ఇక వాహన రిజిస్ట్రేషన్లలో నేటి నుంచి టీజీ అమలు

ప్రజల ఆకాంక్ష మేరకే నిర్ణయం..
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులకు కళకళ
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్‌కు బదులుగా టీజీ అనే పదాన్ని శుక్రవారం నుంచే అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్‌ 2 ఆవిర్భావ తేదీన కేంద్ర ప్రభుత్వం వాహనాలకు టీజీ అని గెజిట్‌ ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతీ గుర్తింపు కూడా టీజీగానే వొస్తుందని కానీ ఒక్క రవాణాకు మాత్రమే టీఎస్‌గా ఉంచారని మంత్రి పొన్నం తెలిపారు. గత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి కలిసి వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం టీజీగా మార్చాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి గెజిట్‌ విడుదల చేసిందన్నారు.

గతంలోనే దీనిపై శాసన సభ, క్యాబినెట్‌ తీర్మానం చేశామన్నారు. శుక్రవారం  నుండి వాహనాలపై టీజీగా 0001 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహంలో  మార్పులతోపాటు  తెలంగాణ రాష్ట్ర గీతంలో కూడా పలు మార్పులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను గౌరవిస్తామని, ఇటీవల  జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖలో వీఐపీల వాహన డ్రైవర్లకు ఫిట్నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తామన్నారు. గత 10 సంవత్సరాలుగా రిటైర్డ్‌ ఈడీ ఎండిగా చేశారని, ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేసిన పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తాము తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి కళకళలాడుతుందని, బస్‌ స్టాండ్‌లు, బస్సులు కిటకిటలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

100 శాతం మించి అక్యూపెన్సి దాటిందని చెప్పారు. 2013 నుంచి పెండిరగ్‌లో ఉన్న 280 కోట్ల ఆర్టీసి పెండిరగ్‌ బాండ్స్‌ విడుదల చేశామని, 2017 నాటి పీఆర్సీ 21 శాతం ఫిట్మెంట్‌ అందించామని,  ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసి భాగస్వామ్యం కీలకమైందని కొనియాడారు. కొత్త బస్సుల కొనుగోలు చేస్తున్నామని, సంస్థను ఆపరేషనల్‌ లాస్‌ నుండి బయటకు తెస్తున్నామని, ఆర్టీసి ఆదాయ మర్గంపై దృష్టి సారించిందని చెప్పారు. ఆర్టీసిలో మెకానిక్‌లు, శ్రామికులు వివిధ డిపార్ట్మెంట్‌ లలో 3500 నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు ఆటో కార్మికులకు అండగా ఉంటామని, వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టద్దని విపక్ష నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *