నీట్‌ పేపర్‌ లీకయిందనడానికి ఆధారం లేదు

 కోర్టు తీర్పును అంగీకరిస్తాం  
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం…
మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 13 : పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలతో నీట్‌-యుజి మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలపై విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దాన్ని ఖండిరచారు. గురువారం ఆయన దిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…   అసలు అలాంటి వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా మే 5న 4,750 కేంద్రాలలో నిర్వహించిన నీట్‌-2024 ప్రవేశ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పేపర్‌ లీక్‌ అయిందని ఆరోపిస్తూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో పాటు సుప్రీమ్‌ కోర్టును కూడా ఆశ్రయించిన విషయం విధితమే..ఈ సందర్భంగా కేంద్ర విద్యా మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…పేపర్‌ లీక్‌ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.

అయితే దాదాపు 1560 మంది విద్యార్థుల కోసం కోర్టు సిఫార్సు చేసిన మేరకు మోడల్‌ను అవలంబించామని, దీని కోసం విద్యావేత్తల ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అయితే వాస్తవానికి జూన్‌ 14న షెడ్యూల్‌ చేయబడ్డ ఫలితాలు సమాధాన పత్రాల మూల్యాంకనం వేగంగా జరగడం వల్ల ముందుగానే జూన్‌ 4న ప్రకటించారు. దీంట్లో మొత్తం 67 మంది విద్యార్థులు 720 ఖచ్చితమైన స్కోర్‌ను సాధించడం నీట్‌ చరిత్రలోనే తొలిసారి. వీరిలో హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఓ కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఉండడంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అభ్యర్థులు, వారితల్లిదండ్రులు తమ సందేహాలను, అభ్యంతరాలను లేవనెత్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘భారత ప్రభుత్వం మరియు దాని ఖాధ్య్వర్యంలోని నీట్‌  పారదర్శకంగా, మరియు వారికి ఉపశమనం కలిగించే విధంగా న్యాయం అందించడానికి కట్టుబడి ఉందని తాను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే కోర్టు విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని, కోర్టు తీర్పు కోసం వేచి చూసి, తీర్పును అంగీకరిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. కాగా ఇంత పెద్ద స్కామ్‌పై తగు రీతిలో ప్రభుత్వం స్పందించకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ తీవ్రంగా విమర్శించారు.

ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం…మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం
నీట్‌ ఫలితాల్లో 1563 మంత్రి అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం విచారణ సందర్భంగా సుప్రీమ్‌ కోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. కాగా ఎన్‌సిఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రంలో సమయం కోల్పోవడం కారణంగా ఈ ఏడాది జరిగిన నీట్‌-యూజి పరీక్షలో 1563 అభ్యర్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు కలిపారు. అయితే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు, నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో గత వారం కేంద్ర విద్యా శాఖ దీనిపై విచారణకు 4గురు సభ్యులతో కూడిన కమిటీని వేయగా గ్రేస్‌ మార్కులు పొందిన విద్యార్థులపై కమిటీ విచారణ జరిపి ఈ మేరకు నివేదిక సమర్పించింది.

కోల్పోయిన సమయానికి గ్రేస్‌ మార్కులను పొందిన ఆ 1563 స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం కోర్టుకు తెలియజేసింది. అయితే వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని, జూన్‌ 23 పరీక్ష నిర్వహించి జూన్‌ 30వ తేది లోపు ఫలితాలను వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సిలింగ్‌ ఉంటుందని, ఒక వేళ మళ్లీ పరీక్ష రాయొద్దనుకుంటే గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చునని కేంద్రం సుప్రీమ్‌ కోర్టు ధర్మాసనానికి తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *