నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు చేస్తున్న విమర్శపై అనేక వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితిలో టిఆర్‌ఎస్‌ ‌మైండ్‌ ‌గేమ్‌ ఆడేందుకు సృష్టించిన ఘటనగానే దీన్ని చూడాలన్న వాదనలు జరిగాయి. రాష్ట్రంలోనేగాక యావత్‌ ‌దేశంలో ఈ ఘటన రాజకీయ వర్గాల్లో నిజంగానే సంచలనాన్ని కలిగించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంతటి అప్రజాస్వామ్యానికి ఒడగట్టడమేంటన్నదే చర్చ. ఇంత సంచలనాత్మక సంఘటనకు సంబంధించి గత మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కెసిఆర్‌ ‌పెదవి విప్పకపోవడాన్ని మౌనం అర్థాంగీకార మన్నట్లుగా బిజెపి వర్గాలు దాడిచేయడం ప్రారంభించాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తడిబట్టలతో తమ పార్టీ ప్రమేయం ఇందులో ఎంతమాత్రం లేదని ప్రమాణం చేశారు.

అంతేకాదు, నిజంగా ఈ కల్పిత ఎపిసోడ్‌ ‌సృష్టికర్త కెసిఆర్‌ ‌కాని పక్షంలో తనలాగే వొచ్చి స్వామి సన్నిధిలో ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు కూడా. అయితే దీనిపై తెలంగాణ శ్రేణులు పెద్దగా స్పందించలేదు. కాగా మునుగోడు ఎన్నికల ప్రచారం చివరి దశకు వొస్తున్న సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్‌ ‌దీనిపైన ఎలా స్పందిస్తారోనని ఆదివారం ఉద•యం నుండి ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దశలో ఆయన ఇందులో ఏమాత్రం కల్పితం లేదని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడంతో దీనిపై ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. కుట్రల ఉచ్చులో చిక్కకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపిన వారిగా చెబుతున్న ఆ నలుగురు ఎంఎల్‌ఏలను ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సభకు పరిచయం చేశారు. వంద కోట్ల రూపాయలను ఇస్తామని ప్రలోభ పెట్టినా ఎడమ కాలి చెప్పుతో తన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకువెళ్ళారని వారిని ఆయన అభినందించారు.

సంతలో పశువుల్లా వందల కోట్లతో ఎంఎల్‌ఏలు, ఎంపిలను కొనుగోలు చేసే అరాచక వ్యవస్థను రూపుమాపాలంటూ ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకటికి రెండు సార్లు మోదీకి ఈ దేశ ప్రజలు ప్రధానిగా అవకాశం ఇచ్చారని, అంతకన్నా పెద్ద పదవి ఏముంటుందని, అయినా ఇంకా ఏం కావాలనుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన సభాముఖంగా మోదీని ప్రశ్నించడం చూస్తుంటే కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో దీని ప్రణాళిక జరిగిందని వొస్తున్న వార్తలు నిజమేనా అన్నట్లుగా ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులెవరన్నది బయటికి రావాల్సి ఉందని, వారు ఎంతటి వారైనా, ఏ పదవిలో ఉన్నా ఒక్క క్షణంకూడా ఆ పదవిలో కొనసాగడానికి వీలులేదని, ఇలాంటి వారిని వోట్ల ద్వారా తన్ని తరిమేయాల్సిందిగా కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.అయితే కేసు కోర్టు పరిధిలో ఉండటంతో తాను దానిగురించి ఎక్కువ మాట్లాడనంటూనే ఇప్పటివరకు వెలుగు చూసింది చాలా తక్కువేనని, ఇంకా చాలా విషయాలు బయటికి రానున్నాయని చెప్పడంతో దీని వెనుక పెద్ద కుంభకోణమే ఉందన్నది స్పష్టమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *