‘‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది. ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను సమీక్షించుకునే కనీస ప్రజాస్వామ్యసూత్రాలకు తిలోదకాలిచ్చిన నేపధ్యంలో ప్రజల ఉద్యమాలు,ప్రజాస్వామిక డిమాండ్లు సర్కార్ కు రుచిం చటం కష్టమే! కానీ విద్యార్థులు కనీస ఆవసరాలైన త్రాగునీరు,టాయిలెట్, విద్యుత్ నిర్వహణ,లాప్ టాప్ ల పంపిణీ, యూనీఫాంలు లేకుండా చదువులు కొనసాగటం కష్టమనే స్పృహ ప్రభుత్వానికి లేకపోవటం చాలా ‘‘సిల్లీ’’ఆంశంగా భావించక తప్పదు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది వేలమంది విద్యార్థులు రాజకీయాలకతీతంగా ప్రతికూలవాతావరణం లో సైతం ఆందోళన చేస్తుంటే,వారి డిమాండ్లు పరిష్కరించకుండా వారి డిమాండ్లు ’’సిల్లీ’’గా వున్నాయని విద్యాశాఖ మంత్రి వాఖ్యానించటంతో సమస్య మరింత జఠిలమైంది. రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థులపై ఆరోపణలు చేయడమనేది ప్రభుత్వం తనను తానే నిందించుకున్నట్టు కనిపిస్తుంది తెలంగాణలో గ్రామీణ విద్యార్థులకు పదవ తరగతి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి సాంకేతిక విద్యను అంది స్తున్న ఏకైక విద్యాసంస్థ బాసర ట్రిపుల్ ఐటీ. ఇందులో చదువుతున్న విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు , సదుపాయాలు,బోధన సిబ్బంది, టీచింగ్ మెటీరియల్ ను ప్రభుత్వం సమకూర్చక పోవడం,అధ్యాపకులను రెగ్యులర్ నియామక చేయకపోవడం వల్ల,అక్కడ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
గత మూడు రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు వర్షాలను,ఉరుములు,మెరుపులను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిసమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది పోయి, అవగాహన లేకుండా అధికారులు మరియు మంత్రి మాట్లాడడం సహేతుకం కాదు.నాటి ప్రభుత్వ గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు సాంకేతికవిద్యా అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశం తో త్రిపుల్ ఐటి ని ఏర్పాటు చేస్తే నేటి తెలంగాణ ప్రభుత్వం సరైన నిధులు సమాకూర్చకుండ పాతరపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ విశ్వ విద్యాలయాలను ప్రమోట్ చేయడానికే అన్నట్టుగా ఉందనిపిస్తుంది. ఎన్నో ఆశలతో రాష్ట్ర నలుమూలల నుండి ఎస్.ఎస్.సి.టాపర్స్ విద్యార్థులు ప్రాంతాల తల్లి దండ్రులు తమ పిల్లలను బాసరలో త్రిపుల్ ఐటి చదివించాలనే బలమైన కోర్కె ఉంటుంది. కానీ అక్కడ వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులకు తెలిపినా పరిష్కరించకపోవడం శోచనీయం. వారికి నాణ్యమైన ఆహారం కూడా సరిగా అందించకుండా,యూనిఫామ్స్ లేకుండా,లాప్ టాప్స్ అందించకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సబబు కాదు. బాసర విద్యార్థులు పేర్కొన్న అన్నీ రకాల డిమాండ్లను వెంటనే పరిశీలించి, పరిష్కరించి..తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల తనకున్న బాధ్యతను రుజువు చేసుకోవలసిన అవసరం ఆసన్నమైంది.
రాజకీయాలకతీతంగా సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది వేలమంది విద్యార్థులు ప్రతికూల వాతావరణం లో సైతం ఆందోళన చేస్తుంటే,రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థులపై ఆరోపణలు చేయడం వారిని ఇబ్బందులకు గురి చేయటం,ఏ మాత్రం సమంజసం కాదు, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లన సానుకూలంగా పరిశీలించాలి.ట్రిపుల్ ఐటీకి ప్రతి ఏటా నిధులు ఆటంకాలు లేకుండా మంజూరు చేయాలి.దాదాపు 10 ఏళ్లకు పైగా పని చేస్తున్న కాంటాక్ట్ బోధకుల సేవలను క్రమబద్దీకణ చేయాలి. అన్ని రకాల బోధన, బోధనేతర సిబ్బంది ని నియమించాలి. విద్యార్థులందరికీ లాప్ టాప్ లు అందజేయాలి. మెరుగైన మంచి నీటిని సరఫరా చేయాలి. నాణ్యమైన భోజన పదార్ధాలు వసతులు కల్పించాలి.విద్యార్ధుల నివాసానికి కావాల్సిన కనీస వసతులైన బెడ్ ల ను సమకూర్చాలి.మహిళా విద్యార్థులకు కేర్ టేకర్లను నియమించాలి.క్యాంపస్ లో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించాలి.వివోధ పనుల కోసం గుత్తేదారులను యేటేటా మార్చాలి.క్రీడల అభివృద్ధి కి కోచ్ ల నియమాకం,ఇతర ఇంజనీరింగ్ సంస్థలతో అనుసంధానం,తో పాటు వైస్ ఛాన్సలర్ స్థానికంగా వుండాలని, ముఖ్యమంత్రి స్వయంగా బాసర క్యాంపస్ ను సందర్శించాలనే ప్రధాన డిమాండ్లతో విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం ఉద్రిక్తతలకు దారి తీసింది. విద్యార్థులతో జిల్లా యంత్రాంగం చేసిన చర్చలు పలు దఫలు విఫలం కావటం,మరో వైపు విద్యార్థుల,తల్లి దండ్రుల అరెస్టులు సమస్యను పెంచేందుకు దోహద పడుతున్నాయి. క్యాంపస్ లోపల శాంతియుతంగా చేస్తున్న మౌన నిరసన ను కూడా శాంతి భద్రత ల సమస్యగా పరిగణించటం విషయాన్ని పక్కదారి పట్టించింది. ఉన్న ముఖ్యాధికారి వైస్ ఛాన్సలర్ ను స్థానికంగా వుండాలని కోరితే కొత్త అధికారిగా డైరెక్టర్ నియమాక చర్య ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతూంది.
ఎనిమిది వేల మంది విద్యార్థుల కనీస సౌకర్యాల పై నాలుగు రోజులుగా ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోవటం,విద్యాశాఖ మంత్రి,విద్యాశాఖాధికారుల అవగాహనా లోపాలు సమస్యను ఉదృతం చేయనున్నాయి. శారీరక పెరుగుదల, మానసిక వికాసం చెందాల్సిన వయస్సులో ఉన్న బాసర విద్యార్థులకు గత నాలుగైదు ఏండ్లుగా సరైన ఆహారం అందించలేని దుస్థితి ఉండడం అంటే వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుంది.. సరైన ఆహారం లేనప్పుడు సరైన శారీరకంగా ఎదుగుదల లాపించి మానసిక వికాసం చెందదనే విషయం తెలంగాణ ప్రభుత్వానికి సోయిలోకి రాకపోవడం దురదృష్టకరం.విద్యార్థులు జంక్ ఫుడ్ తిని ఉన్నరోజులు కూడా ఉన్నాయనే విషయాన్నీ మరువరాదు. ఏవో కొన్ని గురుకులాలను చూపించి ఇదే విద్యభివృద్ధి అనడం సమంజసం కాదు.. గురుకులాల బయట వేలాది సాధారణ పాఠశాలలు, లక్షలాది మంది విద్యార్థులు కూడా ఉన్నారనే విషయాన్నీ విస్మరించడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే..తెలంగాణ ఏర్పాటు తో విద్యాఅభివృద్ధి జరుగుతుందని అంతా భ్రమ పడ్డాము.. గత ప్రభుత్వము విద్యకు కేటాయించ బడిన బడ్జెట్ ఈ ప్రభుత్వము గత ఎనిమిదేళ్లుగా క్రమక్రమంగా తగ్గిస్తూ 6.71% నామామాత్రపు బడ్జెట్ కేటాయిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుందా… ప్రాథమిక విద్యలో 20 వేలకు పైగా ఖాళీలు, సాంకేతిక విద్యలో ఖాళీలు, ఉన్నత విద్యలో కూడా వేలాది ఖాళీలతో నేడు తెలంగాణ విద్యారంగం ఉన్న దుస్థితి ఉంది. విద్యారంగ అభివృద్ధి కావాలంటే నిధుల కేటాయింపు పెంచాలి, ఖాళీల భర్తీ చేయాలి, విద్యాసంస్థలో భౌతిక వనరుల అభివృద్ధి జరగాలి.. ఈ పనులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి విద్యారంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లెకపోవడమే. బాసర విద్యార్థులు ఆందోళన ఒక్కసారిగా వచ్చింది కాదు. గత అయిదేళ్లుగా విద్యార్థులు ఎదురుకుంటున్న ఇబ్బందులే వారిని అనివార్యంగా పోరాటం వైపు మల్లించాయి.. తెలంగాణ లోని విద్యావేత్తలు, ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు బాసర విద్యార్థులకు అండగా ఉండాలే..బాసర ను బ్రతికించు కోవాలే.
– మై•స శ్రీనివాసులు
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి
TPTF




