(‘జూన్ 16’ గృహకార్మికుల దినోత్సవం..)
ప్రతిరోజూ కళ్ళముందు కనిపిస్తున్నా గానీ, వారి శ్రమతోనే కోట్లాది మంది మధ్య, ఉన్నత వర్గాల రోజువారీ జీవితం సజావుగా సాగుతున్నప్పటికీ సామాజికంగా హేళనకు, ఆర్థిక, శ్రమ దోపిడీకి గురవుతున్న వారు గృహ కార్మికులు. వాడుకలో ‘పని మనుషులు’ అని తక్కువతనంతో ఈసడింపు గురయ్యే మహిళా సమూహం వీరే. ఈ మధ్య వస్తున్న సినిమాలు, సీరియళ్లలో ఈ సమూహాన్ని అత్యంత క్రూరంగా కించపరచటమే కాదు, వారి మీద శారీరక హింస చేసినా తప్పులేదు అనే భావాన్ని పెంచుతున్నారు. ఒక పక్క వారు తమ కనీస ప్రాథమిక హక్కులే లేకుండా మనుగడ సాగిస్తున్నారని అధ్యయనాలు తెలియజేస్తుంటే, మరో పక్క మధ్యతరగతి కుటుంబాలను దోపిడీ చేస్తున్నవారిగా మీడియాలో చూపించటం గృహకార్మికుల మీద జరుగుతున్న వివక్షకు, హింసకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఈ విషప్రచారాన్ని పక్కనపెడితే- గృహకార్మికుల హక్కులను, వారికి కావలసిన రక్షణ వ్యవస్థలను సాధించడం కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన యునివర్సల్ పీరియాడిక్ రివ్యూల ద్వారా నిరంతరం గృహకార్మికుల స్థితిగతులపై అధ్యయనంతో పాటు, వారిని సంఘటితపరుస్తూ, సమీకరిస్తూ క్షేత్రస్థాయిలో గత రెండున్నర దశాబ్దాలుగా వారితో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలలోనూ, జాతీయ స్థాయిలోనూ తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్, గృహకార్మికుల యూనియన్(తెలంగాణ రాష్ట్రం), డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ (ఆంధ్రప్రదేశ్), ఆంధ్ర డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్, నేషనల్ ఫ్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ (NPDW) వంటివి నిర్విరామంగా పనిచేస్తున్నాయి.
2011 జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) 198 కన్వెన్షన్లో ప్రతీ సంవత్సరం జూన్ 16న గృహకార్మిక దినోత్సవంగా ప్రతి దేశంలోనూ జరపాలని, గృహకార్మికుల హక్కులను ఆయా దేశాలు పరిరక్షించాలని కోరుతూ తీర్మానించారు. భారత ప్రభుత్వం కూడా ఈ కన్వెన్షన్ లో పాల్గొని ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ (దీన్ని C-189 అంటారు) ఇంటి పనివారలను కూడా కార్మికులుగా గుర్తిస్తూ, వారి హక్కులు పరిరక్షిస్తానని అంగీకరించింది. కానీ, ఈ తీర్మానాన్ని పార్లమెంటులో రాటిఫై చేయకుండా కాలయాపన చేస్తూ గృహకార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని భారత ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.

గ్రామీణ వ్యవసాయరంగంతో పాటు ఉపాధి కల్పించాల్సిన ఇతర రంగాలలో అవకాశాలు తగ్గిపోవడంతో, కుటుంబాలను పోషించుకోవటం కోసం బడుగు- బలహీన వర్గాల మహిళలు తక్కువ వేతనాలతోనే ఈ రంగంలో పనిచేయాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర, పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగటం వల్ల కూడా గృహకార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కుటుంబ ఉపాధి కోసం వెంటనే చేయగలిగిన పనిగా మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే, వీరికి తమకు రావలసిన న్యాయమైన వేతనాలు, సామాజిక సంరక్షణ, బీమా వంటివాటి గురించి తెలిసే అవకాశం ఉండదు. అసలు అలాంటివి ఉన్నాయని చెప్పినాగానీ వాటిని అంగీకరించటానికి గృహకార్మికులతో ఇంటిపని చేయించుకునే వ్యక్తులు కూడా సిద్ధంగా ఉండరు. పని చేసేవారికి, చేయించుకునే వారికి ఏకకాలంలో అవగాహన కల్పించటం కేవలం సంఘాల బాధ్యతే కాదు, సంబంధిత ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఆ అవగాహనతో పనిచేస్తేనే సాధ్యమౌతుంది.
ఇటీవలకాలంలో కొన్ని నూతన కార్మిక చట్టాలను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే వాటిలో గృహకార్మికుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవటమే కాదు, వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు, అందుకు సంబంధించిన రక్షణల (ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్)లో కూడా ఎటువంటి చోటు కల్పించలేదు. వీరిని దీనిలో పూర్తిగా విస్మరించారు. గృహకార్మికులు వ్యక్తుల ప్రైవేట్ ఇళ్లలో పనిచేస్తారు. అదే వారి పనిచేసే ప్రదేశం. ఇతర రంగాలలోని పని ప్రదేశాల నుండి ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. అందుకే గృహకార్మికుల పని పరిస్థితులని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి.
తక్కువ వేతనాలు, రక్షణకి హామీలేని పరిస్థితులు, సామాజిక అవహేళనతోపాటు గృహకార్మికులు ప్రధానంగా ఆరోగ్యపరమైన అంశాలలో ఏ రకమైన మద్ధతు వ్యవస్థలూ లేక తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ అంశం మరింత తీవ్రంగా గృహకార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. కోవిడ్ సమయంలో సాధారణ జబ్బులు, అత్యవసర ఆరోగ్య పరిస్థితుల కోసం ప్రభుత్వ దవాఖానాలు అందుబాటులో లేకుండా పోయాయి. అసలే తక్కువగా వున్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు, పైగా కోవిడ్ సమస్యలు, దీనితో ఎంతో మందికి సాధారణ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకుండా పోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళటం చాలా ఖరీదైన వ్యవహారం. అంత ఖర్చుని భరించగలిగే పరిస్థితి ఉండదు. పైగా కోవిడ్ భయంతో గృహ కార్మికులను ఏ రకమైన రక్షణ లేకుండానే చాలామంది యజమానులు పని నుంచి తొలగించటమే కాకుండా ఇవ్వాల్సిన వేతనం కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులలో అనేక మంది గృహకార్మికులు ఆకస్మిక గుండెపోటు కారణంగా ఏ రకమైన ఆరోగ్య సహాయం అందుబాటులో లేకపోవడంతో మరణించారు. కొందరు పక్షవాతం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. మరికొందరు గ్యాస్ట్రోఎంటెరిటిస్, కడుపు రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థలు తక్కువ అవటం, వైద్యం అత్యంత ఖరీదుగా ప్రైవేటు పరంలో ఉండటం, తక్కువ వేతనాలతో కుటుంబ పోషణను చేయలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
కోవిడ్ లాంటి అసాధారణ పరిస్థితులు లేని సమయంలో కూడా సరియైన నివాసం, రవాణా సౌకర్యం లేకపోవటం, కనీస సౌకర్యాలను అందుకోలేని పరిస్థితుల్లో గృహకార్మికులైన మహిళలు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తుంటారు. దీనితో కోలుకోలేని విధంగా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, పౌరసమాజ సంస్థలు, ప్రజల ముందుకు తమ ఆరోగ్య రక్షణ కోసం తక్షణం తీసుకోవలసిన అంశాల గురించి గృహకార్మికులు ఈ కింది డిమాండ్లు తెస్తున్నారు.
• గృహకార్మికులందరికీ అవసరమైనప్పుడు ఏవిధమైన ఆర్ధిక భారం లేకుండా సులభమైన పద్ధతుల్లో హాస్పిటల్స్ ల్లో ఆరోగ్య సంరక్షణ పొందే విధానాన్ని ప్రకటించాలి.
• సమగ్ర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవ, పేదలకు ఆరోగ్య సంరక్షణ లభ్యతను చూడవలసిన తక్షణ బాధ్యత ప్రభుత్వాలదే.
• సానుకూలమైన సిఫార్సులతో (రిఫరల్ సిస్టమ్) ఇన్-పేషెంట్ గా, ఔట్ పేషెంట్ గా కూడా ఆరోగ్య రక్షణని కలిగి ఉండే వ్యవస్థను రూపొందించాలి.
• భారతదేశంలోని అత్యుత్తమ ఆరోగ్యమద్ధతు వ్యవస్థలలో ESI ఒకటి. దీని పరిధిలోకి గృహకార్మికులను కూడా తీసుకురావాలి. అందుకు అనుగుణమైన చర్యలను తీసుకునేలా వ్యవస్థను రూపొందించాలి.
• 2011 ESI సవరణ చట్టం ప్రకారం, ఇతర వర్గాల ప్రజలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం వుంది. దీనికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ వనరులలో మార్పుతో పాటు, బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచాలి.
• సమాజంలో గృహకార్మికుల కష్టార్జితంతో సమాజం ఎంతో లబ్ది పొందుతోంది. వాళ్ల శ్రమ మన సమాజానికి ఆయాచితంగా లభించే సబ్సిడీతో సమానం. అటువంటి గృహకార్మికుల ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం GDPలో 2-3 శాతం బడ్జెట్ కేటాయింపు తప్పనిసరి చేయాలి.
• గృహ కార్మికుల పని ప్రదేశం ప్రైవేటు ఇళ్లు కాబట్టి, ఇంటి పన్నులో ఒక శాతం, GSTలో ఒక శాతం ప్రభుత్వం ESI బోర్డుకి చెల్లించాలి. ఇది అసాధ్యమైన విషయమేం కాదు.
• ESI లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మానవ వనరులు- వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది కేటాయింపులు సరైన విధంగా చేయాలి. సమాజంలోని అసంఘటిత శ్రామిక వర్గాలన్నిటికీ వైద్య సంరక్షణ, లభ్యత అందుబాటులో ఉండాలి.
వీటితో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గృహకార్మికుల కనీస వేతనాలు పునరుద్ధరించాలి. సక్రమంగా అమలయ్యేలా వ్యవస్థాపరమైన చర్యలు తీసుకోవాలి. గృహకార్మికుల కోసం ఒక సమగ్ర చట్టం అమలులోకి తీసుకురావాలి. గృహకార్మికుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సినిమాలు, సీరియళ్ళలో చిత్రించటాన్ని నిషేధించాలి. పనిచేసే గృహాలను పని ప్రదేశాలుగా గుర్తించాలి. వారానికి ఒకరోజు సెలవు దినం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. ESI, PF పథకాలలో గృహ కార్మికులను చేర్చి, ఆరోగ్య భద్రత, సామాజిక బీమా కల్పించాలి. గృహ కార్మికుల నివాసహక్కులను మానవ హక్కులుగా పరిగణిస్తూ, బలవంతంగా వారి ఇండ్ల తొలగింపులను నిలిపివేయాలి, వారికి స్థిరనివాసం కల్పించాలి.
జూన్ 16న అంతర్జాతీయ గృహకార్మికుల దినోత్సవం సందర్భంగా పైన చెప్పిన ఈ అంశాలన్నిటి గురించి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా పట్టించుకుని ILO C-189 ని శాసనసభల్లో ఆమోదించాలని, అన్ని స్థాయిల్లో చర్చించాలని, మార్పులు తీసుకురావాలని వారు కోరుతున్నారు. జనాభాపరంగా కోట్లలో వున్నాగానీ అసంఘటితంగా వున్న గృహకార్మికులు సంఘటిత రూపం తీసుకోవడానికి ఇదే మంచి తరుణం కూడా.




