పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాకారం
దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 2: సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సిద్ధిపేట జిల్లాకు సంబంధించి తెలంగాణ స్వరాష్ట్ర సాధన అనంతరం జరిగిన అభివృద్ధిని మంత్రి వివరించారు. సమైక్యపాలనలో తెలంగాణలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయనీ ఈ ప్రాంత కవులు పాటల రూపంలో కళ్లకు కట్టి చూపించారనీ, కనీస సౌకర్యాలకు దూరంగా సమస్యలకు చిరునామాలుఆ ఆనాడు పల్లెలు దుర్భర పరిస్థితుల్లో ఉండేవనీ, స్వరాష్ట్రం సిద్దించిన వెంటనే పల్లెలకు పట్టిన దరిద్య్రాన్ని వదిలించేలా సిఎం కేసీఆర్ పల్లెప్రగతికి శ్రీకారం చుట్టారనీ, ఫలితంగా కన్నీళ్లు పెట్టిన పల్లెలన్నీ నేడు కళకళలాడుతున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవనీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. అలాగే, చెరువులన్నీ ఎండిపోయి ఉండేవనీ, ఇప్పుడు మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులన్నీ నిండుగా ఉన్నాయనీ, రైతులకు, కులవృత్తులకు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అండగా ఉందన్నారు. పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే తెలంగాణలో నూరేళ్ల అభివృద్ధి సాకారమైందన్నారు. జిల్లాలలోని 499గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే సిద్ధిపేట జిల్లా ఆవిర్భవిస్తుందని సిఎం కేసీఆర్ పదేపదే ప్రస్తావించినట్లుగానే నాలుగు దశబ్దాల కలను సాకారం చేస్తూ సిద్ధిపేటను జిల్లాగా చేసి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారన్నారు.
అన్నం మెతుకులు పండించే అన్నదాతల ఆత్మహత్యలతో తల్లడిల్లిన నేల ఇది అని, కానీ, ఇదే తెలంగాణ నేడు సగం దేశానికి అన్నం పెడుతుందన్నారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని ప్రతిరైతూ కళ్లలో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే కావడం గర్వకారణమని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాలేశ్వరంతో గోదావరి జలాలను సిద్ధిపేట జిల్లాలోని గ్రామగ్రామాన పారించుకోవడం జరుగుతుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఒక్క పంటకు కూడా అనువుగా లేని భూముల్లో రెండు పంటలు పండిస్తున్న పరిస్థితి నేడు సిద్ధిపేట జిల్లాలో సాధ్యమైందన్నారు. కనీవినీ ఎరగని రీతిలో రంగనాయకసాగర్, శ్రీ కొమురవెళ్లి మల్లన్నసార్, కొండపోచమ్మసాగర్, గౌరవెళ్లి రిజర్వాయర్లను అధ్భుతంగా నిర్మించుకున్నామనీ, ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. ఒకప్పుడు తాగునీటి కోసం ప్రజలు ఎన్నో తంటాలు పడేవారనీ, ఒకమాటలో చెప్పాలంటే తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవనీ, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. ఎండిపోయిన చెరువులు కూడా నిండు కుండలా మారాయన్నారు.
సమైక్యపాలనలో కులవృత్తులు, రైతులు నిరాదరణకై గురైయ్యారనీ, కానీ, నేడు కులవృత్తులను, రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంలోనూ దూరదృష్టితో ఆలోచించడం జరిగిందన్నారు. జిల్లాలో 665కోట్ల రూపాయలతో 20భారీ పరిశ్రమలు, 92కోట్లతో 13మధ్య తరహా పరిశ్రమలు, 259కోట్ల రూపాయలతో 631చిన్న తరహా, కుటీర పరిశ్రమలను స్థాపించి 23వేల మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. సిద్ధిపేటలోని పారిశ్రామికవాడలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టి 400మంది మెకానిక్‌లకు స్థలాలను ఇస్తున్నట్లు తెలిపారు. 52కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటి టవర్‌ను త్వరలోనే ప్రారంభించుకుని సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాడు పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వాలు నామ మాత్రంగా సాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితి అని, కానీ, నేడు పేదోళ్ల సొంతింటి కలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపిస్తుందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 802కోట్ల రూపాయల వ్యయంతో 15వేల 929ఇండ్లు మంజూరు కాగా 10వేల 122 ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు అందించడం జరిగిందనీ, త్వరలోనే గృహాలక్ష్మీ పథకం ద్వారా సొంతింటి నిర్మాణానికి 3లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరపున నిరుపేదలకు అందించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. పల్లెల మాదిరిగానే జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పట్టణాలను సమగ్ర ప్రగతి కార్యక్రమంతో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతోందన్నారు. పేద ప్రజల కన్నీరు తూడువని ఆర్థిక ప్రగతి అస్థిరమైందనీ, అనైతికమైందని భావించి సిఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్హులైన వారందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాడు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా జిల్లాలో 9కోట్ల 66లక్షల రూపాయల వ్యయంతో 3కోట్ల 22)క్షల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రజల జీవనప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే సిద్ధిపేట ప్రజలకు మూడు ప్రధానమైన కోరికలను నెరవేర్చడం జరిగిందనీ…మొదటి కోరిక సిద్ధిపేట జిల్లా ఏర్పాటు..రెండవ ఆకాంక్ష కాలేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు.
మూడవది రైలు రాక. ఇప్పటికే సిద్ధిపేట రైల్వేస్టేషన్ వరకు ట్రాక్ నిర్మాణం పూర్తి కావచ్చిందనీ, వచ్చే ఆగస్టు నెలాఖరు వరకు సిద్ధిపేటకు రైలు వస్తుందన్నారు. శాంతిభద్రతలకు భరోసాగా పోలీస్ శాఖను పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదాక్షరాలను సాకారం చేసుకోవడమే కాకుండా ప్రగతి మార్గాన తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడుతుందనీ, తెలంగాణ మోడల్ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతుందన్నారు. ప్రజల ఆశీస్సులుంటే ఎన్ని అవరోధాలైనా అధిగమించగలమని సిఎం కేసీఆర్ గడిచిన తొమ్మిదేళ్లలోనే అద్భుతదీపంగా మారుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులను విరజిమ్మేలా చేశారన్నారు. దశాబ్ది కాలంలోనే శతాబ్దపు కీర్తిప్రతిష్టలను సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. అదే మార్గంలోనే సిద్ధిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు సిద్ధిస్తున్నాయనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ వేడుకల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


