తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో
ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ..
హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన సెంటిమెంట్‌తోనే లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తుక్కుగూడ నుండే ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. తాము గెలిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ చెప్పినట్లుగానే ఇప్పటి వరకు అయిదు గ్యారంటీలను అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మరో గ్యారంటీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో అదికాస్తా వాయిదాపడిరది. అయితే ఈ గ్యారంటీ లన్నీ గ్యారంటీగానే అమలు అవుతుండడంతో తెలంగాణ ప్రజల నుండి మంచి స్పందన రావడాన్ని గ్రహించి, లోకసభ ఎన్నికల్లో ‘పాంచ్‌ న్యాయ్‌’ పేర అయిదు గ్యారంటీలను ప్రకటించే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆనాడు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టోను ఈసారి కూడా దక్షిణాదిలో ఇదే తుక్కుగూడ వేదిక నుండే కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టనున్న ఈ అయిదు గ్యారంటీలకు సంబంధించి ఒక్కో గ్యారంటీ పరిధిలో అయిదు అంశాలను కలిపుకుని మొత్తం 25 అంశాలను పొందుపర్చారు. వీటన్నిటికీ మూలం కర్ణాటక, తెలంగాణలో ప్రవేశపెట్టిన గ్యారంటీలే. కర్ణాటకలో అయిదు గ్యారంటీలను ప్రకటించడం ద్వారా ఆక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చింది. కాగా కర్ణాటకలో అమలవుతున్న గ్యారంటీల తీరుకు తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడి ఇక్కడ కూడా ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారు.

ఇక్కడ కూడా ముందుగానే చెప్పినట్లు వంద రోజుల్లో ప్రకటించిన  గ్యారంటీల ను అమలుచేసి చూపించడంతో ప్రజల్లో కాంగ్రెస్‌ మాటమీద నమ్మకం ఏర్పడిరది. అయితే ఇక్కడ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో చివరి అంశాన్ని అమలు చేయాల్సిఉంది. ఈ ఆరు గ్యారంటీల పరిదిలో దాదాపు 13 అంశాలను మానిఫెస్టోలో పొందుపర్చగా, ఇంకా ఎనిమిది అంశాలను ప్రజలకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఈలోగా లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడిరది. కాగా,  కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న గ్యారంటీల స్ఫూర్తితో కాంగ్రెస్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాంచ్‌ న్యాయ్‌ పేర అయిదు గ్యారంటీలను అధికారంలోకి వొచ్చిన వందరోజుల్లో అమలు చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నది. ముఖ్యంగా పేదలు, యువకులు, మహిళలను ఆకట్టుకునే విధంగా రూపొందించిన ఈ గ్యారంటీల విషయాన్ని ఆయా కమ్యూనిటీల్లో విస్తృతంగా తీసుకువెళ్ళాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నది. ఈ గ్యారంటీలతో అటు కేంద్రంలో అధికారంలోకి రావడంతోపాటు తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ఈ మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తున్నది. కాస్త పేర్లలో మార్పులున్నా ఇంచుమించు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు అవుతున్న గ్యారంటీల విధానం మాత్రం ఒక్కటే. కర్ణాటకలో అన్న భాగ్య పేర పేదలకు పది కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తే, తెలంగాణలో రైతు భరోసా పేర ఎకరానికి 15 వేలతోపాటు, వరిపంటకు క్వింటాలుకు అదనంగా అయిదు వందల బోనస్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. శక్తిపేర కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించినట్లే ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

కర్ణాటకలో ఇస్తున్నట్లుగా గృహజ్యోతి కింద ఇక్కడ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తున్నారు. అక్కడ విద్యార్థులకు యువనిధి స్కీమ్‌ లాగా ఇక్కడ విద్యా భరోసా పేర అయిదు లక్షల భరోసా కార్డు ఇచ్చే విధంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్న గ్యారంటీల్లో  మహిళల కోసం నారీ న్యాయ్‌,  కిసాన్‌ న్యాయ్‌, యువన్యాయ్‌ అంటూ అయిదు న్యాయ్‌ల పేరున కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తున్నది. ఇది కేవలం ఎన్నికల ప్రణాళికనే కాదు, అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలకు ఉజ్జ్వల భవిష్యత్‌ను కల్పించే న్యాయపత్రంగా ఆ పార్టీ పేర్కొంటున్నది. ఈ గ్యారంటీలు సమాజంలో అనూహ్య మార్పును తీసుకు వొస్తాయన్న నమ్మకాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు తప్పకుండా తమ మ్యానిఫెస్టోను ఆదరిస్తారన్న నమ్మకాన్ని చెబుతున్న కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటివారంలో తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో దీన్ని విడుదల చేయబోతున్నది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతీ జిల్లా నుండి కనీసం ఇరవై అయిదు వేలకు తక్కువ కాకుండా ప్రజలను సభకు తరలించే విధంగా ఆయా జిల్లాల స్థానిక ఎంఎల్‌ఏలు, మంత్రులు, ఇతర ముఖ్యనాయకులకు ఇప్పటికే సందేశాలు అందాయి,. ఈ గ్యారంటీలతో రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకున్నప్పటికీ తుక్కుగూడ సెంటిమెంట్‌ ఆ పార్టీకి ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *