జీవన సందర్భాల అల్లిక…

ఆశ… విత్తనం లేకుండా పెరిగిన మొక్క యొక్క శ్వాస అంటారు దర్పణం అన్న కవితలో అలిశెట్టి ప్రభాకర్‌. ఆశల చుట్టూ అల్లిన ఆశయాల పూల పొదరింటి వాకిలి కవిత్వం. విత్తన కలలు వాస్తవాల నడకలైతే సహజమైన నైసర్గిక ఆవిష్కృతి జరుగుతుంది. పరిణామాన్ని కోరితేనే కవిత్వం జ్ఞానదిశను అన్వేషిస్తూ వెనుదిరుగని ప్రయాణం  చేస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. గాయానికి లేపనంలా, చెదిరిన జీవితానికి పునరావాసపు పెన్నిధిగా కవిత్వం కురిస్తే అజరామరత్వమై శాశ్వత చిరునామాగా అది నిలిచిపోతుంది. నిరంతరంగా స్వేచ్ఛాగీతమయ్యే కవి జనజీవన శబ్ద ప్రవాహ విస్ఫోటనం. అగ్నిశిఖ ప్రజ్వరిల్లినట్టు జాగృతి  హృదయంతో కొత్త విశ్వాసాల్ని నాటి తాజాకృతిగా కాలాన్ని వెలిగించే కవి కారుమబ్బుల్ని ఎదురొడ్డి సాగే రవి. మట్టి నుంచి పుట్టే పచ్చని  చెట్టుకు సప్తవర్ణ సమ్మేళనమై సుగంధంతో తడితనపు ఆర్తిని అద్దుకుని పూచే పువ్వే వికసించిన ఆశ. చిగురుతనానికి చెదరని బంధం వికసించినంత కాలం ఆశే అన్నది నిజం. పురోగమనశీలత కలిగింది మానవానుబంధం. ఎడతెగని ప్రాపంచిక పోరాటంతో మనిషి జీవన పార్శ్వాలలోని ఆకుపచ్చని ఆశలను ఎంతో కవితాత్మకంగా కవయిత్రి పత్తెం వసంత ఆవిష్కరించారు.

ప్రచండ కిరణమై తాకి మదిలో స్ఫురణగా నిలిచిపోయే వాక్యాలు కవయిత్రి వ్యక్తీకరణశక్తికి ఉదాహరణగా నిలిచాయి. అపురూపంగా పెంచుకున్న బిడ్డలు/  కండ్ల ముందే విగత జీవులు అవుతుంటే/  సలసల మరుగుతున్న నెత్తురుతో/  ఎవరిని ప్రశ్నించాలి? /  ఏమని ప్రశ్నించాలి అని నిద్రలేని రాత్రులతో ప్రయాసపడి రాసిన పరీక్షల్లో ఫలితం పొందక బలవన్మరణం పాలైన విద్యార్థుల తల్లిదండ్రులను కడుపుకోతను తలపోస్తూ ఎవరిదీ పాపం అని వేదన చెందారు. సమాజ బాధ్యతను గుర్తుచేసి దేశ భవితవ్యాలైన విద్యార్థి దీపాలను ఆరిపోకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ఓటు విలువ తెలుసుకొని సుపరిపాలనకు ప్రజలే పునాది రాళ్లు కావాలన్నారు. బానిస బతుకు నుండి భద్రతతో కూడిన భవితవ్యాన్ని పొందే  రాజమార్గమే ఓటని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ మహనీయతను కొనియాడారు.

మానేరు నది ఒడ్డున ఆనాటి తమ ఊరిని తలచుకొని బాల్యపు జ్ఞాపకాల చెలిమిని గుర్తు చేసుకున్నారు. వాగులో గచ్చన్నకాయలు ఏరి, తుమ్మకాయలతో కాళ్ళకు గజ్జెలు కట్టి, కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్లలు, దాగుడు ముతలాడినా అప్పటి తమ అపురూప బాల్యం ఈనాటి పిల్లలకు లేదని అంటారు. ఇప్పటి బాల్యం యాంత్రికతతో నలిగి పోతున్నదంటూ తల్లిదండ్రులు, సమాజాన్ని పరిరక్షించే ఆపన్నహస్తాలుగా మారమని కోరారు. ప్రకృతికి పచ్చని చీరకట్టి పరవశింపజేసే ఓ చెట్టమ్మా నీ విలువ వెలకట్టలేమంటూ హరితవనాలతో జగతి విలసిల్లాలని ఆకాంక్షించారు. భావాల క్షేత్రంలో వికసించిన తెలుగే గొప్ప వెలుగు అని భావించి వాత్సల్య అరవిందంగా, సంప్రదాయపు కలికితురాయిగా విశ్వమానవీయ అమృత పరిమళాల చిరునామాగా అభివర్ణించారు. నిజాయితీకి పట్టం కట్టేందుకు ఎన్నికలప్పుడు ఓటరూ జరజాగ్రత్త అంటూ రాజకీయరణ మార్తాండపు హోరులో  పడకుండా విచక్షణతో వ్యవహరించమన్నారు.

పాత రోజుల్లో వండిన పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న పిల్లలకు అందనంత ఎత్తులో దాచి ఉంచేందుకు ఇండ్లలో ఉట్టి కనిపించేది. ఆనాడు అమ్మచేసిన కమ్మని బూరెలు, చద్దన్నం, చాపల  పులుసు, రొయ్యలకూర, ఉలవచారు, చింత చిగురు, బొమ్మిడీలను భద్రంగా దాచిన ఉట్టి ఫ్రిజ్లు పచ్చని ఈ అధునాతన కాలంలో నేటి తరానికి తెలియక ఆనవాలు కోల్పోయిందంటారు. అమ్మ ఆప్యాయతల పిలుపులా ఉట్టి ఊరిస్తూనే ఉందనడం అప్పటితరం వారి జ్ఞాపకాల లోగిలిని స్పర్శించే  అరుదైన మధురిమ. అగ్నిధారలు కురిపించిన దాశరథి, కరీంనగర్‌ సాహిత్య ఖ్యాతికి ఖండాంతరాలకు చాటిన సినారె, ఓరుగల్లు తేజనిధి కాళోజీకి, దివికేగిన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు కవితాకైమోడ్పులు సమర్పించారు.  అలుపెరగని పోరాటం తెలంగాణ ప్రజల స్వప్నాన్ని  సాకారం చేసిందని తల్లుల గర్భశోకాన్ని తలచి, మలిదశల  అమరులకు నివాళులర్పించి,  బతుకమ్మ, బోనాలెత్తిన సబ్బండ ప్రజల పోరాట పటిమను కళ్లకద్దుకున్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఉనికి, ఊపిరి పోరును చారిత్రక పోరాట శిఖరమని తెలంగాణ తల్లికి వందనం చేశారు. అఘాయిత్యాలకు కారణమయ్యే మృగాళ్లు  మానవత్వానికే మాయని మచ్చని సమాజం ఈ దురంతాల పట్ల జాగృతం కావాలన్నారు. బహుభాషా కోవిదుడు పి.వీ, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ల అసమాన కృషికి అక్షర నీరాజమిచ్చారు.

బోనాల యాల్ల తెలంగాణ పల్లెల్లో పండుగ సంబురాన్ని కుటుంబ అనుబంధాలు, సంప్రదాయాల రంగరింపుతో కలగలిపి 33 కోట్ల దేవతల పెద్దమ్మగా పోచమ్మకు దండం పెట్టారు. మానసిక ఒత్తిళ్లు, మనోవేదనల నుండి మనిషి ఆయుష్మాన్‌ భవుడు కావాలన్నారు. స్ఫూర్తిప్రదాతల బాటలో నడవమని చెప్పారు. ఆషాడ జల్లుల ఆత్మీయ పలకరింపుతో మట్టితనపు తన్మయత్వాన్ని విశ్లేషించారు. ప్రజాస్వామ్య రాజ్యంలో సమ్మెపోటుల మనోవేదనను ఆర్ద్రంగా చెప్పారు.  మల్లెపువ్వుల్లాంటి చిన్న పిల్లలకు కంటిరెప్పల్లా కాపాడడంలోనే బాల్యానికి భరోసా అందుతుందన్నారు. అవినీతి భూతం గుట్టలనే మాయం చేస్తుందని హెచ్చరించారు. శ్రావణమాసాన్ని, మృగశిర, రోహిణి, కార్తెల ప్రత్యేకతను జీవిత క్రమంలో తెలిపారు. అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని చెప్పి దైవత్వ ప్రతిబింబంగా చూపారు. కరోనా మరణమృదంగానికి వేదనపడి మనిషి ఆత్మబలంతో, జాగ్రత్తతో ఉండాలన్నారు. ఇంట్లోని ఇసుర్రాయితో జీవనానుబంధాన్ని  గుర్తు చేశారు. బోసిపోయిన పల్లె వేదనను అక్షరబద్ధం చేసి ఆలోచనలకు తెరతీశారు.

కన్నయ్య, బొజ్జ గణపయ్యలను, గోదావరినదిని, సముద్రుడినీ  ప్రస్తుతించారు. జలసంరక్షణతో జీవితం దీపావళిలా సచిత్రమాలికలా వెలుగొందుతుందని విశ్వసించారు. ధీరతనే ప్రేరణంగా భావించి కురిసిన చినుకు తాకిడికి జీవమై తలెత్తిన విత్తనం ఆకుపచ్చని ఆశగా విప్పారి ఆటుపోట్లను అజేయంగా ఎదుర్కొని సజీవతకు సాక్షీభూతమవుతుందన్న బలమైన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. విస్తృత జ్ఞాన సమారాధనల తీరైన మార్గంగా కవిత్వం ఉండాలన్నది విజ్ఞుల భావన. విభిన్న పార్శ్వాలుగా జీవన సందర్భాల లోతుల్ని తడిమిన ఈ కవిత్వం ఆ దిశగా జరిగిన ఆలోచనాశీలతల ప్రయత్నం. స్పష్టమైన, సహజమైన స్థాయిలో ఇది మానవానుభూతులకు కవిత్వరూపంలో ఇచ్చిన పరిణతతో కూడిన ప్రతి స్పందన, సత్యస్పర్శతో  సమకాలీనతల ప్రతిబింబంగా కవయిత్రి  కవిత్వ సృజన పురోగామిగా మున్ముందుకు సాగాలి.
 -డా.తిరునగరి శ్రీనివాస్‌
  8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *