రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి
లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీష్ రావు
రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీష్ రావు ప్రకటించారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, అందుకే రుణమాఫీపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడి యా సమావేశంలో మాట్లా డుతూ…ఓ వైపు రైతుబంధు లేక, సాగు నీరు, కరెంట్ సరిగ్గా లేక పంటలు ఎండిపోతుంటే…మరో వైపు బ్యాంకుల వారు అప్పులు కట్టాలని రైతులకు నోటీసు లు జారీ చేస్తున్నారని, కోర్టుల్లో కేసులు పెడుతామని లీగల్ నోటీసులు జారీ చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతుబంధు, నీళ్లు, కరెంట్ రాక పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉంటే పంట రుణాల బకాయిలు కట్టకపోతే ఆస్తులు సీజ్ చేసి కోర్టుకు లాగుతామని బ్యాంకు అధికారులు రజాకార్ల మాదిరిగా గ్రామాల మీద పండి రైతులను వేధిస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. డిసెంబర్ 9న తన మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని, ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రైతులను నమ్మించే ప్రయత్నం చేశారని, పైగా రైతులు బ్యాంకుకు వెళ్లి అప్పులు తెచ్చుకోండని సూచించారని, కానీ ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు దాటినా ఇప్పటికీ రుణమాఫీపై వారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. బ్యాంకులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, దాంతో రైతులను బ్యాంకర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా, మోసం చేసిందని, మొండి చేయి చూపిందని, ఒక్క రైతుల విషయంలోనే కాకుం డా ఇతర అంశాలలో కూడా ప్రజలను మోసం చేస్తు న్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, మాట నిలబెట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు. 100 రోజుల్లో 13 హామీలు అమలు చేస్తామని చెప్పారని అన్నారు. కౌలు రైతులకు ఏకరానికి రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు క్వింలాటల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారని, వాటిని కూడా అమలు చేయడం లేదని అన్నారు. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వోట్లు అడుగుతారు.. అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. బాండు పేపర్ల సాక్షిగా రైతులను మోసం చేశామని వోట్లు అడుగుతారా..పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండబెట్టామని వోట్లు అడుగుతారా..నీటి నిర్వహణ, కరెంట్ సరిగా ఇవ్వలేదని వోట్లు వేయమని అడగడానికి గ్రామాల్లోకి వొస్తారా..? అంటూ హరీష్ రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. మాట ఇచ్చిన ప్రకారం రైతు రుణమాఫీ ప్రకటించాలని, లేదంటే రైతుల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. రైతులు అప్పులు కట్టొద్దని, వారికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులు వేధిస్తే..తమ దృష్టికి తీసుకొస్తే రైతులకు అండగా ఉంటామని, రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని, ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రంలోని లక్షాలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిరచడానికి బీఆర్‌ఎస్ పార్టీ వెనుకాడని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు.




