తాంబూలాలిచ్చారు…ఆశీర్వదిద్దాం

నేడు వోట్ల పండుగ.. ఆలోచించి, తప్పనిసరిగా వోటేద్దాం..
మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిద్దాం
సమర్థ ప్రతినిధులను పార్లమెంటుకు పంపుదాం
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

నేడు వోట్ల పండుగ. చట్ట సభలలో ఒకటైన దిగువ సభ లోక్‌ సభలో మరో అయిదు సంవత్సరాల పాటు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రయోజనలు, హక్కులు కాపాడుతూ, చట్టాల రూపకల్పనలో పాలుపంచుకోవడానికి మన కొరకు, మన చేత మన ప్రతినిధిగా పంపడానికి వోటు ద్వారా మనం  ఎన్నుకుని పార్లమెంటుకు పంపే పండుగ. వాస్తవంగా ఇది మనకు చాలా బాధ్యతాయుతమైన కర్తవ్యం….మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. 543 లోక్‌ సభ సభ్యులకు గాను తెలంగాణ నుంచి 17 మంది సభ్యులను ఎనుకోవాల్సి ఉంది. వాస్తవంగా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంపై అభ్యర్థికి పూర్తి అవగాహన అవసరం. అభ్యర్థికి ముఖ్యంగా స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, వాటి ప్రాథామ్యాలపై పూర్తి స్థాయి పట్టు ఉండాలి. సభా సమావేశాలు లేనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. తనకు ఎంపి లాడ్స్‌ కింద కేటాయించిన నిధులను నియోజకవర్గ ప్రయోజనాలకు, ప్రజల అవసరాలకు ఖర్చు చేయాలి. అవసరమయినప్పుడు నియోజకవర్గ సమస్యలను పార్లమెంటులో మన ప్రతినిధిగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడాలి. దేశప్రయోజనాల పరిరక్షణకు, అవసరాలకు అనుగుణంగా చట్టాల తయారీలో పాలు పంచుకోవాలి. ఇదంతా రాజ్యాంగ రీత్యా ఒక పార్లమెంట్‌ సభ్యునికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలలో భాగం. అయితే నేడు వాస్తవంగా పాలన ఈ విధంగా కొనసాగుందా అంటే నూటికి నూరు శాతం లేదనే చెప్పాలి. ఇందుకు కేవలం పాలకులనే నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే పాలకులు ఎవరో కాదు. వారు మనం వోటు వేసి ఎన్నుకుని పంపించిన మన ప్రతినిధులే. కనుక మొన్నటి వరకు మన నాయుకులు, పార్టీలు వాళ్లు చెప్పేది చెప్పారు. వాగ్దానాల తాంబలాలను మన చేతిలో పెట్టారు. ఏది కార్యరూపం దాల్చుతుందో…ఏది దాల్చదో ఆలోచిద్దాం. ఇప్పుడు వోటు అనే ఆయుధం మన చేతిలో ఉంది. కనుక మనం ఉన్నంతలో ఆలోచించి తప్పనిసరిగా వోటేద్దాం…మనకు నచ్చిన వారిని ఆశీర్వదిద్దాం.

అదటుంచితే మార్చ్‌ 16న 18వ లోక్‌ సభకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసే వరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావిడి ఇంతా అంతా కాదు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, బస్సు యాత్రలు, కార్నర్‌ మీటింగులు, జాతీయ నాయకులతో బహిరంగ సభలు… ఇలా వాద..ప్రతివాదాలు, ఆరోపణలు… ప్రత్యారోపణలు,  దూషణలు..ప్రతి దూషణలు, సవాళ్లు…ప్రతి సవాళ్లు, వాగ్దానాలతో రాష్ట్రం, ఇక ఏడు విడతల ఎన్నికలతో దేశం మొత్తం మారు మోగింది. గతంలో ఎన్నికలు వొచ్చాయంటే పండుగ వాతావరణం నెలకొనేది. గ్రామం మొదలు దిల్లీ వరకు జండాలు, పోస్టర్లు, మైకులతో ప్రచారాలతో ఎంతో ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం నెలకొని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నాయకులు చెప్పే మాటలు వినేవారు. వారికి కూడా ఇప్పుడున్నంత అస్తవ్యస్త, అయోమయ పరిస్థితి ఉందేది కాదు. ప్రలోభాలనేవి బహు అరుదు. వారు స్వతంత్రంగా ఆలోచించి అభ్యర్థుల గుణగణాలను, సమర్థతతను బేరీజు వేసుకుని వోటు వేసేవారు. ఇక పోటీలో ఉన్న వ్యక్తులు ప్రత్యర్థులు ఎదురుపడినా మనస్పూర్తిగా ఆప్యాయంగా పలకరించుకునే వారు. రాజకీయాలను వ్యక్తిగత సంబంధాలతో ముడిపెట్టేవారు కాదు. నేటికి మల్లే యుద్ధ వాతావరణం కనిపించేది కాదు. పోటీలో ఉన్నవారు కూడా ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి తనకు వోటేయాలని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తంగా చాలా సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు ఒక పండుగలా జరిగేవి.

ఇక వర్తమానంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విషయానికి వొద్దాం. పార్టీలను పక్కన పెడితే నాయకులు మాట్లాడిన మాటలకు విశ్వసనీయత లేదు. వారి వాగ్దానాలు ఆచరణకు నోచుకునేవిగా లేవు. అందుకే వారు ప్రజలను విశ్వసింప చేయడానికి పడని తిప్పలు లేదు. చివరకు ప్రజలను నమ్మించడానికి వారు ఎంతో విశ్వసించే దేవుళ్లను కూడా నిస్సంకోచంగా రాజకీయాలకు ఉపయోగించు కుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇక ప్రస్తుతం రెండు జాతీయ పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు ప్రజలకు ఎంత వరకు ఉపయోగకరమో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, సామాజిక ఆర్థిక గణన, రామమందిర నిర్మాణం, హిందూ మత పరిరక్షణ ఇత్యాది అంశాలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం సాగింది…దేశ వ్యాప్తంగా ఇంకా ఎన్నికలు కాని ప్రాంతాల్లో సాగుతున్నది. ఇక ఆచరణకు సాధ్యమా..కాదా అనే వివేచన కూడా లేకుండా ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రజలకు ఇస్తున్న హామీలను చూస్తే భయం వేస్తున్నది. ప్రజలను ఇప్పటి నాయకులనే వారు ఏ దిశగా నడిపిస్తున్నారనేది తలుచుకుంటే ఎంత ప్రమాదక పిరిస్థితిలోకి సమాజం వెళుతున్నదో అర్థం కావడం లేదు.

ప్రజల, దేశ అభివృద్ధికి అవసరాలయిన విద్య, వైద్యం, ఉపాధి ఇత్యాది అంశాలపై ఏ ఒక్క పార్టీ నిర్దుష్టమైన, నిర్మాణాత్మకమైన ప్రణాళికలు ప్రజల ముందు ఉంచడం లేదు. తాము గెలిస్తే గెలిపించిన ప్రజల స్థానిక, రాష్ట్ర, దేశ అవసరాలను తమ శక్తి మేరకు తీరుస్తామని గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. ఎంత సేపూ ప్రజలను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకుందామా, తాయిలలాలను ఎరవేసి వోట్లను రాబట్టుకుందామా అనే ఆలోచనా ధోరణితోనే నేటి నాయకులు రాజకీయాలు కొనసాగిస్తున్నారు. పిల్లలకు వర్తమానంలో ఆదర్శంగా చూపగలిగిన నాయకుడు నేడు ఒక్కరు కూడా లేరని నిస్సందేహంగా చెప్పవచ్చు. అదే ఒకప్పుడైతే చాలా మంది ఆదర్శవంతంగా ఉండి నిజమైన నాయకులుగా ప్రజలకు మార్గదర్శకలులగా ఉండేవారు. ప్రస్తుతం అలాంటి నాయకులు అవసరం. గీతాచార్యుడు ఉద్బోధించినట్లు… యద్యాదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జన:..అన్నట్లు ఉత్తములైన నాయుకులు సమాజంలో ఉద్భవిస్తే…వారిని అనుసరించి మంచి సమాజం తయారవుతుంది. ఆ రోజులకు ఆశిద్దాం. ఇక మనకు రాజ్యాంగం కల్పించిన బాధ్యత, హక్కు వోటు వేయడం. ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని మనం వొదులుకోవద్దు. ఆలోచించి ఉన్నంతలో మంచి ప్రతినిధికి వోటేద్దాం..గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. విధిలేని పరిస్థితిలో నోటాకు వేద్దాం. కానీ తప్పనిసరిగా వోటేద్దాం…మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తద్వారా దేశాన్ని, మన ప్రాథమిక హక్కులను కాపాడుకుందాం.
-వి.రామ్మోహన్‌ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *