దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ !

‘‘‌సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. మరోవైపు పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాలీలను భర్తీ చేసిన పాపాన పోలేదు. విద్యాధికులైన యువతకు సంపాదనా మార్గాలను పూర్తిగా మూసేశారు. మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల ఆర్థికస్థితిని చావుదెబ్బ తీశారు.’’

దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు,ప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు. ధరలను కంట్రోల్‌ ‌చేయడం తమ పని కాదన్న రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. తాజాగా ఉత్తిగడ్డ ధరలు మళ్లీ 40 నుంచి 50కి చేరాయి. నిత్యావసర ధరలతో పాటు , నిత్యం వాడే మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇవన్నీ వాటంతట అవే పెరుగుతున్నాయని అనుకోవడానికి లేదు. అయినా నియంత్రించే వ్యవస్థ లేకుండా పోయింది. వ్యాపారులపై అజమాయిషీ లేకపోవడంతో ధరలతో దాడి చేస్తున్నారు. పేదవాడు మరింత పేద వాడుగా, ధనవంతులు మరింత ధనవంతులగా మారుతున్నారు. అయితే మోదీ సర్కార్‌ ఈ ‌పరిస్థితులను సక్షించడం లేదు. వ్యవసాయోత్పత్తులను పెంచి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా దేశంలోని పేదలకు అన్నం పెట్టాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. సహజంగానే వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఉన్న నేలలు అన్ని పంటలకు అనువుగా ఉన్నాయి. సహజవనరులు కూడా ఉన్నాయి. పరిమితం గా ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు.

అందుకని మనం పేదరికం ఊబిలో కూరుకుపోతున్నాం. వ్యవసాయోత్పత్తులు పెరుగుతున్నా వాటిని ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించి..వేదేశీ మారక ద్రవ్యం సంపాదించేలా ప్రణాళికలు లేకుండా పోయాయి. వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడటమే ధరలు నానాటికీ పెరగడానికి కారణంగా చూడాలి. ఇబ్బడిముబ్బడిగా ఉచిత పథకాలు, డబ్బుల పందేరంతో ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్నారు. అన్నింటికీ ప్రభుత్వాలపై ఆధారపడేలా చేస్తున్నారు. పేదరికానికి మూలం ప్రభుత్వ విధానాలే అన్న భావనలో ఉన్నారు. ప్రజలను దేశ ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయడం అన్నది పక్కన పెట్టేశారు. ప్రజలను చైతన్యవంతులుగా, విజ్ఞానవంతులుగా, ఆలోచనా పరులుగా, అవగాహనాపరులుగా చేస్తే తమకు ముప్పు అన్న ఆలోచనలో రాజకీయ పార్టీల నేతలు, పాలకులు ఉన్నారు. భారతదేశంలో ఆర్థిక, సామాజిక, రంగాల అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నా అది ఎంతన్నది మన ఆర్థికాభివృద్దిని లెక్కలేసుకుంటే కొంతేనని తేలుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారి చివరకు శ్రీలంక కంటే కూడా దిగువ స్థాయిలో ఉంటుందా అన్న భయం కలుగుతోంది. ఇప్పుడు ప్రపంచ దారిద్య్ర సూచికలో 2022 సంవత్సరానికి గానూ 121 దేశాల వివరాలు ప్రకటించారు. దానిలో భారతదేశం 107వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ స్థితిని దారిద్య్ర వైపు, దివాలాకోరుతనం వైపు చూడడానికి ఒక అవకాశం కలిగింది.

ఎందుకంటే ఆ సూచీలో రువాండా 102వ స్థానం, నైజీరియా 103వ స్థానం, ఆప్ఘనిస్తాన్‌ 109‌వ స్థానంలో ఉన్నాయి. ఈ విధంగా భారతదేశం దిగజారిపోవడానికి కారణం పాలకవర్గం తీసుకుంటున్న తిరోగమన చర్యలే అని చెప్పక తప్పదు. కార్పొరేట్‌ ‌శక్తులు, బ్యాంకులకు డబ్బులు ఎగవేసిన వాళ్ళు, అవినీతి అధికారులు, దోపిడీని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులే అత్యధికం. భారతదేశం ఎందుకు ఆర్థికంగా సంక్షోభంలో వుందని పరిశీలిస్తే పాలకుల తిరోగమన విధానాలు కారణంగా చెప్పుకోవాలి. వ్యవసాయ పశుగుణాభివృద్ధి ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలను ఎవరు కూడా పట్టించు కోవడం లేదు. గ్రాణ అర్ధిక వ్యవస్థకు ఊతంగా ఉండే వ్యవసాయ రంగాన్ని,పాడి పరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను నిరంతరం సంక్షోభంలో ముంచుతున్నారు. దేశంలో వ్యవసాయ భూమి విస్తరించట్లేదు. పేద ప్రజలకు భూములు ఇవ్వడంలేదు. పాలకవర్గాలు వీటన్నింటినీ విస్మరించడం వల్లే ఈ రోజున పేదరికం పెరిగి పోతోంది.

వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే వివిధ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం, ఆహార వస్తువుల ధరల స్థిరీకరణ సాధించడం, పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడం, వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం వంటివి ముందుకు సాగడం లేదు..మరి ముఖ్యంగా సంస్కరణలు వృద్ధిరేటును పెంచినప్పటికి నిరుద్యోగ నిర్మూలనకు పెద్దగా తోడ్పడలేదు. సంస్కరణలకు ముందు ఉపాధి వృద్ధిరేటు సంవత్సరానికి 2.39 శాతం కాగా, సంస్కరణల తర్వాత 1 శాతం మాత్రమే. ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉపాధి తగ్గిపోతున్నది. రెగ్యులర్‌ ఎం‌ప్లాయీస్‌ ‌తగ్గుతూ క్యాజువల్‌ ‌లేబర్‌ ‌పెరుగుతున్నారు. క్యాజువల్‌ ‌లేబర్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చకపోవడం వలన వారు అభద్రతలో వున్నారు.సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి.

వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది.పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. మరోవైపు పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాలీలను భర్తీ చేసిన పాపాన పోలేదు. విద్యాధికులైన యువతకు సంపాదనా మార్గాలను పూర్తిగా మూసేశారు. మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల ఆర్థికస్థితిని చావుదెబ్బ తీశారు. వాళ్ల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే తప్ప మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోలేం. దీనికి షార్ట్‌కట్‌ ‌లేదని పాలకులు గుర్తించాలి. అప్పుడే పురోగతి సాధ్యం అవుతుంది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *