మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాసశివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివరాత్రిగా చెప్తుంటారు. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండు: అవి పగటి పూట ఉపవాసం ఉండటం. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. ఈ పర్యాయం మహా శివరాత్రి పర్వదినం మార్చ్ 8, శుక్రవారం. మాఘ బహుళ చతుర్దశి అర్దరాత్రి వరకు వ్యాపించి లేకపోతే అంటే అమావాస్య ముందే ప్రవేశించినట్లయితే అంతకుముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహా శివ రాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహా శివరాత్రి మంగళవారం రోజున వస్తే దానికున్నవిశేషం చెప్పలేనిదని ధర్మసింధువు మాట.
శివరాత్రి రోజున చెయ్యవలసిన వాటిని శ్రీనాధ మహా కవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా వివరించాడు.. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధానపరులై శివ అర్చన చెయ్యాలి. ఈ వ్రతం చెయ్యటానికి అందరూ అర్హులే. ఈ వ్రతం వల్ల మహా పాతకాలన్నీ పోతాయి. మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు. ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్ర జపం చెయ్యడం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం. శివ నామ స్మరణం ఎంతో ప్రధానం. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. శివరాత్రి పర్వదినాన మహ శివునికి 24 రకాల అభిషేకాలు చేసి భక్తులు తరిస్తారు. ఆయనకు అభిషేకాలు చేయడవల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉందని పెద్దలు చెబుతారు. గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందుతారు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశిస్తుంది. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. పెరుగుతో అభిషేకించిన బలం, ఆరోగ్యం, యశస్సు లభిస్తాయి. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ది కలుగుతుంది. మెత్తని చక్కరతో అభిషేకిస్తే దుఃఖ నాశనంజరుగుతుంది.
మారేడు బిల్వదళ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ది కలుగుతుంది. పుష్పోదకం చేత అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగిస్తుంది. రుద్రాక్ష జలాభిషేకం వలన సకల ఐశ్వర్యాలు పొందగలుగుతారు. భస్మాభిషేకంచేత మహా పాపాలు నశిస్తాయి. గంధోదకంతో అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు జలాభిషేకమ వలన ఘోర దారిద్య్రం తొలగిపోతుంది. సాధారణ జలంతో అభిషేకిస్తే పోగొట్టుకున్నవి తిరిగి సమకూరుతాయి. అన్నంతో అభిషేకం వలన అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభిస్తాయి. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది – పెరుగు కలిపిన అన్నంతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేస్తారు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచి పెడతారు. (ఈ ప్రక్రియ చూడటానికి ఎంతో బాగుంటుంది) ద్రాక్షా రసంతో అభిషేకం వలన ప్రతి ప్రయత్నంలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో అభిషేకం వలన శత్రుహానిని హరింప జేస్తుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకించిన వైరాగ్య సిద్ది లభిస్తుంది. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తివర్తిత్వం లభిఉస్తుంది. నవరత్నోదకంతో అభిషేకం ధాన్యం, గృహం, గోవృద్దిని కలిగిస్తుంది. మామిడి పండ్ల రసం తో అభిషేకం దీర్ఘ వ్యాధులఅంజి నశింప జేస్తాఇ. పసుపు నీటితో అభిషేకించిన సర్వం మంగళ ప్రదం అయి, శుభకార్యాలు జరుగుతాయి!
-నందిరాజు రాధాకృష్ణ, 98481 28215





