- లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో రేవంత్ రెడ్డి భేటీ
- పలు సమస్యలపై చర్చ
- పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్
- కాంగ్రెస్ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్ భేటీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 20 : లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన చారిత్రక భవనం వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ప్రజాస్వామ్యం ఒకటని, ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరమని అన్నారు. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కుంటుందని, హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటుందని అన్నారు. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే ఈ సమస్యలన్నిటికీ అసలైన పరిష్కారం అని అన్నారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
ఒకప్పుడు బ్రిటన్ దేశం తమ దేశాన్ని పరిపాలించిందని, కాంగ్రెస్ పార్టీనే వారికి వ్యతిరేకంగా పోరాడిరదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పుడు మహాత్మగాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే వారి దేశానికైనా తమ దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకాలన్నారు. ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం పంచుకున్నారు. తనది గ్రావిూణ ప్రాంతంమని, తాను సామాన్య రైతు బిడ్డనని, కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తానున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ అని, తనకు ఈ అవకాశం వొచ్చినట్లే.. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్
వొచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను మరింతగా బొందపెట్టడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా నెట్టే ఛాన్స్ లేదని లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కెసిఆర్‌ను ఉద్దేశించి పులి బయటికొస్తుందని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పులి బయటికి వొస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు. అంతేకాదు వొచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్‌ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ వైపు ఎంఐఎం మొగ్గు ?..లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్ భేటీ
పార్మలెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కలవడం ఈ దిశగా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్ధీన్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలవడం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బొటాబోటీ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవొచ్చంటూ ప్రతిపక్షాలు హెచ్చరిక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఎంఐఎం నేత అక్బరుద్ధిన్ కలవడం సహజంగానే కాంగ్రెస్, ఎంఐఎంలు పరస్పరం కలిసి నడుస్తాయన్న చర్చలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం అసెంబ్లీలో 119స్థానాల్లో కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి 1 స్థానం, ఎంఐఎంకు 7, బీజేపీకి 8, బీఆరెస్‌కు 39స్థానాలున్నాయి. బీఆరెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారినా రేవంత్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది. సాధారణంగా మజ్లిస్ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండటం. కాంగ్రెస్ తోనూ అలాగే ఉంటుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మొహమాటాలు పెట్టుకోరు. ఏ స్థాయిలో అవకాశం వొస్తే ఆ స్థాయిలో నిలదీస్తారు. కానీ బయట రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది.





