రాధాకిషన్, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి 28: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో ఆ ఇద్దర్నీ పోలీసు అధికారులు విచారిస్తున్నారు. రాధాకిషన్, గట్టు మల్లులను విచారిస్తున్నారు. వీరు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారని గుర్తించారు. ఈ ఇద్దరు కూడా పోలీసు అధికారులే కావడం గమనార్హం.
బుధవారం రాత్రి అధికారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు.. లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా.. ఈ కేసులో నిందితుడైన ప్రణీత్‌రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇవాళ అంతా విచారించి.. ఆ ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ప్రణీత్‌కు సహకరించిన ప్రతి ఒక్కర్నీ విచారించాలని దర్యాప్తు బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం జరుగుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్నూ తాకిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ మాదిరి విభాగానికి(ఎస్వోటీ) ఇన్చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్-క్యాడర్ అధికారే అయినా.. ఆయన ఆ కమిషనరేట్‌లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీమ్‌తో కలిసి రూ.కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం.
సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సప బంధువు కావడంతో.. సీపీ స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఎస్ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా.. ఓఎస్డీలుగా కొనసాగారు. ట్యాపింగ్ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులు అని తెలుస్తోంది. ఎస్ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.




