‘‌తెలంగాణ’కు దర్వాజ ఖమ్మం

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాజకీయ పార్టీలన్నిటికీ ఖమ్మం వేదికగా మారింది. తెలంగాణపై ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న పార్టీలన్నీ ఖమ్మంనే తమ ప్రధాన కేంద్రంగా చేసుకుంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల కోసం చాలాకాలం ముందునుండే సమాయత్తమవుతున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలన్ని కూడా తమ ప్రచార సభలకు ఖమ్మం జిల్లానే అనువైనదిగా భావిస్తున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహించగా, మరికొన్ని పార్టీలు తాము చేపట్టిన కార్యక్రమాల ముగింపు సభలను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని సంకల్పించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల అయిదు లక్షల మందితో ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుక సమావేశంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించి ఖమ్మంలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేసింది అధికార పార్టీ. వాస్తవంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుండి జరిగిన రెండు ఎన్నికల్లో  బిఆర్‌ఎస్‌ ఇక్కడ తన సత్తా చాటుకోలేకపోయింది.

ఈ రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కో సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి నుండీ వామపక్ష పార్టీలకు పెట్టని కోట. అయితే కాలక్రమేణ కాంగ్రెస్‌, ‌టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీల పట్టు ఇక్కడ పెరుగుతూ వొచ్చింది. ఆయా పార్టీల నుండి గెలిచిన అభ్యర్థులు గత రెండు ఎన్నికల్లో తర్వాత కారెక్కడం వేరే విషయం. నాయకులే పార్టీ మారారుగాని కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం అందుకు భిన్నంగా ఉందన్న విషయాన్ని గ్రహించిన విపక్ష పార్టీలు ఖమ్మంను పట్టుకుంటే అధికార పార్టీని ఇబ్బందిపెట్టవచ్చన్న ఆలోచనకు వొచ్చాయి. దీంతో కొత్తగా రంగ ప్రవేశం చేసిన వైఎస్‌ఆర్‌టిపి, జనసేన, టిడిపి పార్టీలు ఖమ్మం మీదనే దృష్టి సారిస్తూ వొచ్చాయి. ఇటీవల పున:ప్రవేశించిన టిడిపి తాజాగా భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం తెలియంది కాదు. దీంతో తెలంగాణపైన ఎట్టి పరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేస్తామన్న శపథంతో ముందుకు పోతున్న భారతీయ జనతాపార్టీ కూడా రానున్న ఎన్నికల కోసం ముందస్తు భారీ ఙహిరంగ సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేస్తుంది. రేపు 15వ తేదీన జరుగనున్న ఈ సభకు ముఖ్య అతిధిగా కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా రానున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టి తొమ్మిదేళ్ళు అయిన సందర్భంగా బిజేపి పార్టీ ‘మహాజన్‌ ‌సంపర్క్ అభియాన్‌’ ‌పేరిట దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన రెండు సభల్లో ఒకటి 15వ తేదీన జరుగనుంది.

బిఆర్‌ఎస్‌కు లాగానే బిజెపికి కూడా వాస్తవంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా పట్టులేదు. ఒక విధంగా బిజెపి తెలంగాణపై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో అమిత్‌షా భారీ బహిరంగ సభ ప్రాదాన్యతను సంతరించుకుంది. ఇక్కడ వారికి స్థానమేలేదని చెబుతున్నవారి నోళ్ళు మూసేవిధంగా సుమారు లక్షమందితో ఈ సభను ఏర్పాటు చేయాలనుకుంటుంది బిజెపి. జాతీయ మీడియా కూడా ఈ సభపైనే దృష్టిపెట్టే అవకాశాలున్నాయి. ఈ సభ రానున్న ఎన్నికలకు సంబంధించి రాజకీయ  విశ్లేషణకు అవకాశంగా మారనుంది. అందుకుగాను అ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఈ ‌సభను ఎట్టి పరిస్థితిలో భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్త ప్రతీ ఇంటికి వెళ్ళి వారిని సభాస్థలికి తరలించే విషయంలో చొరవ చూపాలని ఆయన వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ ‌నుండి వేలాది మందిని తరలించే బాధ్యతను వారికి అప్పగించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో కేవలం ఒకే స్థానాన్ని ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌గెలసుచుకున్నప్పటికీ నిన్నటి వరకు పది నియోజకవర్గాలు బిఆర్‌ఎస్‌ ‌ఖాతాలో చేరినవే. అయితే ఇక్కడ మాస్‌ ‌లీడర్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బిఆర్‌ఎస్‌ ‌బహిష్కరించడంతో ఖమ్మం రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రమంతా బిఆర్‌ఎస్‌ ‌గాలి ఉండగా ఆ పార్టీ తన బద్ధ శత్రువుగా భావించిన వైఎస్‌ఆర్‌ ‌పార్టీ నుంచి గెలిచిన శ్రీనివాసరెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరినా ఇముడలేక పోయాడు. ఆయన ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన సత్తాచాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇతర పార్టీల నాయకులందరినీ కలుపుకుపోతున్నాడు. ఖమ్మం జిల్లా నుండి ఒక్కరు కూడా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏగా శాసనసభలో అడుగు పెట్టకుండా చేస్తానని శపథం చేశాడు. తర్వాత మెత్తపడినా బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనాల పేరున నియోజవర్గమంతా కలియతిరిగిన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌ అభిమానులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకులు ఉండడంతో వైఎస్‌ ‌షర్మిల కూడా ఇక్కడి పాడేరు నియోజకవర్గంను తనకు అనుకూలంగా భావించి ఖమ్మం రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. రాహుల్‌ ‌గాంధీ పిలుపుమేరకు ‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ కార్యక్రమంలో భాగంగా సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 101 రోజుల పాదయాత్ర ముగింపు సమావేశం కూడా ఖమ్మం జిల్లాలోనే జరుపాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 25న ముగియనున్న ఈ యాత్ర సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ‌భావించింది. సుమారు రెండు లక్షల మందితో ఏర్పాటు చేయనున్న ఈ సభకు సోనియా, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ అన్నిటి కన్నా ముందు వరుసలో ఉండాల్సిన వామ పక్షాలు ప్రస్తుతం మిగతా రాజకీయ పార్టీల కన్నా కాస్త వెనుకబడి ఉన్నాయి. అధికార బిఆర్‌ఎస్‌తో పొత్తులో ఉన్న ఈ పార్టీలు ఖమ్మంలో తాము కోరుకున్న స్థానాలిస్తేనే పొత్తు అంటున్నాయి. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రానికి దర్వాజగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *