బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ, ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు సమాచారాన్ని చేరవేసిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి తర్వాత నెంబర్‌ ‌టూ వ్యక్తిగా అందరూ ఈటలనే చూశారు. అదే ఆయన ఆ పార్టీలో నిలువలేకపోవడానికి కారణమై ఉంటుందన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా కొన్ని అపనిందలతో ఆయన తనకున్న మంత్రి పదవిని,  ఆఖరుకు పార్టీనే కాకుండా తనకున్న ఎంఎల్‌ఏ ‌పదవినికూడా వీడాల్సివొచ్చింది. పదమూడేళ్ళ నిర్విరామ పోరాటంలో పార్టీ అధినేతకు చేదోడు వాదోడుగా నిలిచిన తనను నిర్దాక్షిణ్యంగా పార్టీనుండి సస్పెండ్‌ ‌చేయడంతో తన సత్తాఏమిటో నిరూపించుకోవాలన్న పట్టుదలగానే బిజెపిలో చేరి తిరిగి తన శాసనసభ నియోజకవర్గాన్ని పొందిన వ్యక్తి. ఇది ఒక విధంగా ఆయన సంగతెలా ఉన్నా తెలంగాణలో కాషాయ జండా పాతాలనుకున్న బిజెపికి మాత్రం ఒక టర్నింగ్‌ ‌పాయింట్‌గా మారింది. దీంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం కూడా మారుతూ  వొచ్చింది. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థిపైన నెగ్గిన ఈటలకు బిజెపిలో ప్రాధాన్యత లభించింది. బిఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అలకగా ఉన్న పలువురిని బిజెపిలో చేర్చే బాధ్యతను ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఈటలకు అప్పగించింది. అందుకోసం ప్రత్యేకంగా చేర్పుల కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేసి దానికి ఈటలను ఛైర్మన్‌గా చేసింది.

అది మొదలు ఆ పార్టీలో అంతర్ఘత కలహాలు మొదలవుతూ వొచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తనుండి  ఎంపీగా, తెలంగాణరాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్‌కుమార్‌కు, ఈటల రాజేందర్‌ ‌మధ్య విబేధాలు మొదలైనాయి అన్న వార్తలు గుప్పుమన్నాయి. అది తెలంగాణపై ఆధిపత్యపోరుకు దారితీసింది.  తెలంగాణలో  బిజెపి ఎదుగుదలను ఎవరికి వారు తన ఖాతాలోనే వేసుకోవాలన్న పోటీ ఏర్పడింది. మొదటినుండి క్రమశిక్షణగల పార్టీగా చెప్పుకునే బిజెపిలో అంతర్ఘత కలహాలు మొదలైనాయి. తెలంగాణలో ఆ పార్టీ వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. బిఆర్‌ఎస్‌పై ఆగ్రహంగా ఉన్న ఈటల చేర్పుల కమిటీ చైర్మన్‌  ‌వివిధ పార్టీలకు చెందిన బడా నేతలను తీసుకువొస్తారని ఆ పార్టీ అధిష్టానవర్గం ఆశించింది. అయితే వారు అశించినట్లు పెద్దతలకాయలేవీ ఈటల సారథ్యంలో రాకపోవడం ఆ పార్టీలో కొంత నిరుత్సాహపర్చింది. ఆ పార్టీ సీనియర్‌ ‌నేత విజయశాంతి లాంటివారు కూడా చేర్పుల కమిటీ ద్వారా ఇప్పటివరకు సాధించిన విజయాలేవీ లేవని కామెంట్‌ ‌చేసినవిషయం తెలిసిందే.

