భావ ప్రకటనా స్వేచ్ఛ మీద పాలకుల దాడి

దాడులను ఖండిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తా
శాంతి భద్రతల్లోకి కేంద్రం చొరబాటు అనుచితం
విశ్వసనీయత పోగొట్టాలని చూస్తున్న పాలకులు
ఎన్‌ఐఎ వేధింపును తీవ్రంగా ఖండిస్తున్నాం
‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండించండి’
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు

ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రజా సంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన పాలకులు జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నారని పౌరహక్కుల నాయకులు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. జర్నలిస్టుల మీద దాడి వారికి సంబంధించినది మాత్రమే కాదని, అది మొత్తం సమాజం మీద దాడి అని గుర్తించి, ప్రతి ఒక్కరూ వారికి సంఫీుభావం తెలపాలని అన్నారు. వీక్షణం సంపాదకుడి ఇంటిపై ఫిబ్రవరి 8న ఎన్‌ఐఎ దాడి చేసి, తన సెల్‌ ఫోన్‌ ఎత్తుకుపోయిన నేపథ్యంలో ‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండిరచండి’ శీర్షికతో వీక్షణం కలెక్టివ్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జర్నలిస్టుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం వీక్షణం కలెక్టివ్‌ పక్షాన ఎ.నరసింహా రెడ్డి అధ్యక్షతన కేసు, దాడి పూర్వాపరాలను వివరించారు. ఈ సందర్బంగా హరగోపాల్‌ మాట్లాడుతూ వీక్షణం సంపాదకుడితో పాటు అనేక మంది మీద గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, యుఎపిఎ వంటి అక్రమ చట్టాలను ఉపయోగించగూడదని, ఎన్‌ఐఎ వంటి రాజ్యాంగ స్ఫూర్తికీ, సమాఖ్య స్ఫూర్తికీ వ్యతిరేకమైన సంస్థ రాష్ట్రాలలోకి చొరబడకుండా అడ్డుకోవాలని పౌర సమాజం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలని అన్నారు. ప్రజాపక్షం సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులుగా త్వరలో పదవీ స్వీకారం చేయనున్న జర్నలిస్టు నాయకులు కె.శ్రీనివాస్‌ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండిరచారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని వాగ్దానం చేశారు.

ఎన్నో తెలుగు దినపత్రికలకు సంపాదకులుగా పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి దాడిని ఖండిస్తూ, రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో ఉన్న శాంతి భద్రతలలోకి కేంద్ర ప్రభుత్వం చొరబడడం అనుచితమనీ, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తే ఈ జోక్యాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలనీ అన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఒకప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటించే వెసులుబాటు ఉన్న ఏకైక వృత్తిగా ఉండిన జర్నలిజం గత పది సంవత్సరాలలో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నదని అన్నారు. కేవలం విలేకరిగా బాధ్యతా నిర్వహణలో ఉండిన సిద్ధిఖీ కప్పన్‌ ను తప్పుడు కేసులో ఏళ్ల తరబడి జైలులో నిర్బంధించిన పరిణామాన్ని గుర్తు చేశారు. పాలకులు జర్నలిస్టుల విశ్వసనీయత పోగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, దాడులూ తప్పుడు ఆరోపణాలూ అందుకేనని, అటువంటి సందర్భంలో ఆ జర్నలిస్టులకు అండగా నిలవాలనీ అన్నారు. సీనియర్‌ జర్నలిస్టు కల్లూరి భాస్కరం ఎవరికైనా ఇళ్లే తమ సొంత, స్వేచ్ఛాయుత స్థలంగా ఉంటుందని, వీక్షణం సంపాదకుడి ఇంటిని నాలుగు గంటల పాటు తమ అదుపులో పెట్టుకుని ఎన్‌ఐఎ జరిపిన వేధింపును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అధ్యక్షులు విరాహత్‌ అలీ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొన్ని వందల మంది మీద ఇటువంటి తప్పుడు కేసులు బనాయించిందని, కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నది గనుక ఆ కేసులన్నిటినీ సమీక్షించి, ఉపసంహరించు కోవాలని కోరారు. వీక్షణం సంపాదకుడిపై కేసు, దాడుల వెనుక పాలకులందరిలోనూ పెరిగిపోతున్న అసహనం, భిన్నాభిప్రాయాలను అణచివేయాలనే తత్వం ఉన్నాయని, ఇటువంటి సమయంలో భిన్నాభిప్రాయాలను పరిరక్షించుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ పూర్వ అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం నాయకులు, జనం సాక్షి దినపత్రిక సంపాదకులు ఎం.రహమాన్‌ మాట్లాడుతూ, వీక్షణం పత్రిక, దాని సంపాదకుడు ఇవాళ దేశం ముందున్న ప్రధాన ప్రమాదమైన ఫాసిజానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తున్నారని అందువల్లనే ఈ దాడి అని అన్నారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలోకి తమ అనుమతి లేకుండా సిబిఐ చొరబడకుండా శాసనసభ తీర్మానాలు చేశాయని, తెలంగాణ శాసనసభ కూడా ఎన్‌ఐఎ దాడుల విషయంలో అటువంటి తీర్మానం చేయాలని సూచించారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ నాయకులు మారుతీ సాగర్‌ ఈ ఘటనను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదనీ, నిరసనగా జరిగే ఏ కార్యాచరణలోనైనా తాము పాల్గొంటామని, కలకత్తాలో వచ్చేనెల జరగనున్న తమ జాతీయ సమావేశాలలో కూడా ఈ అంశం చర్చిస్తామని అన్నారు. పత్రికా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులు, జర్నలిస్టు ఉద్యమ నాయకులు పాల్గొన్న ఈ సమావేశం వీక్షణం సంపాదకుడిపై తప్పుడు కేసును ఉపసంహరించు కోవాలనీ, వేధింపులు ఆపాలనీ డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐఎ అనవసర, రాజ్యాంగ వ్యతిరేక, సమాఖ్య స్ఫూర్తి వ్యతిరేక దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *