బాలల కోసం చాలా అర్థవంతంగా, అతి సులభంగా రాయడమే కవులు, రచయితలకు ఎంతో కష్టమైన పని. తీరా రాశాక వారిని ఒప్పించి మెప్పించి, ఆనందం తెప్పించి తలలూపించడం మరో కష్టమే. బాలల కోసం అనేక అంశాలను గమనంలోకి తీసుకుని అద్భుతమైన వస్తువులుగా మలచి గానయోగ్యమైన గేయాలను రచించి ఆనందలహరి పేరుతో సుతారపు వెంకటనారాయణ సంపుటిగా వెలువరించారు. బాలానందమే లక్ష్యంగా 62 గీతికలు ఇందులో ఉన్నాయి. వివిధ విషయాలను తీరొక్క పూలుగా పేర్చి బాలలకు ఎంతో ఆత్మీయంగా కవి అందించారు. బాల గేయాల కోవలో చిరకాలం గుర్తుండిపోయి, నిలిచిపోయే గేయాలు ఇందులో ఉన్నాయి. కవిగా, రచయితగా, ఉపాధ్యాయునిగా వెంకటనారాయణ అవలోకించిన అనేక సంగతులు, సందర్భాలు, దృశ్యాలు అద్భుతమైన గేయాలుగా బాలల కోసం రూపొందాయి.
విఘ్నేశ అన్న తొలి గేయంలో చిట్టిచిట్టి అడుగులేస్తూ విఘ్నేశ/ చింతలెన్నో చేస్తవట విఘ్నేశ అన్న వాక్యాలలో బాలల నిత్య చేష్టల సూచనను దైవంలో ప్రతిబింబంగా చూపుతూ స్పష్టతను కనబరిచారు. లౌక్యం నేర్పుతూనే/ లోక జ్ఞానం తెల్పావు అని ఘనుడు నాన్న – త్యాగధనుడు నాన్న గేయంలో చెప్పారు. ఆడపిల్ల కూడా/ అన్నీసాధించగలదు అని అమ్మా నన్ను రక్షించు గేయంలో తెలిపారు. బాలోత్సాహం గేయంలో నేలపై నిచ్చెన లేస్తాం/ నింగికి దారులు కనుగొంటాం/ నవ్వుతూ మేము పయనిస్తాం/ నక్షత్రాలతో ఆటలాడేస్తాం అన్న వాక్యాలను తానే బాలల స్వరమై కవి పలికించారు.
బాల్యంలోనే బంగారు జీవితాన్ని చిదిమేయకండి అని పెద్దలకు బాలలు చేసిన వినతితో రాసిన బాల కార్మికులం గేయంలో విద్యను మాకందిస్తే / విజ్ఞానలోకాన సాగుతం/ చదువే మాకు ఆయుధం/ సంస్కారమే మాకు సహకారం అని చెప్పారు. ప్రకృతితో పరవశించి ఊహల్లో విహరించే బంగరు భవితల్లా బాలలు ఎదగాలని ఆకాంక్షించారు. కల్మషాలు మేమెరుగం/ కష్టాలు అసలే కోరం/ దానవత మా కొద్దూ/ మానవతే మాకు ముద్దు అన్నారు. ప్రకృతి అంటే మాకిష్టం/ మంచిని పెంచుటే మాకిష్టం/ పరిసరాలంటే మాకిష్టం/ ప్రాణ జీవులు మాకిష్టం అని బాలల అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఆకాశానికి నిచ్చెనలేసే విధంగా ఆలోచనలు చేసే చిట్టిపొట్టి మాటల పిల్లల్ని పిడుగులతో పోల్చారు. బాలల దినోత్సవం గేయంలో మానవతామూర్తిగా, లోకం పోకడ తెలిసి నడిచిన మహనీయ వ్యక్తిగా నెహ్రూను అభివర్ణించారు. బడికి వెళ్ళి భవిష్యత్తుకు బతుకు బాటలు గీసే మహర్షులుగా బాలలను బడికి బాట గేయంలో చూపారు. చిలుక, కోకిల, నెమలి, కుందేలు, ఏనుగు, చీమ వంటి బాలల నేస్తాల అభివర్ణన ఆహ్వానం గేయంలో ఉంది. నెమ్మదైన నడక/ నిమ్మలపుయోచనల బాలనేస్తం ఏనుగు నింగితో సమానమన్నారు. తీరొక్క కలలను చందమామ తీపిగా పంచుతుందన్నారు. జామకాయలు, జారుడు బల్లే కాదు జీవిత లక్ష్యం కూడా బాలలకు ఇష్టమేనని తెలిపారు. కురిసిన వర్షం పంచిన కమనీయ భావన, సూర్యుడు, నక్షత్రాలు, మిణుగురుల మిలిమిలలు, గాలిపటాల సయ్యాటలు, బుర్రమీసాల బొర్రయ్య ఆనందంలో తేలియాడే బాలలను గురించి ఈ సంపుటిలోని పలు గేయాలలో కవి వివరించారు. పువ్వులు, జాబిల్లి, మేఘాలు బాలల ఆనందపు అత్యున్నత భాగాలన్నారు. బంగారు బతుకమ్మ, మువ్వన్నెల జెండా, అంబేద్కర్, మేడే, రంధి గేయాలు వివేకాన్ని పెంచే విధంగా ఎంతో ఆలోచనాత్మకంగా సాగాయి.
శతాబ్దాల చరితగన్న చైతన్య గిరి, త్రిభువనగిరిగా చరిత్రలో పేరొందిన భువనగిరిపై రాసిన గేయం అక్కడి చారిత్రక, పోరాట, సాహిత్య, సాంస్కృతిక ప్రత్యేకతకు ప్రతిబింబంగా నిలిచింది. చేనేతకు చేయూతగా నిలిచిన భూదాన్ పోచంపల్లిపై రాసిన గేయంలో వినోభాభావే విశిష్టతను వివరించారు. ఎన్నో ప్రత్యేకతల సంగమం పోచంపల్లి అన్నారు. ఎండ, వాన, చలికాలాల గురించి కాలములు అన్న గేయంలో వివరించారు. మాతృభాష, తెలుగుతనం, ఆకాశం, స్వాతంత్య్ర ఫలం, మనసు పెడదాం, సహజీవనం, చెరువు, తెలంగాణ, అక్షర్, కలం, శాంతి, మేరాభారత్ మహాన్, హమారే జెండా, హిందీ సమ్మాన్, గ్రంథాలయ్, భారత్ సంవిధాన్, క్యా తమాశా కర్తీ హో, వెరెవర్ లిజన్, వరల్డ్ పీస్ వంటి గేయాలను బాలలు ఎంతో ఉత్సాహంగా పాడుకునే వీలుగా కవి మలిచారు. సినారె, వట్టికోట, జయశంకర్ ఆర్ విద్యాసాగర్‌రావు వంటి సాహిత్య, పోరాట రంగ ప్రముఖులను బాలలకు పరిచయం చేస్తూ అతి సులభ పదాలతో సాగిన గేయాలున్నాయి. కాకతీయ శిల్ప కళావైభవం, సర్వాయి పాపన్న సాహసాలు మొదలుకొని ప్రకృతి, ఊహా ప్రపంచాలు, మాతృభాష గొప్పతనం, అనుబంధాల ప్రాధాన్యత, బాధ్యతలు వంటి ఎన్నో అంశాలను రంగరించి గీతికలల్లి గేయ లహరిగా కవి అందించారు. సరళమైన భాషతో, చిన్న పదాలతో పెద్ద భావాలను ఒలికిస్తూ వెలువడిన ఈ గేయాలు బాలలను ఆనందలహరిలో విహరింపజేస్తాయి.
-డా.తిరునగరి శ్రీనివాస్,
9441464764