దుబ్బాక, జిహెచ్‌ఎం‌సీ విజయాలు ఈ కమిటీ పరిధిలోకి రావన్న విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం బహిరంగ రహప్యమే. ఇదిలా ఉంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయలేకపోతున్నారన్న విమర్శకూడా వినిపిస్తున్నది. అందుకు పార్టీ అధ్యక్షుడిని మార్చాలన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ ఎక్కడికి వెళ్ళమని ఆదేశిస్తే అక్కడికి వెళ్ళేందుకు తాను ఎప్పటికీ బిస్తర్‌ ‌సర్దుకుని సిద్దంగానే ఉంటానని సంజయ్‌ ‌చెప్పడం కూడా ఆ ప్రచారంలో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదన్న భావన కలుగుతున్నది. అయితే సంజయ్‌ ‌గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆయనకు కేంద్రమంత్రి పదవిని కట్టబెడుతారన్న వార్తలు   వొస్తున్నాయి. సంజయ్‌ అధ్యక్ష స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న విషయంలోనే ఆ పార్టీలో ఇప్పుడు తర్జనభర్జన జరుగుతున్నది. ఆ పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వడంద్వారా తెలంగాణలో పార్టీని మరింత బలపర్చుకోవచ్చన్న అభిప్రాయం కేంద్రంలోని బిజెపి నాయకులకున్నట్లు తెలుస్తున్నది. కాని పక్షంలో ఆయనకు ప్రస్తుతమున్న చేర్పుల కమిటీ పదవికి అదనంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారకమిటీ చైర్మన్‌పదవిని కూడా కట్టబెట్టే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు వార్తలు   వొస్తున్నాయి. తనకు ఆ పదవిని ఇచ్చే విధంగా ఈటల కూడా కేంద్రనాయకత్వంపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. అదిప్పుడు తెలంగాణ బిజెపిలో అసంతృప్తి జ్వాలలను లేపుతోంది. ఈటలకు జోడు పదవులను ఇవ్వడాన్ని తెలంగాణకు చెందిన పలువురు ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విచిత్రమేమంటే వ్యతిరేకిస్తున్న వారంతా మొదటినుండి తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్‌తో కలిసి పనిచేసినవారే కావడం. చేర్పుల కమిటీద్వారా ఇప్పటికే ఆయన ఫేల్యూర్‌  ‌ఛైర్మన్‌గా ఉన్నారని, అలాంటప్పుడు మరో పదవిని ఎలా కట్టబెడుతారన్నది వారి వాదన. ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన నుంచి ఇక చేర్పులు జరిగే అవకాశంలేదని చేతులు ఎత్తివేసిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈమేరకు ఆదివారం వీరంతా సమావేశమైనారు. హైదరాబాద్‌లో మాజీ ఎంపి జితేందర్‌డ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, ‌విజయశాంతి, రవీంద్రనాయక్‌, ‌వివేక్‌ ‌వెంకటస్వామిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా గతంలో బిఆర్‌ఎస్‌లో పనిచేసినవారే. ప్రచారకమిటీ చైర్మన్‌ ‌పదవి, అధ్యక్ష పదవి ఎవరికన్నా ఇవ్వాలనుకున్పప్పుడు తామంతా కూడా ఈటలకన్నా సీనియర్‌ ‌నాయకులుగా ఉన్నామని, తమలో ఎవరికైనా ఇవ్వవొచ్చన్న విషయాన్ని అధిష్టానానికి విన్నవించుకోవాలని ఆ సమావేశంలో తీర్మానించుకున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న   నేపథ్యంలో  పదవుల మార్పు ఆ పార్టీలో పెద్ద గందరగోళానికి దారితీస్తోంది. అసలే కర్ణాటక  ఎన్నికల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్‌ ‌పడిపోయి, చేరికలు తగ్గిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ఇలాంటి పరిస్థితిలో పదవుల విషయంలో సీనియర్ల మధ్య భేదాభిప్రాయాలు పొడసూపుతుండడం ఆ పార్టీకి కొత్త చిక్కును తెచ్చిపెడుతోంది. ఈ నెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటనలోగానే ఈ విషయానికి ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడుతుందనుకుంటున్నారు. కాని పక్షంలో నాయకులందరినీ దిల్లీకి పిలిచి సమస్యను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *