ఓరుగల్లుకు మహర్దశ

  • ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం
  • ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించడమే ఉద్దేశ్యం
  • వరంగల్‌లో రూ 280.85  కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క

వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగింటిని  ప్రభుత్వం అమలుచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తుఏన్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు సోమవారం ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేలా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వరంగల్‌లో ఒక్కరోజే రూ.280.85 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం  రాష్ట్ర  రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలతో కలసి కీలకమైన ప్రారంభత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌ లోని ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు రూ 4.10 కోట్లతో  పుప్పాలగుట్టలో నిర్మించిన 1500 కిలో లీటర్ల ఎలివేటెడ్‌ లెవెల్‌ సర్ఫేస్‌ రిజర్వాయర్‌ (ఈఎల్‌ఎస్‌ఆర్‌) ను, రూ 20 లక్షలతో  ఫాతిమా నగర్‌ జంక్షన్‌ను ప్రారంభించారు. అదే విధంగా రూ. 272.12 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అందులో రూ. 2 కోట్లతో కాజీపేట, క్యుసి ఆఫీస్‌ (జిడబ్ల్యుఎంసి), వడ్డేపల్లి, వెంకట్రామా, నాయుడు పెట్రోల్‌ పంప్‌, టిటిడి జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు, రూ 2 కోట్లతో బాలసముద్రం చిల్డ్రన్‌ పార్కు అభివృద్ధి పనులకు, 15 లక్షలతో ఎంజిఎం పీడియాట్రిక్‌ బ్లాక్‌లో పిల్లలకు ఆట పరికరాల ఏర్పాటుకు, రూ 2 కోట్లతో ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌, సికెఎం డివైడర్‌, బాలాజీ నగర్‌ జంక్షన్ల పరిధిలోని పలు జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులకు, రూ. 3.50 కోట్ల వ్యయంతో గోవిందరాజుల గుట్ట వద్ద ఎలివేటెడ్‌ లెవెల్‌ సర్ఫేస్‌ రిజర్వాయర్‌ (ఈఎల్‌ఎస్‌ఆర్‌) నిర్మాణ పనులకు, రూ. 250 కోట్లతో జిడబ్ల్యుఎంసి పరిధిలో  వరద నీటి ముంపు నివారణకు అభివృద్ధి పనులకు, రూ 50 లక్షలతో వరంగల్‌ తూర్ఫు నియోజకవర్గం శివనగర్‌ లోని 34వ డివిజన్‌ లోని మెట్ల బావి అభివృద్ధి కు, రూ 10 కోట్లతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, అవెన్యూ ప్లాంటేషన్‌ పనులకు, రూ 6.60 కోట్లతో నర్సంపేట,  ఖమ్మం రోడ్డులో, కరీంనగర్‌,  ములుగు భారీ ముఖ ద్వారాల నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పేదవారికి లబ్ధి చేకూర్చేలా పథకాలను అందించలేదని ఇందిరమ్మ రాజ్యం వొచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, చెప్పిందే తడవుగా మన ప్రభుత్వం 72 రోజుల్లో 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.

 

టిఎస్పిఎస్సీని ప్రక్షాళన చేసి నిబద్ధతగల సిబ్బందిని నియమించి యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్లు ఇచ్చామని మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వొచ్చిన 75 రోజుల్లోనే సుమారు 11,600 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల ఇంటి వద్దకే వొచ్చి వారికేమి కావాలో తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుని ప్రజల ముందు మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నేడు లక్ష వృక్షార్చన కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో రోడ్ల  వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ సంవత్సరం ఒక లక్ష మొక్కలు  నగర రహదారుల వెంట నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వొచ్చే మూడేళ్లలో  వరంగల్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వరంగల్‌ ప్రజలు కూడా భాగస్వాములై కాలనీలలో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ నగరంలోని అన్ని లేఅవుట్‌ ఖాళీ ప్రదేశాలను అందమైన థీమ్‌ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మంత్రి సురేఖ చెప్పారు.    అన్ని జంక్షన్లను సుందరీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరో రెండు గ్యారెంటీలు  అమలు చేయనున్నామని, ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నగరానికి సుమారు రూ. 260 కోట్ల నిధులను అందించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ..అధికారంలోకి వొచ్చిన 75 రోజులలోనే తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి  సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తూ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తుందని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా సుమారు 5 నుండి 6 వేల వరకు ఆదా చేస్తున్నామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ పథకంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిందని, అయినప్పటికిని ఒకటో తేదీలోగా ఉద్యోగులకు జీతాలు అందించామని చెప్పారు. మేయర్‌  గుండు సుధారాణి మాట్లాడుతూ….నగర పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరం ముంపునకు గురికాకుండా రూ. 250 కోట్లు కేటాయించారని, టియుఎఫ్‌ఐడిసి నిధులతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.   అంతకు ముందు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ ఆధ్వర్యంలో రూ. 19 లక్షల విలువగల 12 ద్విచక్ర వాహనాలు( మోటరైజ్డ్‌ వాహనాలు), 5 బ్యాటరీ వీల్‌ చైర్లను మంత్రుల చేతుల మీదుగా దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్డన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మురళినాయక్‌, కార్పొరేటర్లు చింతాకుల అనిల్‌ కుమార్‌, తూర్పాటి సులోచన సారయ్య, బైరబోయిన ఉమా దామోదర్‌ యాదవ్‌, గుండు చందన పూర్ణ చందర్‌, గుండేటి నరేందర్‌, పస్కుల బాబు, ముష్కమల్ల అరుణ సుధాకర్‌, కావేటి కవిత, పోశాల పద్మ అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్‌ డి ఓ కృష్ణవేణి,జి డబ్ల్యు ఎంసిఎస్‌ఈలు కృషా రావు, ప్రవీణ్‌ చంద్ర సిఎంహెచ్‌ఓ డా.రాజేష్‌తో పాటు రెవెన్యూ పోలీస్‌ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *