కేబినెట్ కీలక నిర్ణయాలపై సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని, ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో తాము ముందుకు వెళ్తున్నామని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామని, సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని రూపొందిస్తామని, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా రూపొందిస్తామన్నారు.
ఇక వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉంటాయని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుంది. ఉద్యమకారులు, మేధావులు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆదివారం కేబినెట్ సమావేశంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ‘జయ జయహే తెలంగాణ‘ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం..అలాగే వాహన రిజిస్ట్రేన్లలో ఇక నుంచి టీఎస్ బదులు టీజీగా మారుస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.




