నుండి కుటుంబ సభ్యుల మరణాల వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిమిత న్యాయానికి కూడా, బిల్కిస్ ఒక మినహాయింపు ఎందుకంటే ఆమె కేసును పోరాడగలిగిన అతి కొద్దిమంది బాధితుల్లో ఆమె ఒకరు. ఆమెది ఒక మైలురాయి కేసు ఎందుకంటే ఆమె నియమానికి మినహాయింపు. ప్రభుత్వాలు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయడం ఒక సాధారణ విషయం. అయితే వారికి అవసరమైనది నష్టపరిహారం మాత్రమే కాదు, తమ వేదనకు పరిహారం కూడా. అందులో పునరావాసం, దాడి పునరావృతం కాని హామీ మరియు సామాజిక, ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి.




