- ‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి
- ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది..
- అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు
- కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి
- విజయ భేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని…కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని, కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారని, తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారు… కేసీఆర్ గారూ..మీరు వెళుతున్న రోడ్డు కాంగ్రెస్ వేసింది…మీరు చదువుకున్న స్కూల్ నిర్మించింది కాంగ్రెస్..హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్…హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయంటే అందుకు కారణం కాంగ్రెస్..అంటూ కెసిఆర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ జవాబిచ్చారు.
కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని, మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని, రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని, రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తామని, రైతులకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. శనివారం సాయంత్రం తాను నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు. అధికారంలోకి రాగానే చదువుకునే యువతకు విద్యా భరోసా ద్వారా రూ.5 లక్షలు సాయం అందిస్తామని, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అందుబాటులోకి తెస్తామని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండని రాహుల్ గాంధీ కోరారు.





