ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి
3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ
సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో బుధవారం నీలిట్‌ సెంటర్‌(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ Ê ఇన్ఫర్మే షన్‌ టెక్నాలజీ)ని కిషన్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నీలిట్‌ సెంటర్‌ను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణ తరగతులు ప్రారంభించుకోనుండడం సంతోషకరమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యుగం నడుస్తుందని, ఇందులో..భారతదేశం రానున్న రోజుల్లో పూర్తిగా తన పట్టును పెంచుకుంటుందని అన్నారు. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ దేశాల్లో ఎలక్ట్రానిక్స్‌, ఐటీ రంగంలో సత్తాచాటు తున్నారని, నేడు అంతర్జాతీయం గా ఏ పెద్ద కంపెనీ సీఈవో అయినా.. మనదేశానికి చెందినవారు గానీ..భారత సంతతికి చెందినవారు గానీ ఉంటున్నారని తెలిపారు.

ఈ రంగంలో  మన యువతను తీర్చదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల తో శిక్షణ, నైపుణ్యత అందించే లక్ష్యంతో.. నీలిట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ న్నారు. సికింద్రాబాద్‌, తిరుపతిల్లో నీలిట్‌ సెంటర్‌  ఏర్పాటుకు ఆమోదం లభించిన నెల రోజులలోపే ప్రారంభిం చుకుం  టున్నామని ఇది యువ త సాధికారత దిశగా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనమని కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ Ê ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నీలిట్‌ సంస్థ..ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుందని వివరించారు. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో నీలిట్‌ కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. ఐటీ ఎగుమతులలో, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులలో భారత్‌ ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం వల్ల భారత్‌ను గమ్యస్థానంగా ఎంపిక చేసుకుని అనేక నూతన కంపెనీలు తమ తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కాలానుగుణంగా ఈ కంపెనీలు ప్రథమ శ్రేణి నగరాలలోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా తమ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. బడా కంపెనీలు అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎంతగానో అన్వేషిస్తున్నాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు ఆయా రంగాలలో అవసరమైన అత్యున్నతస్థాయి నైపుణ్య శిక్షణ కలిగిన మానవ వనరులను అందించే కేంద్రాల ఏర్పాటు కూడా అసరమైందని, రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

అందుకే.. ఇన్ఫర్మేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంబంధిత రంగాలలో ఉత్తమ శిక్షణ సంస్థల ఏర్పాటు కోసం తాను  కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కోరగా ఆయన వెంటనే  అంగీకరించి..ఏపీకి, తెలంగాణకు ఒక్కో నీలిట్‌ సంస్థను కేటాయించారని వివరించారు. నీలిట్‌ కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు, సంబంధిత రంగాలలో ఉజ్వల భవిష్యత్‌ కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి డెస్టినేషన్‌గా ఉంటాయని చెప్పారు. ఎంతో అత్యున్నతస్థాయి  కేంద్రాలలో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సంబంధిత కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో నూతన ఆవిష్కరణలకు, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా ఈ కేంద్రాల ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌ రెడ్డి  సూచించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యక కార్యదర్శి డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, నీలిట్‌ చెన్నై డైరెక్టర్‌  కేఎస్‌ లాల్‌మోహన్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *