కాంగ్రెస్ ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ లిస్ట్
విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన చేపట్టారు. మన మునుగోడు..మన కాంగ్రెస్ నినాదంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, దామోదర్ రెడ్డిలు పర్యటన చేపట్టారు. మునుగోడులో చార్జీషీట్‌ను విడుదల చేసి ఇంటింటికి ప్రచారం మొదలు పెట్టారు. ఏడు మండలాలకు కేటాయించిన 14 మంది ఇన్చార్జ్‌ల ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు. అధికార టీఆర్‌ఎస్ బీజేపీ నిర్ణయాలతో నల్గొండ జిల్లాకు సాగునీరు వొచ్చే పరిస్థితి లేకుండా పోయిందనేది కాంగ్రెస్ నేతల ప్రచారాస్త్రం. దిండి ప్రాజెక్టు ఆలస్యం, పాలమూరుకు జాతీయ హోదా సాధించలేక పోవడంతో నల్గొండ జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే ఏం చేస్తామనేది మునుగోడు ప్రచారంలో వివరించాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతుంది. అభ్యర్థి ఎంపిక, ప్రచారంపై ఫోకస్ పెడుతుంది.
ఇందుకోసం ఇప్పటికే పార్టీ ఇన్చార్జ్ మాణికం టాగూర్ నేరుగా రంగంలోకి దిగారు. టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముగ్గురు పేర్లతో షార్ట్ లిస్టు సిద్ధం చేశారు. అందులో కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, ప్లలె రవి కుమార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిపై పార్టీ నేతల అభిప్రాయం తీసుకుని, మరోసారి సర్వే చేసి..ఆ నివేదికను అధిష్టానానికి పంపాలని నిర్ణయించారు. అభ్యర్థి ఎవరైనా సరే అంతా కలిసికట్టుగా విజయం కోసం పని చేయాలని మాణికం టాగూర్ సూచించారు. విభజన హామీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. గురువారం ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ..ఏపీకి కరెంట్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుండి రావాల్సి రూ.లక్ష కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు…కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్, ఐటీఐఆర్, ట్రైబల్ విశ్వ విద్యాలయం ఇవ్వాలని తెలిపారు. ఎనిమిదేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకోసం పనిచేస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.




