నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలలే. కానీ అలాంటి పాఠశాలలే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూల్ లు ప్రారంభం కానున్నాయి . దోపిడి మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్ కు సపరేట్ అని, యూనిఫామ్ కు సపరేట్ అని, ఐఐటి ఫౌండేషన్ అయితే సపరేట్, బస్సు ఫీజు సపరేటు అని ఇలా రకరకాల పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు పాఠశాలల యాజమాన్యాలు.తమ విద్యార్థులను ఉన్నతమైన, నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల కార్పొరేట్ మోజు లో పడి ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వసూళ్లకు అవకాశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. పట్టణాల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది. దీంతో స్కూలు, హాస్టల్ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, ఆ తర్వాత విద్యార్థులకు పాఠశాలను బట్టి రూ.60 వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.కార్పొరేట్ విద్యా సంస్థలకు తాము తక్కువ కాదంటూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇదే సంప్రదాయానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటీ ఫౌండేషన్ అంటూ మరి కొంత నొక్కుతున్నాయి .దీంతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి,వెనక్కి వెళ్ళలేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
నేడు విచ్చలవిడిదిగా ఫీజులు వసూలు చేస్తూ, దోపిడీ చేస్తూ అక్షరాలను వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.ప్రధానంగా కార్పోరేట్, సెమీ కార్పోరేట్ తరహా పాఠశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటిని నిరోధించాల్సిన అవసరం విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా నిబంధనలు పాతరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు చైతన్యమై ప్రభుత్వ నిబంధనలు, విద్యాహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలు కనుక చూసినట్లయితే సెక్షన్- 6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి.సెక్షన్ -11 ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1,2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించి వారి వివరాలు, విద్యార్హత,వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డ్ లో పెట్టాలని చట్టం చెబుతుంది.సెక్షన్ -12 ప్రకారం టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫారాలు,స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీ ని అమ్మరాదు.ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. డి.ఎడ్ లేదా బీ.ఈడీ అర్హత ఉండాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల టీచర్లు డీఎడ్ లేదా బీఈడీ అర్హత ఉండి టెట్ లో అర్హత సాధించి ఉండాలి. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్ లైన్ లో ఉంచాలి. జీవో నెంబర్ 42 ప్రకారం డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయరాదు. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి.
మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్లు.గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల పక్కా భవనంలో నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో సలహాలు, సూచనలకు ఫిర్యాదు బాక్సులు ఉండాలి. ఫీజు స్లిప్పులను చిన్నారుల చేతికి రాసి ఇస్తే జరిమానా ఉంటుంది.అభం,శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్ ఫీజుల రసీదులు ఇస్తున్నారు పాఠశాల యాజమాన్యం. మీ అమ్మ నాన్న ఇంకా ఫీజు చెల్లించలేదంటూ వారిని కించపరుస్తున్నారు. గతంలో చిన్నారి చేతికి రసీదు ఇచ్చిన ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన యాజమాన్యానికి భారీ ఎత్తున జరిమానా విధించింది విద్యాశాఖ. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించకూడదు.ప్రభుత్వ అనుమతితోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి.ప్రభుత్వ సూచనల ప్రకారం ఫీజులు తీసుకోవాలి. 20 మంది చిన్నారులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సంరక్షకుడు ఉండాలి.రక్షణ భద్రతా పారిశుద్ధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. భవనానికి ప్రహరీ ఉండి,గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి.మరుగుదొడ్లు,స్నాలాల గదిలో టవలు,సబ్బులు ఉంచి, పరి శుభ్రత చర్యలు పాటించాలి. సిసిటీవీ లను అందుబాటులో ఉంచాలి. అగ్నిమాపక దళ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి.ప్లే స్కూలు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల్లోపు మాత్రమే నిర్వహించాలి. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువుతోనే బోధన ఉండాలి. పిల్లలకు గాయాలైనట్లయితే ప్రథమ చికిత్స కిట్టు,చిన్న పిల్లలకు అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉండాలి.వైద్య నిపుణులతో ప్రతి మూడు నెలలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ప్రవేశపత్రము,హాజరు, ఆరోగ్య రికార్డులు, స్టాకు ఫీజు, వగైరా రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. ప్లే స్కూల్ కు తప్పనిసరిగా ప్లే స్కూల్ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి.
ఇందులో 50% తల్లులు, 25% ఉపాధ్యాయులు, 25% తండ్రులు ఉండేలా చూడాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను నమోదు చేయాలి. పిల్లలకు జంక్ ఫుడ్ ను అనుమతించకూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించకుండా నడుపుతా ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో ఎల్ కె జి రూ.1,20,000 వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో తరగతికి రూ. 1,20,000 నుంచి 1,60,000 కు పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. దీనికి కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించి, రాష్ట్ర ప్రభుత్వం పలానా తరగతికి ఫలానా అమౌంట్ తీసుకోవాలని సూచించాలి. దాని ప్రకారమే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు తీసుకోవాలి.అలా చేసినట్లయితే ప్రైవేటు పాఠశాల నుండి కొంత ఉపశమనం లభిస్తుందని పిల్లల తల్లిదండ్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం.
– మోటె చిరంజీవి,
సామాజికవేత్త, విశ్లేషకులు.
సెల్ : 9949194327.





