చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

  • ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌
  • ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం

అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం పై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ ఇష్ట దైవాన్ని మనసారా దర్శించుకున్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రెండురోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అంతకుముందు అలిపిరిలో ఎలక్ట్రిక్‌ ‌బస్సులను ముఖ్యమంత్రి జగన్‌ ‌ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరిన తిరుమల చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పట్టు వస్త్రంతో సీఎం జగన్‌ ‌తలకు పరికట్టం కట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవ ప్రారంభమైంది.

ఈ సేవలో సీఎం జగన్‌ ‌పాల్గొన్నారు. ఉదయం ప్రాతః కాల సమయంలో శ్రీవారిని ముఖ్య మంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్య మంత్రికి వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసా దాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం నూతనంగా నిర్మితమైన పరకామణి భవనాన్ని, లక్ష్మి వీపీఆర్‌ ‌రెస్ట్ ‌హౌస్‌ ‌ను ప్రారంభించారు.మంగళవారం రాత్రికి తిరుమలలోనే బస చేసిన సీఎం జగన్‌.. ‌బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పెదశేష వాహన సేవ, బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *