నేడు ‘కార్గిల్ విజయ్ దివస్’
1971 ఇండో-పాక్ యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్ యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలోని కార్గిల్-డ్రాస్ సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్ కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో నిత్యం పక్కలో బళ్ళెంలా ఉద్రిక్త వాతావరణాన్ని కల్పిస్తూనే, దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 1998లో ఇండియా, పాకిస్థాన్‌లు అణుపరీక్షలు చేయడం, సరిహద్దుల్లో శాంతి స్థాపనకు 1999 లాహోర్ డిక్లరేషన్‌లో సంతకాలు చేసినా పరిస్థితులేమీ మెరుగు పడలేదు. 1998-99 శీతాకాలంలో పాకిస్థానీ సాయుధ దళాలు, పాక్ పారామిలటరీ బలగాలు, ఉగ్రవాదులు వాస్తవాదీన రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్, యల్ఓసి) దాటే ప్రయత్నాలు చేయడంతో రెండు దేశాల మధ్య సంక్షోభం ముదిరింది.
కార్గిల్ పోరు :
కాశ్మీరీ సమస్యకు పరిష్కారం కోరుకుంటూ, భారత్‌ను ఇరకాటంలో పెట్టాలనే దుర్భుద్ధితో కాశ్మీర్- లఢక్ల మధ్య సంబంధాన్ని తెంచటానికి పాకిస్థాన్ ‘ఆపరేషన్ బద్రీ’ ఆపరేషన్ పేరుతో విఫలయత్నం చేసింది. ఈ దుశ్చర్యలు కొందరు ఉగ్రవాదులు చేస్తుండవచ్చని భావించిన భారత రక్షణశాఖ కొంత అలసత్వం ప్రదర్శించింది. పాకిస్థానీ సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నదని గుర్తించిన మన రక్షక దళాలు ‘ఆపరేషన్ విజయ్ (కార్గిల్ వార్ లేదా కార్గిల్ కాన్ఫిక్ట్)’ పేరుతో 2 లక్షల సైన్యాన్ని రంగంలోకి దించడంతో ‘కార్గిల్ యుద్ధం’ ప్రారంభమైంది. రెండు మాసాల భీకర పోరులో కొంత మంది మన వీరజవానులు ప్రాణత్యాగంతో, 26 జూలై 1999న విజయాన్ని అందించి, ‘టైగర్ హిల్’పై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. 03 మే 1999న ప్రారంభమైన ‘ఆపరేషన్ సఫేద్? సాగర్’ రహస్య కోడ్‌లో జరిగిన కార్గిల్ యుద్ధం 2 నెలల, 3 వారాల, 2 రోజుల్లో దిగ్విజయంగా ముగిసింది. ఈ యుద్ధంలో 4000 వరకు పాక్ సైనికులు/ఉగ్రవాదులు మరణించగా, 1000కి పైగా గాయపడ్డారు. భారత సైన్యంలో 527 మరణించగా, 1,363 మంది గాయపడ్డారు. అతి ఎత్తైన మంచు పర్వతాల్లో అనేక ప్రతికూలతలను తట్టుకొని భారత సైన్యం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడంతో భారత త్రివిధ దళాల పోరాట పటిమ ప్రపంచ దేశాలకు అర్థం అయ్యింది.
కార్గిల్ వార్ హీరోస్ :
26 జూలై రోజున భరతజాతి ‘కార్గిల్ వార్ హీరోస్’ సాహసాలను గుర్తు చేసుకుంటూ, ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు దేశభక్తితో ఘన నివాళులు అర్పించడం, క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం, ఇండియా గేట్ అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించడం, మాజీ సైనికులు/సర్వీస్‌లో ఉన్న జవాన్లను సన్మానించడం దేశవ్యాప్తంగా పవిత్రతతో జరుగుతున్నది. విద్యార్థుల్లో దేశభక్తిని నింపగలిగే కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని మన రక్షక బలగాలకు కృతజ్ఞతలను సవినయంగా, సగర్వంగా తెలియజేయాలి. అత్యంత ప్రతికూల వాతావరణం, ఎత్తైన మంచు కొండలు, సహజ హిమగిరుల అవరోధాల నడుమ జరిగిన ఈ యుద్ధంలో మన వీర జవాన్లు జాతి కోసం ప్రాణాలర్పించడం మనందరికీ ఆదర్శం కావాలి. భరతమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలను సహితం తృణప్రాయంగా అర్పించగలగడం త్యాగానికే మరో నిర్వచనంగా నిలుస్తున్నది. అమర జవాన్లకు ప్రగాఢ నివాళులు అర్పిస్తూ జై జవాన్, జై కిసాన్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం.





