‘‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’
బాసర త్రిపుల్ ఐ.టి. ని ప్రభుత్వం ఐదా రేళ్ళుగా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేయటాన్ని మనమెలా అర్ధం చేసుకోవాలి.బాసర ఐ.టి.లో చదువూ లేదు.మౌలిక సౌకర్యాలూ లేవని విద్యార్థులు ముక్తకంఠంతో వాపోతున్నారు.దీనిపై ఆందోళన చెందాల్సిన విద్యా పరిరక్షణ కమిటీ,ఇతర విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలు గత ఐదేళ్ళుగా సరైన దిశగా దృష్టి సారించలేక పోయాయి. ప్రదానంగా తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ, వామపక్ష విద్యార్థి సంఘాలు తమ కర్తవ్యాన్ని విస్మరించాయని అనుకోక తప్పటం లేదు..గత సంవత్సరం వివిధ సమస్యలపై విద్యార్థులు వీరోచితమైన ఉద్యమాలు నిర్వహించి సర్కార్ వెన్నులో వణుకు పుట్టించారు. ఉద్యమం మీద ఉక్కుపాదం మోపి,నాయకుల మీద పదికి మించిన కేసులు పెట్టి క్యాంపస్ ను పోలీసుల మోహరింపుతో ప్రభుత్వం అదుపులో తీసుకుంది.యేళ్ళ తరబడి ఈ సర్కార్ నిర్లక్ష్యం ,మౌలిక సదుపాయాల లేమి కారణంగా గత సంవత్సరం విద్యార్థులు చేసిన పోరాటానికి గవర్నర్ తమిళి సై,మంత్రి తారక రామారావు,సబిత ఇంద్రారెడ్డి, ఇతర మంత్రుల సందర్శన హామీలు మినహాయించి దక్కిన ఫలితం ఏమీ లేదు. విద్యార్థులపై విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మిగిలాయి.విద్యార్థులు పెట్టిన పన్నెండు డిమాండ్లకు సమాధానం లభించలేదు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగలేదు.
బాసరలో సీట్ సాధించటం విద్యార్థులకు లక్ష్యంగా ఉండేది. ఈ ఐదేళ్ళ పయనంలో బాసర ఐ.టి ప్రభుత్వ నిరాదరణకు గురై పతనావస్థకు చేరువైందని విద్యార్థులు అభిప్రాయపడటం ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల రాక నాలుగు రెట్లు పడిపోవటం ఇందుకం సంకేతంగా చూడవచ్చు.గత సంవత్సరం పి.యు.సి మొదటి సంవత్సరం అడ్మిషన్లకు 40.158 అప్లికేషన్లు రాగా ,ఈ యేడు 13,538 అప్లికేషన్లే వచ్చాయి. గతం తో పోలిస్తే 60 శాతం అప్లికేషన్లు తక్కువ వచ్చాయి.దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సీటు లభించినా కూడా చేరేందుకు వెనుక ముందాడుతున్న విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది.
. బాసర ఐ.టి.ని 2018 నుండి నిధులు,నియమామాకాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది.విద్యార్థుల మౌలిక సదుపాయాలు సన్నగిల్లాయి త్రిపుల్ ఐ.టి.గత ఐదేళ్ళుగా అవినీతి ,అక్రమాలకు నిలయమై నిర్వహణా వైఫల్యాలతో క్రమంగా అధోపతనస్థాయికి చేరుకుంది.ఉద్దేశపూర్వకంగా దానిని పతనావస్థకు తేవటంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలవంతమయ్యాయని విద్యార్థులు అంటున్నారు.
ఈ యేడు మరింత పతనావస్థ లోకి
అంతర్జాతీయ స్థాయిలో దేదివ్యమానంగా వెలుగాల్సిన బాసర త్రిపుల్ ఐ.టి. నిర్వహణ ఈ సంవత్సరం మరింత దారుణంగా మారింది. పి.యు.సి.రెండవ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులను ఇంజనీరింగ్ డిగ్రీ లోకి ప్రమోట్ చేయటానికి మూడునెలల ఆలస్యం అవుతుందని ప్రకటించారు.మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ రెండవ సెమిస్టర్ నిర్వహణ ఆలస్యం కావటమే ఇందుకు కారణమని తెలుస్తూంది.బ్రాంచ్ లు కేటాయించటంలో ఆలస్యం అవుతుండటంతో పి.యు.సి.రెండవ సంవత్సరం పూర్తయిన దాదాపు 1500మంది విద్యార్థులు తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.మరో వైపు పి.యు.సి మొదటి సంవత్సరంలో ఈ యేడు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.ఈ యేడు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు.పి.యు.సి. మొదటి రెండు సంవత్సరాల కోర్సులో నాలుగు సబ్జెక్టులకు ఫాకల్టీ లేరు.విద్యార్థులు యూట్యూబ్ లలో సిలబస్ చూసి పరీక్షలకు కు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడున్న పి.యు.సి.రెండు సంవత్సరాల చదువు పూర్తికాగానే ఇంజనీరింగ్ డిగ్రీ బాసరలో కొనసాగించేందుకు 50శాతం విద్యార్థులు సిద్దంగా లేరు. పి.యు.సి. రెండు సంవత్సరాలం పూర్తి కాగానే బాసర విడిచి వెళ్ళిపోయే విద్యార్థుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.పి.యు.సి. రెండేళ్ళ విద్యార్థులకు నాలుగేసి సబ్జెక్టులకు ఫాకల్టీ లేదు,వున్న ఫాకల్టీ కూడా సరైన అర్హతలు,అనుభవం ఉన్నవారు కాకపోవటం ఫలితంగానే విద్యార్థులకు సిలబస్ అర్ధంకాక పరీక్షలలో ఫెయిలవుతున్నారని విద్యార్థులు అంటున్నారు.సరైన జీతాలు సకాలంలో ఇస్తే అర్హత,అనుభవం గల ఫాకల్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేనేజ్ మెంట్ అందుకు సిద్దంగా లేదు. త్రిపుల్ ఐ.టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగితే మరో మూడేళ్ళలో విద్యార్థులు లేకుండా బోసిబోతుంది.
విద్యార్థి, విద్యా పరిరక్షణ కమిటీల పట్టింపేది?
గత ఐదేళ్ళుగా బాసర త్రిపుల్ ఐ.టి.లో తిష్ట వేసిన సమస్యలపై విద్యార్థులు ఏనాడు తమ గళం విప్పలేదు. గత విద్యా సంవత్సరం విద్యార్థుల అసహనం ఉద్యమరూపం దాల్చింది.తెలంగాణలో అన్నిరకాల ప్రజా ఉద్యమాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న వేళ, ప్రజాసంఘాలు నిరసనలకు మాత్రమే పరిమితమై అరెస్ట్ లకూ,గృహ నిర్భంధాలకు పరిమితమైతున్న వేళ,ఆ నిశ్శబ్ధాన్ని బద్ధలుచేస్తూ బాసరవిద్యార్థులు ఉద్యమించారు. రాత్రి పగలు ఎండ వానలు లెక్కచేయక తిండి తినకుండా ఉద్యమించి 12 డిమాండ్లను ముందుకు తెచ్చారు.ప్రధానంగా క్యాంపస్ లో మౌలిక సదుపాయాలపై డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి స్వయంగా క్యాంపస్ సందర్శించాలని పట్టుబట్టారు.
స్థానిక జిల్లా కలెక్టర్,స్థానిక మంత్రి ఇంద్రకిరణ్ ,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు.విద్యార్థుల డిమాండ్లను ‘‘సిల్లీ’’కోరికలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వాఖ్యలపై విద్యార్థులు కన్నెర్రచేశారు.ఒకవైపు చర్చలు కొనసాగిస్తూనే క్యాంపస్ నిండా పోలీస్ ల పహారా పెట్టించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు.ఉద్యమనాయకులపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు బనాయించి వారి విద్యాభవిష్యత్తు నాశనం చేస్తామని పోలీసులతో బెదిరింప చూశారు.గవర్నర్ తమిళి సై,మంత్రి కె.తారకరామారావు లు బాసర విద్యాకేంద్రాన్ని సందర్శించి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు.చదువుల్లో మెరికల్లాంటి ఇరవైయేళ్ళ వయసు పిల్లలు ,ఉద్యమాల అనుభవం లేకున్నా వారి ఉద్యమస్ఫూర్తిని ప్రజాసంఘాలు,రాజకీయపక్షాలు అభినందించాయి,మద్దతు ఇచ్చాయి.ఈ మద్దతులూ, అభినందనలు బసరా విద్యాకేంద్రం గేట్ లోపలకు వెళ్ళలేకపోయాయి.
గేట్ లోపల ఉద్యమాన్ని పోలీసులు అరెస్టులతో అణచివేశారు.గేట్ లోపల విద్యార్థుల ఉద్యమం పై ప్రజాసంఘాలు గేట్ బయట రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. బాసర ఐ.టి.లో ఏం జరుగుతుందో తెలంగాణ సమాజానికి చెప్పేందుకు ప్రయత్నించారు. గేట్ బయట విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి నప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించి హంగామా చేశారు.గేట్ లోపల 8000 మంది విద్యార్థులు చేసిన ఉప్పెన లాంటి ఉద్యమంలో మమైక్యమై వారి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం విద్యార్థి,యువజన సంఘాలు కానీ వివిధ ప్రజాసంఘాలు కానీ చేశాయని చెప్పుకోవటానికి ఏమీ లేదు. విద్యార్థి, ప్రజాసంఘాలు మరింత చొరవ చూపి ఆ ఉద్యమానికి భౌతికంగా మద్దతు ఇవ్వాలి ఉండేది.గత సంవత్సరం ఆ ఉద్యమం జరుగుతుండగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే మరో ముగ్గురు పి.యు.సి చదివే బాలికలు వేర్వేరు కారణాలతో (రోడ్ ప్రమాదంలో ఒకరు) విగత జీవులయ్యరు.దీపిక ఆత్మహత్య కేసులో చీఫ్ వార్డెన్ మధుసూదన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ దత్తు వీరిద్దరు దీపికను వేధించి హత్య చేశారని,ఇది ముమ్మాటికి హత్య కిందనే భావిస్తూ వారిపై క్రిమినల్ కేసు,నమోదు చేయాలని ఆరోపిస్తూ విద్యార్థులు చేసిన ఆందోళనను అధికారులు పోలీసుల సహాయంతో చెదరగొట్టారు.బాసర ట్రిపుల్ ఐ.టి.విద్యా కేంద్రం ప్రైవేటు సంస్థ కాదు ,ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక విద్యా సంస్థ అయినప్పుడు విద్యార్థి ప్రజా సంఘాలకు బాసర గేట్ లోపలకు ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వని కారణాలను ప్రశ్నించాలి. అంతగా గోప్యత పాటించాల్సిన అవసరం, హక్కు ఒక ప్రభుత్వ విద్యాకేంద్రానికి ఉండాల్సిన అవసరం లేదు.తల్లిదండ్రుల కమిటీ,విద్యార్థి,ప్రజా సంఘాలకు లోపలకి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వక పోవటాన్ని తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరముంది.
బాసర త్రిపుల్ ఐ.టి లో అడుగడుగునా అవినీతి , అక్రమాలు జరుగుతున్నాయని, విద్యార్థుల నుండి బలవంతపు వసూళ్ళు జరుగుతున్నాయని,ఈ అవినీతి,అక్రమాలలో జిల్లా,రాష్ట్ర రాజకీయ నాయకుల హస్తం వుందని బాసర విద్యార్థి ఉద్యమ నాయకులు గొంతెత్తి వాపోతున్నా కూడా వారి సమస్యలు గేట్ దాటటం లేదు. గేట్ లోపలకు ఇతరులకు ప్రవేశం లేదు.ఈ విద్యాసంవత్సరం పి.యు.సి రెండవ సంవత్సరానికి చెందిన దాదాపు 1500మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ బ్రాంచ్ లను కేటాయించకుండా బలవంతంగా ఇళ్ళకు పంపించటం వెనుక బలమైన కుట్ర ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.ఫ్యాకల్టీని రిక్రూట్ చెయ్యకపోవటం,నిధులు విడుదల చేయకపోవటం, మౌలిక వసతులు కల్పించక పోవటం,క్యాంపస్ లో అకారణంగా పోలీసు కంపెనీలను మోహరించి విద్యార్థులను భయభ్రాంతులను చేయటం ,ప్రశ్నించే విద్యార్థులను పోలీస్ ఔట్ పోస్ట్ లో రోజుల తరబడి బంధించటం మెస్ భోజనం నాణ్యత లేకపోవటం ఇవన్నీ క్రమంగా బాసర విద్యాకేంద్రంలో విద్యార్థులు లేకుండా చేయటం,అంతిమంగా త్రిపుల్ ఐ.టి.ని మాయం చేయటానికి పథకం ప్రకారం ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తు కున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.
– అజయ్
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్.వరంగల్
సంపాదక వర్గ సభ్యుడు, ఉపాధ్యాయ దర్శిని




