- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘనంగా స్వాగతం పలకనున్న టిఆర్‌ఎస్
- వేర్వేరుగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను కలువనున్న సిన్హా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు ర్యాలీ నిర్వహించనున్నారు. సిన్హా పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మంత్రులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. సిన్హా శనివారం ఉదయం 10 గంటలకు విమానాశ్రయానికి చేరుకొంటారని, స్వాగతం పలికే బాధ్యతలు మంత్రులు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జలవిహార్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యేలా చూడాలని సూచించారు.
సిన్హాకు ఘన స్వాగతం పలుకుతామని, జలవిహార్ సభ లో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత యశ్వంత్‌సిన్హా మాట్లాడుతారని రాష్ట్రపతి ఎన్నిక ప్రచార కమిటీ సభ్యుడు, ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. తర్వాత గాంధీభవన్, ఎంఐఎం కార్యక్రమాలకు సిన్హా హాజరై సాయంత్రం బెంగళూరుకు వెళ్తారని పేర్కొన్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు నాగేందర్, మాగంటి గోపీనాథ్, గోపాల్, అరికెపూడి గాంధీ, హన్మంతరావు, కాలె యాదయ్య, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.



