కారు మళ్లీ స్పీడ్‌ అందుకునేనా..!

  • ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా?
  • పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా?

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 12 నుండి 14 స్థానాలను గెలుచుకుని తీరుతామంటుంది. కాగా బిఆర్‌ఎస్‌, బిజెపిలు కూడా అత్యధిక స్థానాలను గెలచుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నాయి. గత దశాబ్ధ కాలంగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ అనేక తప్పిదాల వల్ల శాసన సభ ఎన్నికల్లో పరాజయం పొందింది. దానికి తగినట్లుగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ముగ్గురు ఎంఎల్‌ఏలతో పాటు, సుమారు అయిదుగురు సిట్టింగ్‌ ఎంపీలు నిర్దాక్షిణ్యంగా పార్టీని వదిలి వెళ్ళారు. పార్లమెంటు ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఎంఎల్‌ఏలు తమ గూటికి చేరే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ బాహాటంగాచే చెబుతున్నది. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ పార్టీకి ఎంఎల్‌ఏలను కాపాడుకోవడం ఒకటి కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును పార్లమెంటు ఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్న తపనలో ఇప్పుడా పార్టీ ఉంది. అందుకు స్వయంగా పార్టీ అధినేత కెసిఆర్‌ రంగంలోకి దిగారు.

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలన్నట్లు, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సాధక బాధకాలను అర్థం చేసుకునే కార్యక్రమాన్ని ఆయన చేపట్టబోతున్నారు. అందుకు ఈ నెల 13 నుండి రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన చుట్టబెట్టబోతున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఆయన పొలంబాట పట్టారు. సాగునీరు లోటుతో చేతికి వొచ్చిన పంట ఎండిపోవడాన్ని క్షేత్రస్థాయిలో దర్శించి, అందుకు అధికార కాంగ్రెస్‌పైన ఇప్పటికే విరుచుకు పడుతున్నారు. ఈ మేరకు కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని రైతులను ఓదార్చడంతో పాటు, వారికి సరైన నష్టపరిహారం అందించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఈ నెల 13న చేవెళ్ళలో నిర్వహించే బహిరంగ సభ నుండి ఆయన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్‌ (బిఆర్‌ఎస్‌) 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను మూటకట్టుకుంది. ఇక తమకు తిరుగులేదనుకున్న బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.

ప్రస్తుతం జరుగనున్న 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు అనేక రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. అందుకు అనుగుణంగా తమ పార్టీపేరును కూడా మార్చుకున్నారు. 2001 ఏప్రిల్‌ 27న నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, అప్పటి నుండి రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో వరుస విజయాలను సాధిస్తూ వొచ్చింది. ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారో 2022 అక్టోబర్‌ 5న టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌(భారత రాష్ట్ర సమితి)గా మార్చారు. ముహూర్తాలు, వాస్తు దోషాలన్నీ చూసుకునే కెసిఆర్‌కు బిఆర్‌ఎస్‌ ఏమాత్రం అచ్చి రాకుండాపోయింది. పేరు మార్పు జరిగిన మొదట్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఇక కారు దూసుకుపోతుందనుకున్నారు.

కాని, అక్కడి నుండి అన్నీ అటంకాలే ఎదురవుతూ వొచ్చాయి. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వొచ్చింది. గతంలో 103 స్థానాతో కొనసాగిన పార్టీ ఈ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైంది. అందులోనూ రెండు మూడు స్థానాలు ఇప్పటికే చెయ్యిజారిపోగా, పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగిలేదెందరన్న అనుమానాలు లేకపోలేదు. కాగా పార్లమెంటు ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్‌ ఇక తెర మరుగే నంటున్నాయి రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలనుకున్న బిఆర్‌ఎస్‌కు ఇప్పుడు స్వరాష్ట్రంలో ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికకు ముందే పోటీచేయనని ఒకరు, అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత పార్టీమారిన వారొకరు,  కేసుల్లో ఇరుక్కుంటున్న పోటీ అభ్యర్థులతో ఆ పార్టీ సతమతమవుతున్నది. ఎలాంటి పరిస్థితిలో అగమాగం కావద్దని కార్యకర్తలకు, నాయకులకు తరుచు హితబోధ చేసే కెసిఆర్‌ కూడా ఒకింత చకితుడై పోతున్నాడు. ఏం అన్యాయం చేసానని పార్టీ వీడిపోతున్నారంటూ ప్రశ్నిస్తున్న కెసిఆర్‌ ఇప్పుడు రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇంకా  తెలంగాణ ప్రజలు తన వెంటే ఉన్నారని రుజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అపర చాణిక్యుడిగా పేరుతెచ్చుకున్న కెసిఆర్‌ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడతో నెట్టుకోస్తారా అన్నది ఆసక్తిగా ప్రజలున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా మారిన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవటం, కూతురు, ఎంఎల్సీ కవిత లిక్కరు కేసు ఇంకా వెన్నాడుతుండగా ఇప్పుడు కొత్తగా ఫోన్‌ ట్యాపింగ్‌ ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్టు కావడంతో దాల్‌ మే కుచ్‌ కాలాహై అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే  మెదక్‌ పార్లమెంటు అభ్యర్థిగా రంగంలో ఉన్న పి. వెంకట్‌రామరెడ్డి ప్రచార సభల్లో పాల్గొన్నారంటూ  తాజాగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌ బిఆర్‌ఎస్‌కు మరో శిరోబారంగా తయారైంది. డిఆర్‌డిఏ పరిధిలోని ఎస్పీఆర్పీకి చెందిన 38 మందిని, ఇజిసీకి చెందిన 68 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఎలక్షన్‌ అధికారి కూడా అయిన ఎం. మనుచౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పరిస్థితిలో కారు మునుపటి స్పీడ్‌తో ముందుకెళ్ళుతుందా లేక ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తున్నట్లు కారు ఇక షెడ్‌కే పరిమితమవుతుందా అన్నది ఈ ఎన్నికలే సమాధానం చెప్పబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *