మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం.
ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత విపరీతంగా డ్రగ్స్ తీసుకోని బానిసై తమ అముాల్యమైన ప్రాణాలను కొల్పోతున్నారు.డ్రగ్స్ అంటే శరీరాన్ని మత్తులో ముంచే పదార్థాలను మాదక ద్రవ్యాలు అంటారు.వాడుక భాషలో డ్రగ్స్ అని వ్యవహరిస్తారు.ఆరోగ్యానికి చేటు తెచ్చే ఈ పదార్థాలను రోజూ సేవించటం వలన అది అలవాటుగా మారుతుంది.నల్లమందు, కొకైన్, హెరాయిన్,డెమోరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్,వికోడిన్,ఆక్సీకోన్టి
మన దేశంలోని చట్టం ప్రకారం గంజాయి కూడా మాదక ద్రవ్యంగానే పరిగణించబడుతుంది.మత్తుని తీసుకొనే ప్రారంభ దశలో దానికి బానిస అయ్యే ఉద్దేశం ఎవరికీ వుండదు.కౌమార దశలో వున్న పిల్లలు,యువత ప్రతి దానినీ ధిక్కార ధోరణితోనే చూస్తారు.ఎదుగుతున్న వయసులో వారి మనస్తత్వం అలాగే వుంటుంది.ఈ క్రమం వాళ్లు డ్రగ్స్ తీసుకోవటం గొప్ప సాహసంగా భావిస్తారు.ముఖ్యంగా స్నేహితుల ద్వారా ఈ విష వలయంలోకి లాగబడతారు.అయాచితంగా వచ్చిపడే డబ్బు,వారాంతపు వేడుకలు,వ్యాపారంలో నష్టాలు,భార్యభర్తల మధ్య గొడవల వలన వచ్చే చికాకులు మొదలైన వాటితో పెద్దవారు ఈ కూపంలోకి దిగుతారు.ధూమపానం,మద్యపానం వంటివి కూడా డ్రగ్స్ ఉచ్చులోకి లాగుతాయి.ఏదో సరదాగా,తాత్కాలికంగా ప్రారంభం అయిన, ఈ దురలవాటు దీర్ఘకాలిక జాడ్యంగా మారుతుంది.ఒకసారి ఈ ఊబిలోకి దిగినవాళ్లు బయటపడటం కష్టసాధ్యమే. వ్యసనంగా మత్తు పదార్థాలను విరివిగా తీసుకోవటం వలన మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనిక ప్రభావాల వలన,అదే మత్తును మళ్ళీమళ్ళీ కోరుకొంటారు.వీరి మెదడు ఆ మత్తుకి కండిషనింగ్ అయి బానిసగా మారిపోతుంది.
ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారు. ప్రతీ యేటా రూ.200 నుంచి రూ.300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నదని ఐరాస పేర్కొంది. మాదక ద్రవ్యాల వ్యాపారం వల్ల సంపాదిస్తున్న డబ్బు ఆసియా, ఆఫ్రికా దేశాలలో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగింపబడు తున్నదని ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ’ వెల్లడించింది. అఫ్ఘనిస్థాన్ లో ‘పాపి’ (నల్లమందు) బాగా పండిస్తారు. దీనివల్ల వచ్చే డబ్బుతో తాలీబాన్ మొదలైన ఉగ్రవాదులు బలపడుతున్నారు. పాక్ గూఢచార సంస్థ పాకిస్థానీ సైన్యం, మాఫియా ఏకమై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నాయి. మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిస లైనారు. కొకైన్ వ్యాపారం భారత్ లోనూ బాగాసాగుతున్నది. కొకైన్ ఒక్క గ్రాము సుమారు ఇరవైవేల రూపాయల ధర ఉంటుందని సమాచారం. మన దేశంలో ఏడాదికి 200 కిలోల కొకైన్ వినియోగిస్తు న్నారని తెలుస్తున్నది. గతేడాది డ్రగ్స్ వినియోగం పెరిగినట్టు, నగరాలలో, పట్టణాలలో ముఠాలుగా ఏర్పడి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తూ అనేక మంది పట్టుబడిన ఉదాంతాలున్నాయి.ఈ డ్రగ్స్ రాకెట్లో పెద్దల హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మత్తులో ముంచెత్తే డ్రగ్స్ టీనేజ్ కుర్రకారును ఆగమాగం చేస్తున్నాయి. వీటి బారిన పడినవారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరి గానే గడుపుతూ మృత్యువుకు చేరువ వుతారు. డ్రగ్స్‌కి అలవాటు పడ్డవారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతుంటారని, సన్నిహితులకు దూరంగా గడుపుతారని, కోపం, సీరియస్‌గా ఉంటూ తరచూ ఉద్రేకానికి గురవుతూ వారిలో వారే మాట్లాడుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
డ్రగ్స్‌లో కూడా అనేక రకాలుంటాయి. ముక్కుద్వారా పీల్చేవి, నోటితో తీసుకునేవి, ఇంజక్షన్ రూపంలో తీసుకునేవి, పొగ పీల్చేవి. గతంలో మన రాష్ట్రంలో గంజాయిని పండించిన వారు ఆర్థికంగా ఎదిగారు. ఏజెన్సీ ప్రాంతాలు, గుట్టల ప్రదేశాలలో గంజాయిని అంతర పంటగా వేసేవారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో గంజాయి పంట రాష్ట్రం నుండి తుడిచి పెట్టుకు పోయింది. అనేక మంది సిగరెట్లలో గంజాయిని పెట్టుకుని దమ్ము కొట్టేవారు. ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నా డ్రగ్స్ దందాలో యువత భాగస్వాములవు తున్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.దేశంలోని అన్ని రాష్ట్రాలలో చాపకింద నీరులా డ్రగ్స్ వ్యాపారం విస్తరిస్తున్నది.ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కాలేజీ లలో, పాఠశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలి.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సిగరెట్లు, బీడీలు తాగేవారి సంఖ్య అధికంగా ఉన్నది. వీటి అమ్మకాల మాటున డ్రగ్స్, మత్తు పదార్థాల విక్రయాలు పెరుగు తున్నాయి. 1985లో మన భారత ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రిపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టాన్ని చేసింది. దీని ప్రకారం మాదక ద్రవ్యాల ఉత్పత్తిదారులకు, వినియోగదారు లకు కనీసం పదేండ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (న్యూఢిల్లీ)ను 1986 మార్చి 17న ఏర్పాటు చేశారు.యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్ కారణంగా 1.05 లక్షల మంది మరణిస్తే,2015 నాటికి ఈ సంఖ్య 1.68 లక్షలకు చేరుకుంది . ఇప్పుడు రెండు లక్షలకు పైగా దాటింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28.4 కోట్లమంది నిషిద్ధ మాదక ద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని 2020 లోనే తెలిపారు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) విడుదల చెసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఆందోళన, ఎవరో తరుముకొస్తున్నట్లు భయం, ఏదో కోల్పోయినట్లు లోటు ఫీల్ అవ్వటం, చదువు మీద ఆసక్తి తగ్గటం,తమలో తామే మాట్లాడుకోవడం,శూన్యంలోకి చూస్తూ వుండటం,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం,తనకు వచ్చిన ఫోను రహస్యంగా మాట్లాడటం,గుండె దడ పెరగటం,రక్తపోటు పెరగటం లేదా తగ్గటం,అనవసరమైన వాటికి అరవటం,అసహనం, నిద్రలేమి, బాంధవ్యాలకు విలువ ఇవ్వకపోవటం,కళ్ళ కింద చర్మం నలుపుగా మారటం,కాళ్ళుచేతులలో వణుకు కనిపిస్తాయి.కేంద్ర నాడీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది.తద్వారా శరీరంలోని అవయవాల పని తీరు దెబ్బ తింటుంది.పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించిన మీదట,మత్తు వినియోగం రూఢి చేసుకొన్న వెంటనే చికిత్స చేయించాలి.మొదటిగా మానసిక నిపుణునితో కౌన్సిలింగ్ ఇప్పించాలి.కొందరి విషయంలో కౌన్సిలింగ్ పలుమార్లు అవసరం పడొచ్చు.దీని వలన తాము కోల్పోయినదేమిటో తెలుసుకొంటారు. తన ప్రవర్తన వలన కన్న తల్లిదండ్రులు హతాశులై ఎంత తల్లడిల్లినారో,తన తోబుట్టువులకు ఎంత అవమానం జరిగిందో,ఇరుగు పొరుగు వారు తమను ఎంత చిన్నచూపు చూస్తున్నారో,సమాజంలో తమ ప్రతిష్ఠ ఎంత గా దిగజారిందో, నా వలన నా వాళ్ళు ఇంత బాధ పడుతున్నారా? ఈ రోతను వదిలించుకొని మంచిగా బతకాలి అని ఆత్మపరిశీలన చేసుకొనే విధంగా కౌన్సిలింగ్ వుంటుంది.
ఆ పిమ్మట మెడికల్ ట్రీట్మెంట్ వుంటుంది.ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చే వారిలో కేవలం 10 శాతం మాత్రమే మనసా, వాచా, కర్మణా ఈ వ్యసనం నుండి బయట పడాలని ధృడమైన నిశ్చయంతో వుంటారు. వీరికి శాస్త్రీయంగా వైద్యం అందిస్తే,ఆ రొంపి నుండి బయటపడి కొత్త నాణెము వలే మెరుస్తూ నూతన జీవితానికి తెరతీస్తారు.ట్రీట్మెంట్ కు వచ్చే మిగిలిన తొంభై శాతం మంది మాత్రం మానసికంగా చికిత్సకు సంసిద్ధులు కారు.వారికి తల్లిదండ్రులు బలవంతంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు.ఈ సందర్భాలలో ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సత్ఫలితాలను ఇవ్వలేదు.ఎంతటి అధునాతనమైన కారు ఉన్నప్పటికీ, ఆ కారు పరుగులిడటానికి రహదారి కావల్సిందేగా.అలాగే వ్యసనం నుండి విముక్తికి ట్రీట్మెంట్ సజావుగా సాగాలంటే రోగి మానసిక సన్నద్ధత అతి ప్రధానమైన అంశము.డిఅడిక్షను ట్రీట్మెంట్ కోసం శాస్త్రీయమైన వైద్యాన్నే ఆశ్రయించాలి.నాటు విధానాలకు వెళితే చేతులారా మరింత చేటు చేసుకొన్నట్లవుతుంది.
ఇది అంతర్జాతీయ సమస్య. ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వీడియో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, మాదకద్రవ్యాల దురలవాట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు.దీని వలన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ,తమ తోటి వారితో సఖ్యతగా మెలగుతారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాచార మంత్రిత్వ శాఖల సమన్వయంతో గ్రామీణ స్థాయిలో వివిధ కళారూపాల ద్వారా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చాలి. అప్పుడే సమాజం చైతన్యవంతమై, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటారు. చికిత్స కంటే నివారణ మేలు దీన్ని అందరూ పాటించాలి. అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది.బానిస బతుకు నుండి విముక్తి పొంది ఉజ్వల భవిష్యత్తు కై పయనిస్తారు.
మోటే చిరంజీవి
సామాజిక వేత్త,విశ్లేషకులు.
సెల్ : 9949194327





