బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి దాడిని తిప్పికొట్టడంలో గ్రామస్థులుకూడా చాలా ధైర్యసహాసాలు కనబర్చారు. అయితే అధికారం ముందు బలిఅయిన సంఘటనలు అనేకం ఆ కాలంలో చోటుచేసుకున్నాయి. నాటి వరంగల్‌ ‌జిల్లా పరిధిలో బైరాన్‌పల్లి అయితేనేమీ కూటిగల్‌ అయితేనేమీ, పరకాల అయితేనేమీ ఇక్కడి ప్రజలు చూపించిన ధైర్య సహాసాలు చరిత్రలో మరిచిపోని సంఘటనలు. ఈ ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు ఎందరో… వారిలో కొందరిగురించి అయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.’’

ఆనాటి బైరాన్‌పల్లి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిలో జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌ ‌చకిలం యాదగిరిరావు ఒకరు. జనగామ జోనల్‌ ఏరియా ఆనాటి పోరాటంలో ప్రధాన భూమికను పోషించి.. దాని కమాండర్‌గా ఇరవై నాలుగేళ్ళ యాదగిరిరావు చూపించిన తెగువ నేటికీ మరిచిపోనిది. వాస్తవంగా యాదగిరిరావు సోదరుడు భారత సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ను రజాకార్‌లు 1948 మార్చి 25న నామవరం గ్రామంలో చంపేశారు. దాంతో యాదగిరిరావుకు మరింత ఆవేశం పెరిగింది. వెంటనే తన దళ సభ్యులందరినీ రజాకార్‌లపైన దాడికి సమాయత్తపర్చారు. అదే సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని రజాకార్లు చుట్టుముట్టారు. ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో గ్రామస్తులతోపాటు కొందరు నిజామ్‌ ‌పోలీసులుకూడా చనిపోయారు. దీన్ని అవమానంగా భావించిన నిజామ్‌ ‌ప్రభుత్వం ఆ గ్రామానికి పెద్ద సంఖ్యలో మిలటరీని పంపించింది. అది 1948 ఆగస్టు 25. అకస్మాత్తుగా మిలటరీ రావడాన్ని గమనించలేకపోయిన గ్రామ దళాలు, శత్రువు శక్తిని అంచనా వేయలేక పోయాయి. సుశిక్షితులైన సైన్యం ముందు దళ సభ్యులు నిలువలేకపోయారు. ఫలితంగా బైరాన్‌పల్లి, కూటిగల్‌ ‌గ్రామాలకు చెందిన సుమారు వందకు పైగా జనం ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటన యావత్‌ ‌భారత దేశాన్ని విస్మయానికి గురిచేసింది. ఇది యాదగిరిరావులో మరింత పట్టుదలను పెంచింది. దీంతో పెండ్యాల రాఘవరావు, నల్ల నర్సింహులు, చింతల రామకృష్ణారెడ్డి, ఎస్‌. ‌మోహన్‌రావు లాంటి వారి సాన్నిహిత్యంలో సాయుధ పోరాటం ద్వారానే రజాకార్లను ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చారు. వాస్తవంగా జనగామ ప్రాంతంలో సాయుధ పోరాటానికి నాంది పలికినవాడు యాదగిరిరావు. అందుకు చాకలి అయిలమ్మ తిరుగుబాటే కారణం. విసునూరు దేశ్‌ముఖ్‌తో ఆమె జరుపుతున్న పోరాటానికి మద్దతుపలికిన యాదగిరిరావుకు అయిలమ్మ తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చింది.  విసునూర్‌ ‌దేశ్‌ముఖ్‌ అమె వ్యవసాయ భూమిని ఆక్రమించే ఉద్దేశ్యంగా పొలంలోని పంటను కోయడానికి అయిదు వందలమంది గుండాలను పంపించినప్పుడు ఆమెకు మద్దతుగా రావాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇతర దళాలకు సమాచారం అందించడంతో వారంతా గుదుపలు పట్టుకుని గుండాలను వెళ్ళగొట్టారు. అనంతరం గ్రామస్తులంతాకలిసి పంటను కోసి ఆమె ఇంటికి తరలించారు.

ఈ సంఘటనకు సంబందించి పోలీసులు గ్రామంలోని కొందరిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతున్నారన్న వార్త తెలిసి,  ఆరుట్ల లక్ష్మీ నర్సింహారెడ్డి, కె. రామచంద్రారెడ్డితో కలిసి యాదగిరిరావు వారికి మద్దతుగా వస్తున్న తరుణంలో విస్నూరు గుండాలు వారిని మార్గమధ్యలోనే పట్టుకుని  వంటిమీద బట్టలు లేకుండా చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విసునూర్‌  ‌తొత్తులుగా వారు లక్ష్మీనర్సింహరెడ్డిని మినహాయించి  యాదగిరిరావుతోపాటు మిగతావారిని అరెస్టుచేసి కారంపోసి కొట్టారు.  పెండ్యాల రాఘవరావు, ధర్మబిక్షం, ఓంకార్‌, ఏసిరెడ్డి నర్సింహరెడ్డి, కాసాని నారాయణ లాంటి హేమాహేమీల సహచర్యంతో ఆయన సాయుధ పోరాటాలు నిర్వహించారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వా తగాని ఆయన మద్రాసు సెంట్రల్‌ ‌జైలునుండి విడుద లకాలేదు. కాగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడన్న మిషతో 1965లో భారత• ప్రభుత్వం ఆయన ను  మరోసారి అరెస్టుచేసి కొంతకాలం విశాఖ జైల్‌లో మరికొంతకాలం అంటే 1966 వరకు హైద రాబాద్‌లో నిర్బంధించింది. చివరగా ఆయన తుది శ్వాసవరకు హనుమకొండలోని తన స్వగృహంలో రాజకీయాలకు దూరంగా గడిపారు.
  – మండువ రవీందర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *