కెసిఆర్ తలచకుంటే కాంగ్రెస్ నేతలు జైళ్లో ఉండేవారు
ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండే వారని చెప్పారు. కాంగ్రెస్ అన్నిటికీ వంద రోజుల డెడ్ లైన్ పెడుతోందని ఎద్దేవా చేశారు. వందరోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌పై చీటింగ్ కేసులు పెడతారన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకోటి ఒరిజినల్ కాంగ్రెస్ అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని అన్నారు. కొన్ని స్థానాలను వివిధ కారణాలతో కోల్పోయామని అన్నారు. ఆ కారణాలు తెలుసుకుని, సవిూక్షించుకుని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటింది. వచ్చిన తెల్లారినించే హావిూలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు కాలయాపన చేస్తున్నది. ఎన్నికల ముందు కంటే భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరించడంపట్ల ప్రజల్లో అసహనం మొదలైందని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. గత చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండవని అన్నారు. గత నెల రోజుల పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తూ బీఆర్ఎస్ పోరాడుతుందని, ఆ దశగా అందరం కార్యోన్ముఖులం కావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.