నీవు నేర్పిన విద్యయే నీరజాక్షిగా పార్టీ పరిస్థితి
పార్టీ మారుతున్న బిఆర్ఎస్ నాయకులు
కలిసి రాని పేరు మార్పు…అసలుకే ఎసరు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి)
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిఆర్ఎస్ వెంటపడుతున్నాయి. వొచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీలు ఛాలెంజీ చేస్తున్నాయి. తాజాగా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్యనేత కెటిఆర్‌పైన ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారం పోయిందన్న ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు కెటిఆర్ వాగుతు న్నాడంటూ ఆయన తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ఆయన కెటిఆర్‌కు ఛాలెంజీ విసిరారు. దమ్ముంటే వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటును గెలిపించి చూపించాలని సవాల్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి కూడా ఇదే విధంగా విమర్శనాస్త్రాన్ని సంధించారు. బిఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగులేదని, రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క సీటుకూడా వొచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. వాస్తవంగా శాసనసభ ఎన్నికల్లో కూడా ఆ మాత్రం స్థానాలు వొచ్చేవి కావంటాడాయన. తమ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న విషయాన్ని ముందుగానే ప్రకటించి ఉంటే ఇప్పుడు వొచ్చిన 65 స్థానాలకు బదులు 80 స్థానాల వరకు వొచ్చేవంటూ బిఆర్ఎస్ పరిస్థితి అంతగా దిగజారిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు ఆ పార్టీ స్వయంకృతాపరాధమేనన్న విషయాన్ని కాంగ్రెస్, బిజెపితో పాటు జనవ్యాఖ్య కూడా వినవస్తున్నది. దశాబ్ధం పాటు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్ ఇప్పుడు ఉనికికోసం తాపత్రయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
అధికారంలోకి రాగానే ఎదుటి పక్షాలను నిర్వీర్యం చేయాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆ పార్టీని వెన్నాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటి నుండీ ఇప్పటికే పలువురు పార్టీ ఫిరాయించారు. గతంలో బిఆర్ఎస్ ఆధీనంలో ఉన్న పలు మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ వశమైనాయి. కాగా ముఖ్యనేతలు చాలా వరకు కాంగ్రెస్ లేదా బిజెపి కండువ కప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా సిట్టింగ్ ఎంపిలు కూడా అదే బాట పడుతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపి రాములుకు లైన్ క్లియర్ అయింది. తన కుమారుడితో సహా ఆయన ఇవ్వాళో రేపో కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్లు స్పష్టమవుతున్నది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో ఎంపి, ఖమ్మం నుంచి ఇంకో ఎంపి కాంగ్రెస్ నేతలతో మంతనాల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో వారి డిమాండ్లను అంగీకరించిన పక్షంలో గోడ దూకడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎంఎల్ఏలు ఉంటారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికంతకు ఉద్యమ నేతలను కాదని ఇతర పార్టీల నుండి వొచ్చిన వారిని అందలం ఎక్కించిన ప్రతిఫలమన్న భావన వ్యక్తమవుతున్నది. కేవలం తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమించిన వారైతే ఓటమిని కూడా జీర్ణించుకునేవారన్న మాట వినిపిస్తున్నది. గతంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాలను పొందినంత మాత్రన కృంగిపోకుండా నిరంతర పోరాటం చేసి, ఇప్పుడు దశాబ్ద కాలంగా భారత దేశాన్ని ఏలుతూ చరిత్ర సృష్టించింది. ఉత్తాన పతనాలన్నది సహజం.
అంత మాత్రాన పార్టీని వీడితే అది బీరుల లక్షణమవుతుంది. కాని, కేవలం ఆధికారంలో ఉండడానికే ఇష్టపడే నాయకులు పార్టీ వెన్నంటి ఉండరు. ఆ పరిస్థితిని బిఆర్ఎస్ చేతులారా చేసుకుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన కూడా. తెలంగాణకు ఐకాన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పు ఆ పార్టీ ఉనికినే దెబ్బతీసింది. దశాబ్ద కాలం ఏక ఛత్రాదిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన టిఆర్ఎస్ దేశ రాజకీయలపైన ఎప్పుడైతే ఆసక్తి కనబర్చిందో స్థానికంగా పట్టు కోల్పోయినట్లు అయింది. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు. ఆ పేరులో తెలంగాణ పదాన్ని తొలగించడం తెలంగాణతో దానికున్న అనుంబంధాన్ని దూరం చేసినట్లు అయింది. దాన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకున్నాయి. తెలంగాణకు కవచంలా ఉందనుకున్న టిఆర్ఎస్ తనంతటతానే ద్వారాలు తెరిచినట్లు అయింది. నిన్నటి వరకు ఎవరినైతే పరాయి పాలకులని విమర్శించిందో ఆ పార్టీలు రాష్ట్రంలో తమ పార్టీ కార్యక్రమాలను కొనసాగించడాన్ని కాని, పాలనా తీరును విమర్శించడాన్ని కాని బిఆర్ఎస్ నిరోధించలేకపోయింది. పైగా ఉట్టికీ..స్వర్గానికి కాకుండా పోయినట్లు అటు దేశ రాజకీయాల్లో రాణించ లేకపోవడం, ఇటు స్థానికంగా పట్టు కోల్పోవడం ఇప్పుడా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడినట్లు అయింది. అందుకే బిజెపి కూడా ఇప్పుడు తీవ్రంగా బిఆర్ఎస్ను విమర్శిస్తుంది. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్కు వేస్తే అనవసరంగా వోటును వృథా చేసుకున్నట్లేనంటున్నారాయన. అయితే కాంగ్రెస్‌పైన కూడా ఆయన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనని బిజెపి ఒక్కటే దేశాన్ని రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తుందని చెబుతున్నారు. రాహుల్ పిఎం కాదుకదా ఎంపి కూడా కాలేడని, ఈ ఎన్నికల తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోతాడని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలుపుకునే సత్తా ఆ పార్టీకి లేదని, మరో రెండు నెలల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆయన విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలతో రాష్ట్రంలో బిఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు పనిచేస్తున్నాయి.




