తెలుగు వాకిట విరబూసిన ఆశల హరివిల్లు!

అహం అందలమెక్కి,చిందులేస్తున్న వర్తమానంలో ఆత్మీయతలకు చోటెక్కడ?
కరెన్సీ కాగితాలను ప్రేమించే కలి కాలంలో విలువలకు నీడెక్కడ?
వ్యక్తిత్వాలకు విలువెక్కడ?
స్వార్ధంలో మునిగి, అవినీతిలో స్నానమాడే సకల అవలక్షణాల సమాహారమైన సమాజంలో వెలుతురు కంటికి కంటగింపుగా మారింది.చీకటి పరదాలు చిద్విలాసం చేస్తున్నాయి.
ఆశ ఆకాశానికంటితే అవకాశం పాతాళంలో దాగుని రారమ్మని పిలుస్తుంటే,
అందుకోలేని అసహాయత నిరాశకు గురిచేస్తుంటే,
అగాధాల అంచులను అవలీలగా తాకి, అవకాశాలను హత్తుకునే హద్దులు లేని స్వార్ధం ఆనంద తాండవమాడుతుంటే,
కరెన్సీ కట్టలే తెలివికి,తెగువకు ఇంధనమైతే
అక్రమార్కులు విక్రమార్కులై
వినువీధుల్లో హుంకారం చేస్తే,
నిజమైన తెలివి నిట్టూర్పు విడిచింది.
నింగి నంటిన అహం జగమంతా పాకింది.
నిజమైన ఆలోచనలు నీరుగారి పోతున్నాయి.
అరుదైన గుణాలు ఆవిరైపోతున్నాయి.
నిఖార్సయిన వ్యక్తిత్వాలు నిలువ నీడలేక వలవలా కన్నీరు కారుస్తున్నాయి.
స్వేచ్ఛ ను కోరిన సెలయేళ్ళన్నీ  ఎగసిపడి మురిసి పోతున్నాయి.
పోటెత్తిన నీటి ప్రవాహాలన్నీ  సంద్రపు సుడిగుండాల బిగి కౌగిలిలో చిక్కి సహజత్వాన్ని  కోల్పోతున్నాయి.
మాటలు నీటిమూటలై విలువను కోల్పోతున్నాయి.
మాట నిలకడ లేని మనుషుల లోకంలో కల్మషం తెలియని గుండెలకు తగిలే మానని గాయాలకు మందెక్కడ?
కాలం ఒడిలో దాగున్న కత్తులు
త్యాగాల ఊపిరిని ఉరికంబమెక్కిస్తుంటే,
కాగితపు పూలన్నీ వికసించి, పరిమళాలు వెదజల్లునా?
నిశ్శబ్దపు అడుగుల్లో ఎన్నో ఆలోచనా శరాలు అలజడులను సృష్టిస్తున్నాయి.
వెంటాడిన నీడలు- వేధించిన క్షణాలు వెల్లువై, బ్రతుకు పంటలో కలుపు మొక్కలై పీడిస్తే, హాయిగొల్పిన అనుభూతులు చెదిరిన స్వప్నాలై శిథిలమైన జీవితాల్లో అనుభవాల సమాధులు నిర్మించాయి.
జీవం లేని నీడలు ఆకారాన్ని సంతరించుకుని అలజడులను సృష్టించాయి.
క్షణకాలం ఆగి చూస్తే,క్షణమైనా ఆగని కాలం గురుతుగా మిగిలింది.
గతించిన కాలం కళ్ళ నుండి కారిన కన్నీటి  చుక్కలు మరో ఉషోదయానికి జ్ఞాపకాలుగా మిగిలాయి.
మరో ఉగాది విచ్చేసింది.
షడ్రుచులు ఆరగించి, జీవిత సందేశాన్ని ఆలకించమని సందేశమిచ్చింది.
రంగురంగుల ఆశలకు రెక్కలు తొడిగి ఎగరాలని కోరింది.
జీవితాన్ని బ్రతికించే ఆశల హరివిల్లు ఉగాదిని స్వాగతించి, సంబరాలు చేసింది.
(ఉగాది సందర్భంగా…)

సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్‌ స్పీకర్‌)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *