పేదల‌కు మెరుగైన వైద్యం మా బాధ్య‌త‌

  • డిఎంహెచ్ఓలు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా ఉండాలి..
  • ప్ర‌జారోగ్యాన్ని బ‌లోపేతం చేస్తున్నాం..
  • వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27 : రాష్ట్రంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని, డిఎంహెచ్ఓ లు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలని, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాల డీఎంహెచ్ వో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాలను ఎలా నిర్వ‌హించాల‌నే అంశాల‌పై మంత్రి డిఎంహెచ్ఓ లకు దిశానిర్దేశం చేశారు.

వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో డీఎంహెచ్ వోల‌ది గురుతరమైన బాధ్యత అని అన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిట‌ళ్ల లైసెన్సుల‌ను రద్దు చేయాల‌ని ఆదేశించారు. తదుపరి సమావేశానికి డిఎంహెచ్ఓ లు పూర్తి సమాచారంతో రావాల‌ని సూచించారు. పేదల‌కు ఉన్న‌త‌ ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాల‌ని, హాస్పిట‌ళ్ల‌లో ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాల‌ని,
జిల్లాల వారీగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు డిఎంహెచ్ఓ లదే బాధ్యత అని చెప్పారు.

ప్రభుత్వ ద‌వాఖానాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాల‌ని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాల‌ని, శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాల‌ని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోగులకు మెరుగైన డైట్ ను అందించాల‌ని, డాక్టర్లు విధిగా సమయపాలన, మెరుగైన వైద్య సేవలను అందించేలా డిఎంహెచ్ఓ లు నిరంతరం పర్యవేక్షించాల‌న్నారు. ప్రజలకు ప్రభుత్వ ద‌వాఖాన‌ల‌పై నమ్మకం కలిగేలా విస్తృత సేవలను అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

ఆరోగ్య మందిర్ లలో అదనపు సేవలను అందించడానికి కృషి చేయాలన్నారు. డిఎంహెచ్ఓలు పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ & పిసి అండ్ పిఎన్ డిటి యాక్ట్ అమలు, అవగాహనపై రూపొందించిన పోస్టర్ లను మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్ గార్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, ఎన్‌హెచ్ ఎం అధికారులు, వివిధ జిల్లాల డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *