బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
ఆ ముక్కలను అవతల పారవేయగా జన అనే రాక్షసి ఆ రెండు ముక్కలనూ కలవగా జరాసంధుడయ్యాడు. ఆ రాక్షసి బృహద్రదుని గురించి తెల్సుకున్నదై ఆ బిడ్డను తెచ్చి అయనకే ఇచ్చింది. జరాసంధుడు పెరిగి పెద్దవాడుకాగానే రాజ్యాభిషిక్తుని గావించాడు. బృహద్రదుడు వానప్రస్థ స్వీకరించాడు. హంస, డిభకులనేవారు రాజుకి మంత్రులుగా వుండేవారు. వారు జరాసంధుడంతటి బలవంతులు. హంసుడు అనే రాజు ఒకసారి యుద్ధంలో మరణించగా, ఆ వార్త విన్న డిభకుడు ప్రాణత్యాగం గావించాడు. డిభకుని మరణవార్త అస్సలైన హంసుడు కూడా యమపురికి చేరాడు. కృష్ణ పరమాత్మ ఇలా జరాసందుని గూర్చి తెలియజేసి ఆ తర్వాత అర్జునుడి పరాక్రమ కౌశలమూ, భీముని భుజబలమూ, తన ధీశక్తి ద్వారా జరాసంధుని కడ తేర్చగలమన్నాడు. వాసుదేవుడూ, భీముడూ, అర్జునుడూ మగధకు బయలుదేరారు.
కృష్ణార్జునభీములు ముగ్గురూ మగధ రాజధాని చేరారు. నగరం ఎంతో సుందరంగా ఉంది. సరోవరాలు, ఉద్యానవనాలు, సౌధాలూ, పర్వత శిఖరాలూ చూడముచ్చటగా ఉన్నాయి. అందరూ సంతోషించారు. ఆ వాతావరణానికి ఆ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు బృహద్రదుడు వృషభుడనే రాక్షసుని సంహరించి వాని చర్మంతో మూడు భేరీలు నిర్మించాడు. శత్రువులెవ్వరైనా తమ నగరంలో కాలుమోపితే, భేరీలు వాటంతటవే భయానకంగా మ్రోగుతాయి. అప్పుడు పూలవాన కూడా పడుతుంది. అంటూ కృష్ణుడు వారివురికీ తెలియజేశాడు. ఆ భేరీలను బద్దలు కొట్టించాడు. అందరూ విప్రవేషధారులయ్యారు.
పూలమాలలు ధరించి, జరాసంధుని యజ్ఞశాలకు బయలు దేరారు. జరాసంధుడు అతిధి పూజగావించాడు. వారందరికీ అభివాదం గావించాడు. కృష్ణుడు జరా సంధునితో ఇలా అన్నాడు. మహారాజా వీరు నేటి అర్ధరాత్రి వరకూ మౌనవ్రతంలో ఉంటారు. ఆ తరువాతగానీ నీతో మాట్లాడరు. జరాసంధుడు ఆ విధంగానే అర్ధరాత్రి సమయంలో వచ్చి వారిని కలిసాడు. వారు ఆ సమయంలో మంచి గంధం పూసుకుని పూల మాలలు ధరించివున్నారు. స్నాతక వ్రతధీక్షలో ఉన్న వారు ఈ విధంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నాడు. జరాసంధుడు అంతేకాదు, వారి భుజాల మీద ధనుర్బాణాలు ధరించి చిహ్నాలు కూడా ఉన్నాయని చెప్పి, ఆపైన మీరెవరో నిజం చెప్పండి అంటూ నిలదీశాడు.




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల