తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. అందుకే మలి దశ తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరిలో బుద్ధిజీవులు, మేధావులు రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ చెదురుమదురుగా రకరకాల కూటములు,వేదికలు పనిచేస్తున్నప్పటికీ ప్రజలకు చేరలేదు. 2001లో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత మలిదశ ఉద్యమానికి తొలికిరణం అయ్యింది.కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ఒక మలుపు అయ్యింది.ఎనిమిదేండ్ల పాటు ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనుకకు అన్న మావోయిస్టు పంథాలో పార్టీ పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన దీక్షాదివస్ నేడు.
ప్రజలలో తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించేలా, అందరిలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయాన్నిపురికొల్పేలా చేసిన సీఎం కేసీఆర్ ఆనాడు నవంబర్ 29వ తేదీనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉద్యమనేత సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ కదిలించింది. మొక్కవోని దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. కసీఆర్ ఉద్యమ సంకల్పం ముందు ఢల్లీి గద్దె తలదించక తప్పలేదు. తెలంగాణ తల్లి ఎదుట ఢల్లీి మోకరిల్లినరోజు రోజు, తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి గుర్తింపు లభించిన రోజు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి,సాధించిన చింతమడక బిడ్డ కేసీఆర్ గొప్పతనం ఒకవైపు, వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ క్రూరత్వం ఒకవైపు ఎన్నికల సందర్భంగా రెండు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు సాగించిన పోరాటంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆయన ఆమరణ దీక్ష చేయాలని తీసుకున్న దృఢసంకల్పానికి నవంబర్ 29న బీజం పడిరది.
కేసీఆర్ కారు అల్గునూర్ చేరగానే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పాలనలోని పోలీసులు అడ్డుగా వచ్చి కాన్వాయిని అడ్డగించి కారులో నుంచి బక్కమనిషిని లాగి హుజురాబాద్ మీదుగా ఖమ్మం తరలించారు. అయన అరెస్టును తెలంగాణ విద్యార్ధి లోకం ,ప్రజానీకం,మేధావి వర్గం ఏమాత్రం సహించలేదు. తెలంగాణ ఉద్యమం అన్ని జిల్లాల్లో కార్చిచ్చులా వ్యాపించింది.కేసీఆర్ సాగించిన ఆమరణ నిరాహార దీక్ష ప్రజలలో రాష్ట్ర సాధన ఆకాంక్షను మరింత బలోపేతం చేసి సబ్బండ వర్ణాలు ఉద్యమించేలా చేసింది. సకల జనుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రం మారుమోగిపోయింది.తెలంగాణ వస్తే జైత్రయాత్ర సాగుతుందని లేకుంటే నా శవ యాత్ర సాగుతుందని పలికిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష లో ఆరోగ్యం క్షీణించినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయాన్ని కొనసాగించారు. దీక్ష విరమించాలని ఎంతమంది విజ్ఞప్తి చేసిన ససేమిరా అన్న కేసీఆర్ ఆరోగ్యం విషమంగా మారగా, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేసే దాక కేసీఆర్ ఆమరణ దీక్ష అప్రతిహతంగా కొనసాగింది.2001 నుంచి కేసీఆర్ ఉద్యమాన్ని గాంధీజీ బాటలో అహింసాయుతంగా ముందుకు నడిపించాలని సంకల్పించారు. అదే రీతిలో అయన అరెస్టు సందర్భంగా తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తినా కొన్ని చెదురు,మొదురు సంఘటనలు తప్ప ఎక్కడా ఉద్యమ కారులు అహింసా మార్గాన్ని వీడలేదు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మకమైన రోజు నవంబర్ 29.తెలంగాణ ఏర్పాటుపై అధికార ప్రకటన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని నుంచి వెనక్కి తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తెలంగాణ ప్రజల చైతన్యం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం కేంద్రాన్ని గుక్కతిప్పుకోనివ్వలేదు. ఫలితంగా ఐదేండ్లకు జూన్ 2, 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసికస్థితి, కేసీఆర్ దార్శనికత,అనుభవం ,సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారి తీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార జూస్తె అందుకు ఈ రోజున తగిన యోగ్యత గల నాయకుడు కేసీఆర్ ఒక్కరే కన్పిస్తున్నారు. కేసీఆర్ ఆలోచనలో ప్రజల కోరికకు తగిన సాధనం ప్రత్యామ్నాయ అజెండా రూపంలో ఉండటంతో పాటు ,ఒక వ్యక్తిగా అయన అందుకు సమర్ధుడైన నాయకుడు కావడం అనేకానేక సవాళ్ల ఎదుట అన్నింటిని వమ్ముచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ,ఎంతగానో వెనుకబడిన ప్రాంతాన్ని చూస్తూ,చూస్తుండగానే అభివృద్ధి,సంక్షేమ రంగాలలో దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాలలో తెలంగాణను నిలబెట్టగల్గిన ధీరుడు అయన.ఉద్యమం మహాప్రస్థానమైతే పునర్నిర్మాణంలో మరో మైలురాయి. ఉద్యమకారుడే పాలకుడైన వేళ కేసీఆర్ తొమ్మిదిన్నర ఏండ్లలో అసాధారణంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లిఖించిన దీక్షా దివస్ ను నేడు తెలంగాణ ఉద్యమకారులంతా స్మరించుకుంటున్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ నేడు ఆ ఉద్యమ ఫలాలపై చర్చించుకుంటున్నారు.బీఆర్ఎస్ 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో పోరాడి ఉద్యమించి అలసి,సొలసి,గెలచి తెలంగాణను సాధించింది. ఆచార్య జయశంకర్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్షా అని, ఎన్నటికైనా తెలంగాణ తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.75 ఏండ్ల రాజకీయాల్లో కాంగ్రెస్,తెలుగుదేశం పరిపాలించిన ఒక లక్ష్యం కోసం ఒక స్పష్టమైన అజెండా నీళ్లు,నిధులు, నియామకాలు అనే కోణంలో పనిచేస్తున్న పార్టీ తెలంగాణ పార్టీనే, అదే భారత రాష్ట్ర సమితి. రాష్ట్ర అవతరణ తర్వాత సాధించిన ఎన్నో విజయాలుతొమ్మిదిన్నర ఏండ్ల స్వపరిపాలను కళ్లారా చూసిన ప్రజలు కేసీఆర్ నే తిరిగి ముఖ్యమంత్రిగా అజేయుడుగా నిలుపుకునేందుకు కంకణం కట్టుకున్నారనేది నిర్వివాదాంశం.
-డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, సెల్ : 9866255355





