- పార్టీ విస్తరణలో భాగంగా రెండు రోజుల పర్యటన
- నేటి రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు సిఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఉన్నారు. మధ్యాహ్నం మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్ బయలుదేరుతారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. పండరీపురంలోని విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆ తరువాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. సీఎం కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చి హైదరాబాద్ నుంచి దిల్లీకి భారీ కార్ల ర్యాలీని చేపట్టి యావత్ దేశ దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ పర్యటనను చేపట్టారు.




