ఉచిత హామీల పై చర్చ జరగాలి..

ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దివాలా  తీస్తున్నా..ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకిలా అని ప్రశ్నించడం లేదు. లబ్ది పొందుతున్న వారు ఎలాగూ ప్రశ్నించరు. విపక్షాలకు కూడా వోట్ల్లు కావాలి గనక ప్రశ్నించడం లేదు. ఇక పన్నులు కట్టేవారు కూడా ప్రశ్నించడం లేదు. మేధావులు కూడా నిలదీయడం లేదు. ఇలా అయితే రాజకీయ  పార్టీలు వోట్ల వేటలో చేస్తున్న పథకాలు, పందేరాలతో రాష్టాల్రు అప్పులో ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ, ఎపిల్లో ఇలాంటి దుస్థితి నెలకొంది. రాజకీయ పార్టీల ఉచిత పథకాల హాలపై సుప్రీంకోర్టు గతేడాది కీలక వ్యాఖ్యలు చేసింది. అయినా రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను, అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం లేదు. సరికదా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి పథకాలను అమలు చేస్తున్నారు. బిసిలకు లక్షరూపాయల పథకం, దళితబందు పేరుతో పదిలక్షల పందేరం అన్నీ కూడా ఆర్థిక దివాలాకు హేతువు కాగలదు. ఎపిలో అయితే దానకర్ణుడిలా సిఎం జగన్‌ ‌పథకాలను ప్రకటిండం, నగదు బదిలీలు చేపట్టడం నిత్యకృత్యంగా మార్చుకుకున్నారు.

దీనికి ఎక్కడో ఒకచోట చెక్‌ ‌పడాల్సింది. డబ్బులు పంచే పథకాల బదులు అభివృద్ది పథకాలపై దృష్టి సారించాలి. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులను నేరు గా వోటర్లకు బదిలీ చేసే ప్రక్రియను ఆపకుంటే దేశం ఆర్థికంగా దివాలా తీస్తుంది. అభివృద్ది కుంటుపడుతుందని గుర్తించాలి. డబ్బులు పంచడమే అభివృద్ది అంటూ చేస్తున్న ప్రకటనలకు ఇకనైనా చెల్లు చీటీ చెప్పాలి. ఉచిత పథకాలు, నగదు బదిలీలు, పేదలపేరుతో చేసే పందేరాల విషయంలో సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడినందున మనం అత్యున్నత న్యాయస్థానానికి గౌరవం ఇవ్వాలి. ప్రజాస్వామ్య దేశంలో ఒక అంశంపై చర్చించి చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆనాటి చీఫ్‌  ‌జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ పునరుద్ఘాటించిన నేపథ్యంలో దీనిపై పార్లమెంట్‌ ‌విస్తృతంగా చర్చించాలి. ఏది ఉచితమో ఏది అనుచితమో చర్చించేందుకు విస్తృత ప్రజాభిప్రాయం సేకరించాలి. గ్రామస్థాయి వరకు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పందేరాలపై చర్చ చేయాలి. ప్రజలు కూడా నిర్భయంగా చర్చించాలి. రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, ఆర్థిక నిపుణలు ఎవరికి వారు తమ స్థాయిలో చర్చించి ఏది ఉచితమో..ఏది అనుచితమో..ఏది అవసరమో చర్చచేయాలి. విపక్షాలు కూడా ఉచితాలను ప్రకటించి వోట్లు  పొందాలన్న కక్కుర్తిలో పడి ఏదిపడితే అదే అన్నట్లుగా హాలు గుప్పిస్తున్నారు. దిల్ల్లీ, కర్నాటకలో ఇలా హాలు గుప్పించి  అధికారం పొందారు. కానీ ఇదే సందర్భంలో అభివృద్ది పూర్తిగా ఆగిపోయింది. ప్రజలే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఉచితంగా డబ్బులు అందుతున్నాయి గదా అనుకుంటే..పన్నుల రూపంలో మన జేబులు దోచేస్తున్న తీరును గుర్తించడం లేదు. తాము కష్టపడి పన్నుల రూపంలో కడుతున్న డబ్బులను ఉచితం పేరుతో ఇష్టానుసారంగా పంచిపెడుతూ రాజకీయ లబ్ది పొందుతున్న పార్టీలను దూరం పెడితే అసలు సమస్యే రాదు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ పార్టీలు అమలు చేసే ఉచిత పథకాలను నియంత్రించేలా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి. చట్టబద్దంగా ఇలాంటి ఉచిత పథకాలపై నియంత్రణకు దిగాలి. లేకుంటే పాలన అంటే పంచడం అన్నదే పనిగా పెట్టుకో గలరు.  పార్లమెంటులో చర్చ చేసి ఉచిత పంపకాలపై ఆంక్షలు విధించాలి.  దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రజల సంక్షేమం గురించి ఆసక్తి ఉన్నవారు వీటిని దృష్టిలో ఉంచుకొని సూచనలు చేయాల్సిన సమయం ఆసన్న మైంది. ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలు పెట్టాల్సి ఉంది. అలా వచ్చిన సూచనలను పార్లమెంటు ముందు పెడితే అక్కడ చర్చించి అయినా చట్టం చేస్తారేమోనని భావించాలి.

ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించడం ద్వారా దేశంలో ఓ అవసరమైన చర్చకు ఇప్పుడు నాంది పలకాలి. అయితే చర్చలకు దూరంగా ఉంటున్న మోదీ • ప్రభుత్వం ఈ విషయంలోనూ చర్చకు ముందుకు వొస్తుందన్న అవకాశం లేదని గతేడాదిగా చూస్తున్నాం. కానీ ఇప్పటికీ నిజాయితీగా ఉన్న నేతలు దీనిపై చర్చ చేస్తే మంచిది. పార్లామెంట్‌ అని చూడకుండా చట్టసభల్లో రాష్ట్రాలు  చర్చించాలి. ప్రజల్లో నేతలు చర్చించాలి. తమ డబ్బులను పందేరం చేస్తున్న నేతల తీరుపై రచ్చబండల్లో ప్రజలే చర్చించాలి. ఉచిత పథకాల అమలును ఎంతవరకు విచారించ వొచ్చన్న చర్చ జరగాలి.  అభివృద్ధి పనులు, మౌలిక వసతులను పక్కనపెట్టి కేవలం ఉచిత పథకాల కోసం డబ్బు ఖర్చుపెట్టడాన్ని మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏది ఉచితం? ఏది ప్రజల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న పథకం అని చెప్పడం నిజంగానే కష్టం. వృత్తిచేసుకునే వారికి అవసరమైతే వారు వ్యాపారాలు చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూతను అందించాలి. గ్రాణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గేవారి జీవనోపాధులు ఆ చిన్న పరికరాలపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటివి ఇవ్వడంవల్ల వారి జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది.

అయితే ఆర్థిక పరిస్థితులను తెలుసుకోకుండా అమలు చేసే వాగ్దానాలను అనుమతించకూడదని రాజకీయ పార్టీలు గుర్తించాలి. అలాగే ఉచిత పథకాలు అన్నవి పూర్తిగా ప్రభుత్వాల విచక్షణాధికార పరిధిలోని అంశమని చెప్పడానికి వీల్లేదు. ఏ రాష్ట్రమైనా ఉచిత పథకం అమలు చేస్తుంటే ప్రజలు కూడా వొద్దని అనలేరు. ఉచిత పథకాలు అమలు చేయకూడదని కేంద్రం చట్టం చేస్తే..అది చట్టబద్దత కు లోబడి ఉండాల్సి వస్తుంది కనుక జాతీయస్థాయిలో దీనిపై చర్చించాలి.  అధికారంలోకి వొచ్చిన పార్టీ అమలుచేసే ఉచిత పథకాల గురించి ఆర్థిక సమర్థత కూడా ముఖ్యం. అదేపనిగా అప్పులు చేస్తూ పథకాలు అమలు సమంజసమా కాదా అన్నదే ముఖ్యం. అప్పుడే అభివృద్ది అన్నది ముందుకు సాగుతుంది. రేపటి తరం భవిష్యత్‌ ‌కూడా ముఖ్యమన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలను సక్షించాలి. చర్చించాలి. అప్పుడే అభివృద్దికి నిధుల కనుక ఆ దిశగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేసే సంకల్పంతో ముందుకు సాగాలి.

– ప్రజాతంత్ర బ్యూరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *