భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఐదు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమంలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెపుతుంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, మంచి నీళ్ళు, మొక్కలు నాటడం, సీసీ రోడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ షెడ్లు, రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తమ జీవితాలలో ఏం మార్పు వస్తదని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి.
అతి గతి లేని డబుల్ బెడ్రూంలు
2016లో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహాలు నిర్మించడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2018-2019 సంవత్సరానికి డబుల్ బెడ్ రూమ్‌లో బడ్జెట్ 2,643 కోట్లు కేటాయించారు. 2020-2021 బడ్జెట్‌లో గృహ నిర్మాణాల కోసం 11,917 కోట్లు బడ్జెట్ కేటాయించారు. 2023-2024కు డబుల్ బెడ్ రూమ్‌లకు కేటాయించిన బడ్జెట్ 12,000 కోట్లు. ఈ విధంగా అంకెల్లో కోట్లలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి కానీ ఆచరణలో నిధులు విడుదల చేయడం లేదు. ఇంత దుర్మార్గమైన విధానాలు సమైక్య పాలనలో కూడా లేవు. ఒక హైదరాబాదులోని డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్టంగా జిల్లాకు మూడు లక్షల దరఖాస్తులు వేసుకున్నా సుమారు ఒక కోటి దరఖాస్తులు వచ్చినట్లే. ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఇళ్లు కట్టించిందో, ఎంతమందికి కేటాయించిందో, ఇంకా ఎన్ని నిర్మాణంలో ఉన్నవో స్పష్టత లేదు. ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌ల హమీని నెరవేర్చకుండానే 2023-24 బడ్జెట్లో సొంత స్థలాలు ఉంటే గృహ నిర్మాణానికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని గొప్పలు చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం చిన్నయ్యపల్లి గ్రామంలో శిథిలావస్తకు దగ్గరలో ఉన్నాయన్న కారణంచే ఇందిరమ్మ పిరియడ్‌లో కట్టిన 48 ఇళ్లను 2019లో అధికారులు కూల్చేసారు. వాటి స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాని మూడేళ్లవుతున్నా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. డేరాలు వేసుకొని విష సర్పాల తాకిడిని ఎదుర్కొంటు భయం గుప్పిట్లో వారు జీవనం సాగిస్తున్నారు.
ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వర్షాలు పుష్కలంగా కురుస్తుండడంతో కొంత మేరకు పంటలు బాగానే పండుతున్నాయి. పండిన పంటను అమ్ముకోవాలంటే రైతులు అనేక రకాల కష్టనష్టాలను భరించాల్సి వస్తుంది. తీరా పంట పండిన తర్వాత అమ్ముకోవాలంటే రైతుకు దుఃఖం తప్ప మరేమీ మిగలడం లేదు. పండిన ప్రతి గింజను కొంటామని అనేక మాయమాటలు చెప్పి ఐకెపి కేంద్రాలలోకి ధాన్యం వచ్చిన 60 రోజుల తర్వాత కూడా కొనుగోలు చేయడం లేదు. సీజన్లో పండిన పంటలను యాసంగి వచ్చేంతవరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మాటల్లో వందలలో ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆచరణలో సగం కూడా ఏర్పాటు చేయడం లేదు. అకాల వర్షాలతో పంటలు ఆగమై రైతు శోకసంద్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు కానీ పండిన పంట అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం పండించినట్లుగా పుంకాను పుంకాలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 కల్లాల చొప్పున రాష్ట్రంలో లక్ష కల్లాలను ఏర్పాటు చేస్తుందని ఎందుకు 750 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని 2020 జూన్ లోనే ప్రభుత్వం ప్రకటించింది కానీ నేటికీ కల్లాల నిర్మాణం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో తప్ప ఎక్కడ జరగలేదు.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ మొత్తం మద్యం ఆధారితంగా నిర్మితమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కోసం ఉద్దేశపూర్వకంగానే మద్యం పాలసీ రూపొందించబడింది. సంవత్సరానికి మొత్తం మద్యం మీద 40,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా మద్యం విధానాన్ని అమలుపరుస్తున్నారు. ఈ విధానం గ్రామీణ వ్యవస్థను మొత్తం బలిపెట్టేదిగా ఉన్నది. ప్రతి 500 జనాభాకు కనీసం మూడు బెల్ట్ షాప్‌లో చొప్పున దాదాపు ఒక లక్ష బెల్ట్ షాపులు తెలంగాణలో నడుస్తున్నట్లు ఇందులో సింహభాగం ఆదాయము గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది. ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం ఎక్సైజ్ అధికారులతోటి వైన్ షాపులపై ఒక నిర్దేశిత టార్గెట్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న దుస్థితి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు రోజువారీగా తరలివెల్లే అనేక మంది కూలీలు పెద్ద ఎత్తున తమ ఆదాయంలో దాదాపు సగభాగం మీదనే ఖర్చు పెడుతున్నారు. పైగా ఆ సమీపంలోనే పోలీసుల నిర్బంధ తనిఖీలు జరిమానాలతో వందలాది కోట్ల రూపాయలను అమాయక గ్రామీణ ప్రజానీకం నుంచి గుంజుకుంటున్నారు. దోపిడికి కారణమవుతున్న బెల్టు షాపులను సంపూర్ణంగా రద్దుచేసి ప్రభుత్వం మీద నియంత్రణ చేపట్టకపోతే గ్రామీణ వ్యవస్థ మరింత సంక్షోభంలో చిక్కుకుంటుందనేది వాస్తవం.
ధరణితో ప్రతి పల్లె రావణాకాష్టమే
తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేసి పూర్తిస్థాయిలో ఆ రికార్డులను భద్రపరిచి గ్రామీణ రైతాంగానికి మేలు చేయాలనుకున్న ఉద్దేశం పాలకుల వ్యవహార శైలితో తెలంగాణ పల్లెలలో అశాంతియుతమైన వాతావరణాన్ని సృష్టించింది. గ్రామీణ ప్రాంతంలోని ఆధిపత్య వర్గాలు ధరణితో మొత్తం భూముల మీద యాజమాన్య హక్కులను పొందేందుకు ఉపయోగపడుతుంది. సాదా బైనామాల పేరు మీద అప్పటికప్పుడు సృష్టించుకోబడ్డ కాగితాలతో ధరణి రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ధరణితో తమ హక్కులను కోల్పోయిన చాలామంది క్రింది స్థాయిలను పరిపాలన వ్యవస్థలో పరిష్కారం లేకపోవడంతో కలెక్టరేట్ల చుట్టూ తిరగలేక రాజకీయ, దళారి, బ్యూరొక్రటిక్ అవినీతిని భరించలేక గ్రామీణ పల్లెలోని అధిక జనాభా సతమతమవుతుంది. మరోపక్క ధరణితో పై వర్గాలవారు యథేచ్చగా పేదవర్గాల ప్రజల భూములు కబ్జాలకు దిగుతున్నారు. ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లెలో 25% నుండి 35% వరకు ధరణితో ఇబ్బందులు పడుతున్నారని అనధికారికంగానే పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితి గమనించి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా భూముల సమస్యలు మరింత తీవ్రతరం చేస్తుంది.
పోలీస్ స్టేషన్లలో అధికార పార్టీ ఆగడాలు
రూరల్ ప్రాంతాలలో ప్రతి పోలీస్ స్టేషన్లో అధికార పార్టీకి సంబంధించిన వారి హవానే నడుస్తుంది. సామాన్యుడు పోతే న్యాయం దక్కన దుస్థితి ఏర్పడ్డది. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో అందరికీ సమానంగా న్యాయం చేయాల్సింది పోయి అధికార పార్టీ నేతలు ఎవరికి చెప్తే వారికే వంత పడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కావాలనే పోలీసులను వినియోగించుకొని అక్రమ కేసులను బెదిరింపులకు గురి చేస్తున్నారు.
అప్పుల ఊబిలో రైతు కుటుంబాలు
తెలంగాణ వ్యవసాయ పరిస్థితి ని 2021 జాతీయ గణాంక నివేదిక ప్రకారం నలభై తొమ్మిది లక్షల కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇందులో 54.2శాతం కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. దాదాపు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని నివేదిక పేర్కొంది. మొత్తం రైతాంగంలో 91.7శాతం అప్పుల పాలై ఉన్నారు. తెలంగాణది జాతీయ స్థాయిలో రెండవ స్థానం. తెలంగాణలో సగటు రైతు అప్పు 1,52,113 రూపాయలు. అంటే జాతీయ సగటు అప్పు కంటే యాభై రెండు శాతం ఎక్కువ. వడ్డీ వ్యాపారస్తుల నుంచి రైతులు 9.1 నుండి 41.2 శాతం వరకు వడ్డీ రూపంలో గుంజుతున్నారు. మొత్తం తెలంగాణ రైతులు చేసిన అప్పులో 46% వారి కోసం వాడుతుండగా మరో 17% పెట్టుబడి వ్యయంగా వాడుతున్నారు. తెలంగాణలో వచ్చిన విపరీత భూస్వామ్య పోకడల ఫలితంగా రకరకాల రకరకాల కొత్త సామూహిక విందు వినోదాల లాంటి పంతులు యజ్ఞయాగాలు వాస్తు పూజలు విపరీతంగా పెరగడంతో 10% వరకు ఈ అప్పులను వాటిపై వినియోగిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు బ్యాంకులలో చేసిన రైతు అప్పులను ప్రభుత్వం మాఫీ చేస్తానని ప్రకటించింది కానీ 25000 వరకు బ్యాంకు అప్పులు ఉన్న రైతులకు మాత్రమే మాఫీ అది కూడా 70% వరకు మాత్రమే పరిమితం చేసింది.
ఆక్రమణకు గురవుతున్న చెరువులు కుంటలు
తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి జీవనాధారమైన చెరువులు కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తానని ప్రకటించి 27000 చెరువులకే పరిమితం చేసి అది కూడా పూడిక తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. ఇట్టి విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించింది. మరోపక్క చెరువుల చుట్టూ ఉన్న శిఖం భూములు పెద్ద మొత్తంలో ఆక్రమణకు గురి అయితే కనీసం వాటిని విముక్తి చేయలేదు. మరింతగా చెరువులను ఆక్రమించుకునేందుకు అధికార పార్టీ యంత్రాంగం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు కుంటలను మొత్తం మాయం చేసింది.
ఆత్మహత్య చేసుకుంటున్న సర్పంచులు
2022 జూన్ నాటికి గ్రామాలకు పెండింగి బిల్లుల వ్యవహారంలో సర్పంచ్‌లు, సర్కారుకు మధ్య వార్ నడుస్తోంది. రూ.2 వేల కోట్లకుపైగా పెండింగ్ బిల్లులున్నాయని, నాల్గో విడుత పల్లె ప్రగతిలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు నిలదీస్తున్నారు. సమీక్షా సమావేశాలను బహిష్కరిస్తున్నారు. అనేక సందర్భాలలో పంచాయతీ ఎకౌంటులను ఫ్రీజింగ్ చేసిన దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల పల్లె ప్రగతి సమీక్ష సమావేశాలను సర్పంచులు బహిష్కరిస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి వచ్చిన వివిధ పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేయించుకొని గ్రామపంచాయితీలను నిర్వీర్యం చేసింది. తమ ప్రజాప్రతినిధులు ప్రధానంగా శాసనసభ్యుల ఆధీనంలోనే కాంట్రాక్టులు బందీ ఐనాయి. కానీ ఇదే శాసనసభ్యులు రాజకీయ ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున సర్పంచులను ఖర్చు పెట్టించి గెలిపించినారు. కానీ ఆ తర్వాత సర్పంచ్‌ల మొఖం చూసే పరిస్థితి లేకుండా పోయింది. సర్పంచులకు చిన్నచిన్న కాంట్రాక్టులు ఇచ్చినప్పటికీ ఆ బిల్లులు రాక తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకొని పోయినారు. దీనితో అప్పులు తీరేందుకు మరో మార్గం లేక పరపతి నిలబెట్టుకోలేక ప్రజా సంబంధాలను నిర్వహించలేక సర్పంచులకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
డ్రైనేజ్ కు నోచుకోని గ్రామాలు
9 ఏళ్ల పాలనలో తెలంగాణ పల్లెల్లో ఇంతవరకు డ్రైనేజ్/మురికి కాల్వుల నిర్మాణాన్ని చేపట్టలేదు. సీజన్లో వర్షాలు పెద్ద ఎత్తున పడినప్పుడు నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలకు క్రిమి కీటకాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. తద్వారా ప్రజలు అంటువ్యాధుల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. పల్లె ప్రగతిని సాధించాలంటే వేగవంతంగా ప్రతి గ్రామంలో డ్రైనేజీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
తోడుపాటు లేని కుల వృత్తులు/చేతి వృత్తులు
తెలంగాణ ఉద్యమంలో కులవృత్తుల వారు తమ అస్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి తమ జీవితానికి అర్థిక వెలుగులను సంతరించుకోవడానికి మార్గం ఉంటుందని భావనతో ఉద్యమంలో పాల్గొన్నారు. 2014లో తెరాస పాలనను చేపట్టడానికి హామీలను గుప్పించింది. నాటి నుంచి నేటి వరకు ఏ విధమైన కులవృత్తులకు ఆర్థిక తోడ్పాటును అందించలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలోని అందిన ఆరకొరా వసతులను కూడా కొనసాగించలేకపోయింది. పైగా కనీస ప్రోత్సాహాన్ని కూడా అందించలేదు. కానీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో బీసీ రుణాల పేరు మీద ఓట్లను ఆకట్టుకోవడానికి కుల వృత్తుల వారికి లక్ష రూపాయల రుణాలకు తెరలపింది.
సబ్సిడీ లేని డ్రిప్పు వ్యవసాయ పరికరాలు
వ్యవసాయ పెట్టుబడి పథకం రైతుబంధు పేరుతో ఒక్క దానిని ప్రకటించి అన్ని రకాలుగా రైతులకు విరివిగా అందే వివిధ రకాలైన ప్రోత్సహించేందుకు అందించే డ్రిప్ సబ్సిడీలను ఎత్తివేసింది. దీనితో పండ్ల తోటల పెంపకంపై వ్యయం విపరీతంగా పెరిగింది. కల్టివేటర్లు మందు స్ప్రే పంపులు రోడ్వైటర్లు గడ్డి కట్టలు కట్టే మిషన్లు హార్వెస్టర్లకు మరియు ఇతర వ్యవసాయ పరికరాలకు ఇచ్చే సబ్సిడీ నుంచి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైదొలిగింది ఒకవైపు రైతుబందు ఇస్తూ మరోవైపు ఇలాంటి పరికరాలపై పెనుబారం మోపుతుంది.
గ్రామీణ మహిళల జీవితం దుర్భరం
ఒక వెపు వ్యవసాయం ఆధునీకరణ చెందే ప్రయత్నాలు పెరగడంతో రెండవ వైపు పెట్టుబడి వ్యయం పెరుగుతుండడంతో వ్యవసాయ కూలీలను మహిళల భాగస్వామ్యం తగ్గిపోయింది. ఈ మేరకు వారికి పని దినాలు పెద్ద మొత్తంలో తగ్గిపోయినాయి. కూలి రేట్లు పెరిగినప్పటికీ గతంలో మహిళలకు వచ్చిన ఆదాయంలో 30% కూడా దక్కే పరిస్థితి లేదు. దీనితో మహిళల మీద ఆధారపడే కుటుంబాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. వీరి అభ్యున్నతి కోసం కొత్త పథకాలు ఏవి వారి దరిదాపుల్లో లేకపోగా వారికి అప్పుడప్పుడైనా అందే సమ భావన సంఘంలో అందే వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ ఋణాలు నుంచి కూడా వైదొలిగింది. సమ భావన రుణాల పేరు మీద గ్రామీణ మహిళలను బ్యాంకులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. నెలవారీగా చెల్లించే బ్యాంకు రుణాల కోసం ప్రైవేటు వ్యక్తుల మీద భారీ వడ్డీరేట్లతో తిరిగి రుణాలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల వల్ల పెద్ద ఎత్తున మహిళలకు పని కోసం ఆహార భద్రత కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.
ప•ల్లెలకు రద్దైన బస్సు సౌకర్యాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో సుమారు 1200 గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు.ఆ గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని ప్రభుత్వం అందుకు అనుగుణంగా పల్లెలకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన రహదారుల గుండా పోయే బస్సులను మినహాయిస్తే మారుమూల పల్లెలకు పోయే దాదాపు అన్ని రకాల బస్సు సౌకర్యాలు రద్దు చేసినారు.ఈ తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 4000 గ్రామాలకు పైబడి ఆర్టీసీ సేవలను రద్దు చేసినారు. గ్రామాల నుండి పట్టణాలకు రావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రైతు కూలీలు ఆటోలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అందులో ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడి దుర్మరణం చెందుతున్నారు. అధిక ఆదాయం లాభాలు వచ్చే రూట్లలలో మాత్రమే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. వేగవంతంగా పల్లె పల్లెకు బస్సు సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం ఆర్టీసీకి 1500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసి అందులో సగం నిధులను కూడా విడుదల చేయలేదు. మహిళా కండక్టర్లకు రాత్రి కూడా డ్యూటీలో ఉండవని చెప్పి హమీ ఇచ్చారు.కానీ ఆ హమి అలానే ఉండిపోయింది.
అస్తవ్యస్తంగా బీటీ రోడ్లు
తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల నుండి మండల కేంద్రాలకు పట్టణ కేంద్రాలకు అద్భుతమైన డాంబర్ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. కానీ ఒక్క రోడ్డు అంటే ఒక్క బీటీ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. గత పాలనలో వేసిన రోడ్లు గుంతల మయంగా తయారై అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నది స్థితి.
అన్ని విడుతలలో కలిపి ఇప్పటివరకు పల్లె ప్రగతికి జరిగిన కేటాయింపులు
కొత్త పంచాయతీ రాజ్ చట్టం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2019 నుండి 2022 వరకు ఈ మూడేండ్లకాలంలో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలలకు రూ. 16,070.77 కోట్లు (పంచాయతీలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.7,203 కోట్లు కాగా… వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు రూ.8,867.77 కోట్లు) నిధులు విడుదలచేసి సంక్షేమం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
19,298 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు (116 కోట్ల రూపాయాల వ్యయంతో), 12,728 వైకుంటధామాలు (1555 కోట్ల రూపాయల వ్యయంతో), 12, 776 డంపింగ్ యార్డుల నిర్మాణం (318 కోట్ల రూపాయల వ్యయంతో), 6,500 కోట్ల రూపాయలు (2019 సంవత్సరం సెప్టెంబర్ నుండి నేటివరకు గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరీ చేసిన గ్రాంటు) 12, 769 గ్రామ పంచాయితీలకు టాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేసి చెత్తను తరలించాయి. 12 వేల 769 గ్రామాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్కు కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాని ఈ కమిటీలు పేరుకు మాత్రమే ఉన్నాయి గాని ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. కేటాయించిన బడ్జెట్‌లో కూడా కనీసం 30% కూడా పల్లె ప్రగతికి నిధులను విడుదల చేయలేదు.
ఇప్పటివరకు ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో పెద్ద ఎత్తున ఖర్చు చేసినప్పటికీ వాటిని ప్రచారం పెట్టడానికి పండుగలు చేస్తున్నప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పు రాకపోగా మరింతగా కులం, పురుషాధిక్యత భావజాలాలు మితిమీరి పోయినాయి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, యజమానులు, యువకులు, ప్రగతిశీలకులు ఈ భావజాలాన్ని అడ్డుకోవడం ద్వారానే పల్లెలు మనుగడ కొనసాగించగలుగుతాయి. లేదంటే.మరింత విధ్వంసానికి గురవుతాయి.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతులవేదిక
9441661192




