- ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు
- హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్
- నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు
- ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : మాదాపూర్ నోవాటెల్ హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ బస చేయనున్నారు. ముందుగా రాజ్‌భవన్‌లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది. భద్రతా కారణాల దృష్ట్యా నోవాటెల్‌లో బసకు ఎస్పీజీ అనుమతిచ్చింది. 2, 3, 4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్‌లో ఉండనున్నారు. 3వ తేదీ సాయంత్రం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్ విధించనున్నారు. దీనికి 5 కి.వి•. పరిధిలో నేటి నుంచి జులై 3 వరకు నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుంది. వేల మంది పోలీసులతో అధికారులు భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జులై 4న ప్రధాని మోదీ భీమవరం వెళ్లనున్నారు. 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోయే మోడీ బహిరంగ సభ నేపథ్యంలో ఎస్పీజీ భద్రతా సిబ్బంది స్టేడియంలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక నేతలకు, పోలీసులకు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లిమిట్స్‌లో నో ఫ్లైయింగ్ జోన్స్‌గా గుర్తించారు. డ్రోన్స్, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు.
జూన్ 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, శుక్రవారం ఉదయం నుంచి 4 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జూలై 2న ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెచ్‌ఐసిసిలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగే కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. జులై 3న హెచ్‌ఐసీసీలో జరిగే రెండు రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆ రాత్రికి బస చేస్తారు. 4న ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.




