ఎపిలో కారును ఢీకొన్న డిసిఎం…ఇద్దరు మృతి

నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య…
దుండగుల కోసం పోలీసులు గాలింపు

విజయవాడ/అమరావతి, జూలై 11 : విజయవాడ గన్నవరంవద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే  ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేటజిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్‌, ‌మతిన్‌గా గుర్తించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య…దుండగుల కోసం పోలీసులు గాలింపు.. ఎన్నో ఆశలతో విద్యాభ్యాసం కోసం హాస్టల్‌లో చేర్పించిన కొడుకును దుండగులు హత్య చేయడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని పులిరామన్నగూడెంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌ ‌లో నాలుగో తరగతి విద్యార్థి  దారుణ హత్యకు గురయ్యడు. ఉర్రింత గ్రామానికి చెందిన అఖిల్‌వర్ధన్‌ ‌రెడ్డి అనే విద్యార్థి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఎప్పటి మాదిరిగానే రాత్రి భోజనం చేసి నిద్రపోయాక అర్ధరాత్రి ముగ్గురు యువకులు హాస్టల్‌ ‌లైట్లను ఆఫ్‌ ‌చేసి సెల్‌ఫోన్‌ ‌లైట్ల వెలుతురులో హాస్టల్‌లోకి చొరబడ్డారు. అఖిల్‌ ‌వద్దకు వెళ్లి దుప్పటిని కప్పేసి బయటకు తీసుకొచ్చి కొద్ది దూరంలో పాఠశాల ఆవరణలో హత్య చేశారు.

మంగళవారం తెల్లవారుజామున హాస్టల్‌ ‌వార్డన్‌ ‌గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హాస్టల్‌కు చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. హాస్టల్‌ ‌నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడుతూ హాస్టల్‌ ‌గేట్‌వద్ద బైఠాయించారు. నిర్వాహకు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. నిందితుల కోసం జాగిలాల సహాయంతో పోలీసులు   గాలించారు. కాగా బాలుడి చేతిలో ఓ లేఖ లభ్యం కావడం, అందులో హాస్టల్‌ ‌నుంచి అందరూ వెళ్లిపోవాలని లేకపోతే అందరికీ ఇదే గతి పడుతుందని రాసి ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *