‘‘ఈ ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్ మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి అర్థమైతే ఇది రాజుకి ,రాజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ విప్లవకారులకి మధ్య ఘర్షణ మాత్రమే అన్న విషయం స్పష్టంగా అర్థం కాక తప్పదు.’’
భారతదేశంలో హైదరా బాద్ సంస్థాన విలీనం ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే తన స్వయం ప్రతిపత్తితో, రాజ్యాధికారంతో, నిరంకుశ పాలనతో నిజాం ప్రభువు రాజ్యమేలే కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం వెన్నులో వణుకు పుట్టించింది.దీంతో నిజాం పాలకులు రజాకార్ల సైన్యాన్ని రంగంలోకి దించారు.రజాకార్లు గ్రామాలపై పడి మరింత హింసకు పాల్పడ్డారు.1947 ముందు భారతదేశం అనేక సంస్థానాలుగా ఉండింది. ఆనాటి బ్రిటీష్ పాలకులు భారత యూనియన్లో సంస్థానాల విలీనం వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థానాలు తమకిష్టమైతే యూనియన్లో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అని పేర్కొన్నారు. దీంతో రాజ్యాలు ఏలిన అందరు రాజుల్లాగే నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా మంచి చెడుల మిశ్రమంలా భారత యూనియన్లో కలిసేందుకు నిరాకరించాడు. మరోవైపు భారత యూనియన్లో విలీనానికి నిజాం రాజుపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి తెలంగాణ ఈ దేశంలో భాగమైంది. నిజాంకు, బ్రిటన్ మధ్య ఉన్న ఒప్పందం లోని షరతులను నిజాం ఉల్లఘించాడు.దీనికి తోడు 1948 నాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉదృతం అయ్యింది. రజాకార్లు, సాయుధ పోరాట విప్లవకారులకు మధ్య జరిగిన ఘర్షణల వల్ల హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలగడంతో హైదరాబాద్ పై పోలీసు చర్యకు నాటి కాంగ్రేస్ ప్రభుత్వం నడుం కట్టింది.
సెప్టెంబర్ 14నుండి సెప్టెంబర్ 17, 1948 వరకు నాలుగు రోజుల పాటు ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు.హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్లోనైన విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడు.పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు.అప్పటికే సమాచార సాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు.బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్లో విలీనమైంది.అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్య్రం లభించింది.అలా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది. ‘ఆపరేషన్ పోలో’ సమయంలో వేలాది మంది అమాయక ముస్లింలను సైతం ఊచకోత కోసినారనే వాదన ఉన్నది.అప్పటికే ప్రజా సాయుధ పోరాటాలు,తెలంగాణలో ఉధృతంగా సాగుతున్నాయి.ఆ పోరాటాలు విజయవంతమైతే తెలంగాణ రాజ్యం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపిందనేది వామపక్ష వాదుల వాదన.కొంతమంది కమ్యూనిస్టులు అతివాద దృక్పథంతో చరిత్రను వామపక్ష పక్షపాత సైద్దాంతిక ధోరణికి అనుకూలంగా ఇప్పటికీ ఇది విద్రోహ దినమే అని వాదిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాలన్నీ సెప్టెంబర్ 17 చుట్టూ తిరుగుతూ, ఒక్కో రాజకీయ పార్టీ దినాన్ని ఒక్కోలా అభివర్ణిస్తూనే ఉంది. నాడు తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు అంతా కలిసి పోరాడి నందునే హైదరాబాద్ సంస్థానం విలీమైందని, సెప్టెంబరు 17 జాతీయ సమగ్రత దినోత్సవంగా జరిపించాలంటూ ‘ఎంఐఎం’ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన లేఖ రాసి ప్రకంపనలు సృష్టించారు.అప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్ణయించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి బదలాయింపు జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమానికి సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాలు.చరిత్ర పుటలలోకి ఎక్కని మన చరిత్ర సంస్కృతికి కేసీఆర్ అమోఘమైన ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటిస్తూ సెప్టెంబర్ 16,17 • 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఆనాడు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ఉండగా కాంగ్రెస్ పార్టీ కృషితో తెలంగాణకు స్వేచ్చ లభించిందని కాంగ్రేస్ వాదన. ఇక కాంగ్రెస్, టీజేఎస్ తదితర పార్టీలు మధ్యేమార్గంగా దీన్ని విలీన దినోత్సవంగా వర్ణిస్తున్నారు.
2014 లో గద్దెనెక్కిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు సోయి లేకుండా విమోచనా గుర్తు రాకుండా ఒక్కసారిగా సెప్టెంబర్ 17’ చరిత్రకు మలినం చేసేపనిలో పడ్డది.మసిపూసే ప్రయత్నాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఒడిగట్టింది. ఒక్క సారిగా ఉసిగొల్పేలా వ్యవహరిస్తుంది.నిజాం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల’ పేరుతో గొంతు చించుకొని విమోచన దినం చేయాలని నిర్ణయించింది. ఈ ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్ మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మద్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమ్కూర్చింది. ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి అర్థమైతే ఇది రాజుకి ,రాజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ విప్లవకారులకి మధ్య ఘర్షణ మాత్రమే అన్న విషయం స్పష్టంగా అర్థం కాకతప్పదు.బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అసలు చరిత్రను వక్రీకరించి, చరిత్రను తమకు అనుకూలంగా మల్చుకుంటూ మత విద్వేషాలు సృష్టించే పనిలో నిమగ్నమై రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలని కుట్రపూరిత వైఖరితో జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఏడాది పొడవున విమోచన ఏజెండా మోస్తుందనే విమర్శ ఉంది.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లకు ఎలాంటి పాత్ర లేదని, ఆ పోరాటంలో పాల్గొన్న సాయుధ పోరాట యోధులకు ఫించన్లు ఆపిన చరిత్ర అధికారంలో వున్న బీజేపీకి ఉందని, తెలంగాణ విమోచనంపై మాట్లాడే హక్కు ఎప్పుడో కొల్పోయిందని ఉద్యమ కారులు చెప్పడం గమనార్హం.
డా।। సంగని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355



