అంతరంగ సంవేదనే కవిత్వానికి జీవం. కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా కవికి మరోజన్మ ఎత్తినట్టుంటుందని ప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్ర అన్నారు. కవిత్వం కవిలో ఎప్పటికీ తరగని అసిధారా ప్రవాహమంటూ జన్మించడమే కవిత్వం అన్న కవితలో ఆమె రాశారు. సరిగ్గా అదే పేరుతో 61 కవితలతో ఆమె కవితా సంపుటి వెలువడిరది. నేనేం రాయలేనని అనుకుంటే/ అలా అనుకోవడం నుండే నాలో కవిత్వం మొదలు అన్న ఆమె వాక్యాలు అశక్తత కవిత్వంలో దాగి ఉండదన్న సత్యాన్ని స్పష్టం చేశాయి. కవిత్వ కాంతులతో అలంకరించుకుంటాను అన్న మరొక వాక్యం ఆవహించి చీకటిని కూడా తరమేస్తుందన్న ధీమాను ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లా సాగుతూ ఎంతో శ్రద్ధాసక్తిని కలిగించే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
ఒక గుప్పెటలో సూర్యుడు/ ఒక గుప్పెటలో నక్షత్రాలు నింపుకుని కవి గుండెలో అనుభూతినవుతానని నా ప్రయాణం చందమామకై అన్న కవితలో అన్నారు. భావ విహంగమై గగన తలాన్ని చుట్టి, తుపానులా మారి దిక్కులన్నింటినీ కడిగి శుభ్రం చేసి అంతిమ పోరాటంలో అక్షరమై నిలిచిపోతానని చెప్పారు. తాను బిడ్డకు అమ్మ అయిన తరువాత చిన్నప్పుడు తనకు జన్మనిచ్చి జీవితంలోకి నడిపించిన అమ్మను తలుచుకుంటూ ఆ అపురూప అనుభవాలను అమ్మకు నాకు పెద్ద తేడా లేదు అన్న కవిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది. ఎన్నో ఉదయాలు, ఇంకెన్నో సాయంత్రాలు, మరెన్నో ఒంటరి సంధ్యల మధ్య కన్నీటితో తడిసిన తలగడని గమనించమంటూ జీవన వేదనను గూర్చి ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతున్నావు అన్న కవిత చెప్పింది.
ఎవరున్నా లేకున్నా తనను కాదని వెళ్ళిపోనిది జ్ఞాపకాల పిట్ట అని అన్నారు. ఎంత కాదనుకున్నా/ అల్లుకున్న అనుబంధాల బూటకాలను నమ్మి/ వదలలేక మళ్ళీ మరో పిలుపుకు లొంగి పోతుంటాం అని గుండెలోని బాధాగ్నిని కుమ్మరించారు. ఎంత కొత్త యుద్ధమైనా బతుకు యుద్ధం ముందు దిగదుడుపేనని చెప్పారు. అనుకున్న మంచిని అందరికీ పంచి/ బరువెక్కిన హృదయాన్ని మాత్రం/ ఆకాశంలో చిత్రపటంలా వేల్లాడదీస్తుంది అని నల్లరంగు శిశువు కవితలో తల్లి ఆవేదనను అక్షరీకరించారు. కంచిపట్టు కన్నీళ్లులో మనిషికి చివరకు మిగిలే క్రీనీడల్ని కన్నీటి దృశ్యాల్ని వెల్లడిరచారు.
నల్లధనపు పద్మవ్యూహంలో శవానికి కూడా మినహాయింపు లేదని మరణం మాఫియా కవితలో వివరించారు. జీవించినప్పుడే కాదు మరణం తరువాత కూడా శవానికి జీవన్మరణం తప్పడం లేదని ఆలోచింపజేస్తారు. ఇప్పుడు వేల్లాడేవన్నీ శరీరాన్ని కోల్పోయిన ప్రాణాలే అని ప్రకృతి, మనసు పాతవే అయినా వచ్చి పడి చిచ్చురేపిన మార్పు ముందు కొత్తగా ఒరిగేదేమీ ఉండదన్నారు. భిక్షమెత్తేలా దిగజారిన విలువల ప్రపంచంలో సుభిక్షానికి చోటెక్కడిదని సూటిగా ప్రశ్నించారు. మనిషి చుట్టూ కృత్రిమంగా అల్లిన మాయాజాలమే వర్తమాన జీవితం అని తెలిపారు. మనిషి ఉనికి కేవలం శరీరం అన్నట్టుగానే ఇప్పటి సమాజంలో స్థిరపడిపోయిందని చెప్పారు. సీతాకోకచిలుకంటే రంగులే కాదు/ లోకం తీరు అన్న వాస్తవాన్ని గమనించమన్నారు.
కాలగమనానికి మనిషిని స్వీకరించే ఆప్తగుణం ఉందని తెలిపారు. రాత్రి – నిద్ర కవితలో తెల్లావారితే వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ వస్తుందని తెలిసినా భూమి ఎందుకో ప్రాచీన ప్రేయసిలా ఎక్కివెక్కి ఏడుస్తుందని చెప్పారు. గడిచిన, రాబోయే రోజులన్నీ ఒంటరివే బహుశా రెండూ ఒకే జీవితానికి రెండు చివర్లు కావొచ్చునన్న భావన లోతుగా ఆలోచింపజేస్తుంది. రెండు స్థితుల మధ్య ఏమీలేని తనాన్ని ఎన్నిసార్లు తలచుకోవాలంటూ ఒకానొక సంవేదనను ఆర్తితో వినిపించారు. కళ్ళు తెరిసే కరుడుకట్టిన కాటుక మచ్చలు/ కళ్ళు మూస్తే వట్టిపోయిన అన్యాయపు ఆనవాళ్ళు అని వేదన చెందారు. అనుబంధాలన్నీ బలికాక తప్పని అవస్థల వ్యవస్థలో బతుకుతున్నామన్నారు. దేహం మరణించినా ప్రాణం మేల్కొనే ఉంటుందని చెప్పారు. ఉండటం, లేకపోవడమే జీవితంగా మారి బతుకు ఊహించని విధంగా భారమవుతున్నదన్నారు. వివేకం, విచక్షణ, సంఘర్షణలు తెలిసిన నేస్తమే అన్నీ మరచి నిర్దయగా విడిచి వెళ్ళిపోతే మిగిలే అర్థమేమిటని ఎంతగానో వాపోయారు.
సమాజంలో నాలుగు గోడల మధ్య అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉందని చెప్పారు. అనుభవాలపై నడిచి అనుభూతులను అద్దుకున్న పాదముద్రనే నడక అన్నారు. లోతైన గాయాలతో సాగే మరోజీవితాన్ని గూర్చి విపులీకరించారు. మాది నిప్పుల నడక/ మనసు వేళ్ళు మాత్రం మండుతున్న లోతైన గాయం అనడంలో వేదనానుభూతి వ్యక్తావ్యక్తమైంది. బతుకుల్ని ఈడ్చుకుని వెళుతున్న కాలం/ చిరునవ్వుల నగలు వేసుకుందని చెప్పిన ఇక్కడ అన్న కవిత జీవితపు లోతుల్ని తడిమింది. ఒంటరి తీరాల గుసగుసలకు / ఊపిరాడని సుదీర్ఘమైన అంచనాలకు పెద్ద తేడాలేదన్నారు.
నీలోని నిట్టూర్పును విడిచిపెడితే దేశం తప్పక ఉనికితో జీవిస్తుందని చెప్పారు. నేనెవరు, ఒకానొక మెలకువ, మరోసారి కలవలేనంతగా, నీవే విశ్వశాంతివి, పెద్దగా గుర్తించలేదు, ఇనుప చెట్టు, బంధం, నేను నేను కాకుండా పోను, ఒక ఆహ్లాదం – మరో ఆర్తనాదం, ఒకరికోసం మరొకరు, ఆశయ గీతం, కాలానికో లేఖ, తడి సంచీలు, తూరుపు త్యాగం, అనైక గీత, జీవితానికేం తెలుసు వంటి కవితలు విశాల విశ్వ దృక్పథంతో, సామాజిక చేతనతో, ప్రగతిశీల మానవతా వాద స్పర్శతో సాగాయి. తనలోని అనంతత్వాన్ని కవిత్వకాంతులతో అలంకరించుకొని అక్షర జ్యోతిగా నిత్యం వెలుగొందుతానన్నారు.
ఏముందక్కడ/ ఏమీలేని తనం/ ఏమీ తెలియని తనం తప్ప అని రుజాగ్రస్త వ్యవస్థను విశ్లేషించారు. ప్రపంచంలో ఏ చరిత్రను తవ్వినా/ అస్తిపంజరాలే కనిపిస్తాయిప్పుడు అన్నవాక్యాలు వాస్తవికతకు దర్పణం పట్టాయి. జీవాలు కదులుతున్నాయే తప్ప/ జీవితంలో చలనం ఉండదని స్పష్టం చేశారు. కన్నీటి వర్షాలను తోసేసి జీవన సంరంభాన్ని కవిత్వంతో అలంకరిస్తుంటానని చెప్పారు. తెలియని తనం, నిష్కల్మశత్వంతో కలగలిసిందే బాల్యపు నిశ్చింత నిద్ర అని అభివర్ణించారు. పోరాటమంటే ఆక్రమించుకోవడం కాదని, మహానీయుల అడుగు జాడల్ని అందుకొని ఆ దిశగా నడవడమని చెప్పారు.
స్మశాన శూన్యమే మనిషికి చివరగా దక్కుతుందన్న వాస్తవాన్ని గ్రహించమంటూ బతికున్నప్పుడే జీవితాన్ని సస్నేహ సార్థకంగా జీవించమన్నారు. కవి మరణించాడు కవితలో కవి ఈ లోకం నుండి వెళ్లిపోయాక అంత కృషి చేసి సాహిత్యాన్ని సంపదగా ఇచ్చాక కూడా ఇంకా ఆయన ఎందుకు గొప్పవాడో ఎవరికీ అర్థం కాని విషయమే అయ్యిందని వేదన చెందారు. ఎన్నో రచనలలోని కవి రచనా వైభవం మరణించాక ఎవరికీ ఇసుమంతైనా పట్టలేదని అన్నారు. కవి శరీరానికి / ఆరడుగుల జాగా దొరికింది గాని/ అతని కీర్తి కాయానికి మాత్రం / ఒక్క గది కూడా మిగల్లేదు అని కన్నీటి పర్యంతమవుతూ నివాళులర్పించారు.
ఎవరేమైపోతేనేం అన్నంత పట్టనితనంలో ప్రజా జీవితం చిక్కుకుపోయిందన్న ఘాటు విమర్శతో నీ ముఖ చిత్రం ఈ దేశానిది కాదు అన్న కవిత సాగింది. మాటలకు మించిన కవిత్వం, అనుభవానికి మించిన భావం ఎక్కడుంటుందని చెప్పారు. దేహవైకల్యాన్ని జయించి ధైర్యంగా బతుకు పోరాటం చేసే దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని ఎంతో గొప్పగా కవిత్వీకరించారు. అంతులేని అనంత జీవన పోరాటంలో మనిషికి ఆశావాహ దృక్పథాన్ని అందించి మానవతను, మనిషితనాన్ని అజేయంగా నిలపాలన్న ఆరాటాన్ని నిండారా నింపుకున్న కవితలివి.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే