ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి…
మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి
అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా
కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు
సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే
మహబూబాబాద్ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ
మహబూబాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పాపూలేనని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి.పాలనకు కాలం చెల్లబోతుందని, తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కంద్రంలోని తాళ్లపూసపల్లి రోడ్లో ఏర్పాటు చేసిన బిజెపి ప్రజా విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడుతూ…బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అంధ విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ అని, అంధ విశ్వాసాలను నమ్మి..సచివాలయాన్ని కూల్చారని ఆరోపించారు. కేసీఆర్ తన మూఢ నమ్మకాలతో ప్రజాధనం వృథా చేశారని, మూఢ నమ్మకాలకు బానిస అయిన ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణలో ఇర్రిగేషన్ ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూమ్‌లు లిక్కర్ స్కామ్‌లు, ఉద్యోగాల స్కాములు జరిగాయని, వాటిని పూర్తి స్థాయిలో ద్యర్యాప్తు చేసి దొంగలను జైలుకు పంపిస్తామని అన్నారు. దేశంలో వనవాసీలని, ఆదివాసీలని, గిరిజనులను ఆదుకున్న ప్రభుత్వం బాజపాదేనని, వారి శౌర్య పరాక్రమాలకు గుర్తుగా అన్ని రాష్ట్రాల్లో వారికి మ్యూజియం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
తెలంగాణాలో హైదరాబాద్ కేంద్రంగా గిరిజనులకు పరాక్రమ వంతులైన కొమురం భీమ్ రాంజీ గోండుల మ్యూజియంలు త్వరలో ప్రారంభించుకుంటున్నామని అన్నారు. తెలంగాణాలో రైతులకు ఫసల్ బీమా సమ్మాన్ ద్వారా 30 వేల రూపాయలను అందించామని, యూరియా, రైతులకు కావల్సిన ఇతర పనిముట్లపై సబ్సిడీలు ఇస్తున్నామని, యురియాపై ప్రత్యేకంగా 300 రూపాయలు తగ్గించమని అన్నారు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని..కాంగ్రెస్ లాగా అమలు కాని గ్యారెంటీలు కావని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్లు నాశనం చేశాయని ఆరోపించారు. బీజేపీ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని మోదీ తెలిపారు.
గతంలో కేసీఆర్ దిల్లీకి వొచ్చి భారతీయ జనతా పార్టీతో కలుస్తామని అడిగారని చెప్పారు. తన వారసుడిని సీఎంగా చేస్తే..తమ పార్టీతో కలుస్తామని కేసీఆర్ అడిగారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీజేపీని తిట్టడం మొదలు పెట్టారని తెలిపారు. మాదిగల వర్గీకరణ బిల్లు తమ దృష్టిలో ఉందని, కమిటీ వేశామని, కమిటీ నివేదిక రాగానే వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. వొచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డోర్నకల్ బాజాపా అభ్యర్థులు జాటోత్ హుస్సేన్ నాయక్, భూక్యా సంగీత, రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్ రావు, మార్తినేని ధర్మ రావు, ఎడ్ల అశోక రెడ్డి, రామచంద్రుడు, రిటైర్డ్ ఐఏఎస్, జిల్లా అధ్యక్షులు రాంచందర్ రావు, వివిధ సంస్థల ప్రతినిధులు, జిల్లా నాయకులూ, మండల నాయకులూ పాల్గొన్నరు.


